రాణి శివశంకర శర్మ రచన "ది లాస్ట్ బ్రాహ్మిన్"
రాణి శివశంకర శర్మ రచన "ది లాస్ట్ బ్రాహ్మిన్" ఆత్మ చరిత్రాత్మకమైన మ్యూజింగ్స్ వంటిది. పూర్తిగా స్వీయచరిత్ర అనికాని, లేక జీవితానుభవాలు అని కాని చెప్పలేము. తరచూ ఒక అంశం నుంచి మరొక అంశానికి మారుతారు.(శాఖాచంక్రమణ చేస్తారు.) రేడికల్ గా ఉంటూనే అనేక సంప్రదాయ భావాలు ఈ రచనలో కనిపిస్తాయి. యగ్జ యాగాలు చేసే, ఋత్విక్కులుగా పనిచేసే కుటుంబం, ముంగండ అగ్రహారంలో పేరూరు ద్రావిడులు, తండ్రి మహామహోపాధ్యాయ బిరుదు పొందినవ్యక్తి, వేదాంతశాస్త్ర పారంగతులని ప్రసిద్ధికెక్కిన రాణీ నరసింహశాస్త్రి, వర్ణాశ్రమధర్మలను తు,చ తప్పకుండాపాటించి, సంస్కృత కళాశాల ప్రధాన ఆచార్యులుగా చేసినా, తన వ్యక్తిగత కఠిన నియమబద్ధ జీవితంలో కుటుంబాన్ని ఆశ్రద్ధచేశారు.ఒక కుమారుడు సైన్స్ లో పిహెచ్. డి చేసి, శాస్త్రవేత్త అయి, సన్యసించి పీఠాధిపతి అయనారు. ఇంకో కుమారుడు బాల్యంలో చదువబ్బక, తర్వాత సంస్కృతంలో విద్యాప్రవీణ డిగ్రీ సాధించి నాస్తికుడుగా, విప్లవ రచయితగా, ఆనార్కిస్టుగ అనేక అవతారాలు ఎత్తిన వైనం ఈ పుస్తకంలో వివరంగా ఉంది. తరచూ మరికొన్ని వివరాలు ఇచ్చివుంటే బాగుండేదనిపిస్తుంది.
యవ్వనంలో యువతీ యువకులు సాధారణంగా అనుభవించే అనేక అనుభవాలు ఇందులో చోటు చేసుకున్నాయి. పూర్తిగా సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరగడంవల్ల, ఓరియంటల్ డిగ్రీలు, ఆ విద్యావాతావరణం వల్ల కొన్ని ప్రత్యేక అనుభవాలు రచయితకు కలిగాయి. బాగా సంపన్న, భూస్వామ్య కుటుంబం అయినా, ఆధునికత లేని కుటుంబం. పురుషాధిక్య భావజాలాల ప్రతినిధి తండ్రి, అణిచి వేయబడి, నోరులేని, మరమనిషి వంటి తల్లి, ఆనువంశికంగా మతిభ్రమణం వగైరా కొన్ని అవ లక్షణాలు కుటుంబంలో ఉన్నాయి. అన్నీ రచయిత వ్యక్తిత్వం ఏర్పడడంలో పాత్ర వహించాయి. పైగా చెడ్డ 'ఇంమ్పల్సివ్'గా నడుచుకొనే మనిషి ఆయన. తన తల్లి, మేనత్త, అక్కాచెల్లెళ్లచుట్టూ తన బాల్య, యవ్వనాలను వివరిస్తూ, తన అభిప్రాయాలను వర్ణించాడు. ఈ పుస్తకం తండ్రి మరణంతో మొదలయి, తల్లి ఉత్తరక్రియలతో ముగుస్తుంది. కుటుంబ సభ్యలు, తన అధ్యాపకులు మొదలయిన వారి చిత్రణ ఆసక్తికరంగా ఉంది. ఆంగ్లవిద్య నిరకారింపబడి, యిస్టం లేని ఓరియంటల్ చదువులకు పంపబడడం నుంచి పుట్టిన ఆత్మన్యూనతాభావం నుంచి వ్యక్తి తీవ్రభావాల వయిపుకు మరలుతాడేమో అని అనిపిస్తుంది ఈ పుస్తకం చదివినపుడు. వ్యక్తి జీవితానుభవాలు కనక చదివించే గుణం ఇందులో పుష్కలంగా ఉంది.
ఈ రచనలో 'వటపత్రశాయి' అంటే రావి ఆకుపై శయనించిన శ్రీ మహావిష్ణువు అన్నారు. పంచవటిలో మర్రి, రావి కూడా ఉన్నా, లోకంలో వటపత్రశాయి అనగానే మర్రి ఆకుపై శయనించిన బుజ్జి శ్రీ మహావిష్ణువు గుర్తుకు వస్తారు.
గ్రామదేవతల విగ్రహాలు చిన్న చిన్న రాళ్ళు కదా, వాటిని కిరాస్తానీ మత ప్రచారకులు తొలగించరన్నారు. 19 శతాబ్ది మధ్యభాగంలో మతప్రచారకులు క్రైస్తవం ఇచ్చి, దళిత వాడల్లోని అమ్మవార్ల రాళ్ళను బళ్ళమీద తెప్పించి చర్చి ప్రాంగణాలలో కుమ్మరించిన విషయం అనేక పుస్తకాలలో, 'లోన్ స్టార్ చర్చి' చరిత్రలో ఉంది.
ఈ పుస్తకం చదువుతూన్నంతసేపు పాఠకులకు తమ బాల్యం, యవ్వనం, చదువులు అన్నీ కళ్ళముందు నిలుస్తాయి. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబజీవితం ఈ పుస్తకంలో గ్రంధస్తం అయినది.
మూలాలు:రాణి శివశంకరశర్మ రచన 'ది లాస్ట్ బ్రాహ్మిన్' రచయిత సొంత ప్రచురణ: 2002 తొలిముద్రణ.