రామమోహన గ్రంథాలయం
రామమోహన గ్రంథాలయం విజయవాడలోని ఒక చారిత్రాత్మకమైన గ్రంథాలయం. దీనికి శతాబ్దంపైగా చరిత్ర గలదు.
చరిత్ర
[మార్చు]బ్రహ్మసమాజం వారు 1903 లో ఆస్తిక పుస్తక భాండాగారం అను పేర ఒక గ్రంథాలయాన్ని నెలకొల్పారు. ఇందుకు ఈ. సుబ్బుకృష్ణయ్యగారు, కలకత్తాకు చెందిన బాబు హేమచంద్ర సర్కార్, లండన్ నగరంలో గల బ్రిటిష్ అండ్ ఫారన్ యూనిటేరియన్ సంఘం 200 పుస్తకాలను ఉచితంగా ఇచ్చారు. కానీ కొన్ని కారణాలవలన ఒక దశాబ్దంలోపలే అది మూతపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆకాలంలో అయ్యంకి వెంకటరమణయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, గోపరాజు బ్రహ్మానందం, పాటిబండ్ల సుబ్రహ్మణ్యం మొదలైన కొందరు యువకులు దానిని పునర్నించింది దీనికి ప్రముఖ సంస్కర్త రాజా రామమోహన రాయ్ పేరన "రామమోహన ధర్మ పుస్తక భాండాగారమ"ని 1911 లో నామకరణం చేశారు. అయ్యంకి వారు దానికి కార్యదర్శిగా అన్నీ తానే చూసుకున్నారు.[1]
భవన నిర్మాణం
[మార్చు]1912లో బందరు రోడ్డులో ఈ గ్రంథాలయం గల స్థలం వేలానికి వస్తే పురపాలక సంఘం వారినుండి దీనిని కొన్నారు. దానికి అవసరమైన ధనాన్ని చందాలు ప్రోగుచేశారు. కొంత ఖర్చును మునగాల రాజా నాయని వెంకట రంగారావు బహద్దరు, పాటిబండ సుబ్రహ్మణ్య, బొడ్డపాటి వెంకటప్పయ్య గార్లు అందించారు. 1913 నూతన గ్రంథాలయ భవనానికి అప్పటి మద్రాసు ప్రభుత్వ కార్యనిర్వాహక సభా సభ్యులుగానున్న సర్ వి. ఎస్. శివస్వామి అయ్యరు గారు శంఖుస్థాపన చేశారు. భవన ప్రవేశ మహోత్సవం పింగళి వెంకట రామారెడ్డి గారిచే జరుపబడింది. భవనానికి పై అంతస్థును కౌతా సూర్యనారాయణ గారు నిర్మించారు.
కార్యక్రమాలు
[మార్చు]విజయవాడలో వెలసిన అనేక సంస్థలకు, సంఘాలకు, ఉద్యమాలకు ఈ గ్రంథాలయం కార్యస్థానంగా తోడ్పడింది.
- ఈ గ్రంథాలయం పక్షాన అయ్యదేవర కాళేశ్వరరావు గారు హరిజనులకు పాఠశాల నొకదానిని ఒక పాకలో నిర్వహించి వారిలో విద్యావికాసాలకు తోడ్పడ్డారు.
- ఈ గ్రంథాలయ ఆదరణ క్రింద 1914లో ప్రథమ ఆంధ్రదేశ గ్రంథ భాండాగారుల మహాసభ జరుపబడింది.
- 1917లో ఈ గ్రంథాలయం లో రాయసం వెంకటశివుడు గారు బాలల విభాగాన్ని స్థాపించారు.
- భారత స్వాతంత్రోద్యమ కాలంలో రహస్య పోరాటాలకు ఈ గ్రంథాలయం విప్లవకేంద్రంగా పనిచేసింది.
- నోరి వెంకటేశ్వర్లు గారు తమ "ఫూల్స్ క్లబ్"ను ఇందులోనే స్థాపించారు.
- గొప్ప ఉపన్యాసకులను, కళాకారులను, కవులను రప్పించి ఉత్సవాలు, వేడుకలు, సభలు గావించి వారిని ఈ గ్రంథాలయ ప్రాంగణంలో సన్మానించేవారు.
మూలాలు
[మార్చు]- ↑ గ్రంథాలయ పితామహ అయ్యంకి వెంకట రమణయ్య, డాక్టర్. వెలగా వెంకటప్పయ్య, పాతూరి విజయకుమార్, వాహినీ పబ్లిషింగ్ హౌస్, విజయవాడ, 1982. పేజీ. 54