రావు వేంకట మహీపతి గంగాధర రామారావు I

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రావు వేంకట మహీపతి గంగాధర రామారావు (1862-90) పిఠాపురం సంస్థానపు ప్రభువు, సంగీత, సాహిత్య పోషకుడు. ఆయన పరిపాలన కాలంలో ఎందరో కవులు, సంగీతకారులు, మహా పండితులు మొదలైన వారికి భూములు ఇనాముగా ఇచ్చి కళలను పోషించారు. ఆయన దాతృత్వం, పౌరుషం, లౌక్యం వంటి లక్షణాల గురించిన కథలు అనేకం ఆ ప్రాంతమంతటా వ్యాప్తిలో వుండేవి.

మతభావాలు[మార్చు]

గంగాధర రామారావు వైష్ణవమతాభిమాని. ఆయనకు శ్రీవైష్ణవ పీఠస్థులైన వానమామలై జియ్యంగారు గురుత్వం వహించేవారు. స్మార్తులకు శంకరాచార్య పీఠములెటువంటివో విశిష్టాద్వైతులకు ఈ పీఠమూ అటువంటిది. ఆ పీఠానికి అన్నివిధాలా రామారావు అండగా ఉండేవారు. ఆ పీఠస్థుల వద్దకు రామారావు దర్శనార్థియై వెళ్లారు. పాదపూజకు గురువులు రూ.లక్ష కోరారు. ఐతే గంగాధర రామారావు రూ.యాభై వేలు మాత్రమే ఇవ్వదలుచుకున్నారు. గురువు గట్టిగా పట్టుబట్టాకా, రామారావుకు ఇలా పట్టుపట్టే గురువు ఏం సన్యసించినట్లు అని ఒక ఉపాయం ఆలోచించారు. తిరుమణి చూర్ణంతో నిలువు నామం దిద్దబడ్డ తన నుదుటన భస్మం తెప్పించుకుని అడ్డంగా త్రిపుండ్రాలను అడ్డబొట్టుగా పెట్టారు. రుద్రాక్షలు తెచ్చి మెడలో ధరించారు. ఆపైన సగౌరవంగా వారి గురువుతో నా పేరు తెలుసుకదా గంగాధర రామారావు. దీనిని బట్టి తిరుమణి తిరుచూర్ణధారణకు ఎంత ఆవశ్యకత ఉందో విభూతి రుద్రాక్షధారణకూ అంతే అధికారం ఉంది. శిష్యునయందు దయవుంచండి అంటూ నిష్క్రమించారు.[1]

దానధర్మాలు[మార్చు]

మహా పండితుడైన పాపయ్య శాస్త్రికి మొదట 96 ఎకరాల లంక భూమిని యిచ్చి, ఆపైన వారొక చమత్కారం చేయగా దానిని 148 ఎకరాలు చేసి స్థిరపరిచారు. ఆయన పండితులతో మాట్లాడేప్పుడు ధారాళంగా సంస్కృతంలోనే మాట్లాడేవారు. ఆయనకు దివానులు, ఉన్నతోద్యోగులు, పండితులు, ఆంతరంగికులు మొదలైనవారిపై కోపతాపాలు కలిగితే దానిని వ్యక్తపరిచే తీరు చాలా విచిత్రంగా ఉండేది. తీవ్రమైన కోపానికి కారకులైనవారి జుట్టును పూర్తిగా గొరిగించేవారు. ఆనాటి సాంఘిక స్థితిగతుల రీత్యా పూర్తిగా జుత్తు తీసివేసి, బోడిగా తిరగడమంటే గొప్ప అవమానకారకం. ఐతే ఆయన ఇలా అవమానించిన వెంటనే, దీన్ని పూరిస్తూ వారికి బాగా ధనం సకల గౌరవలాంఛనాలతో సహా చెల్లించి మర్యాద చేసేవారు. ఇలాంటి అవమాన సన్మానాలు పొందినవారిలో అప్పటి పండితులైన పొక్కునూరి వెంకటశాస్త్రి వంటి వారు కూడా ఉన్నారు. ఇందులో ధనగౌరవాలు కూడా ఇమిడి వుండడంతో ఆయన మహాప్రభో, నా జుట్టు యెంతో అదృష్టం పెట్టిపుట్టింది కనుక మీవంటి మహాప్రభువుల కత్తికి ఎరయ్యింది అనేవారు. పైగా ఈ విషయం తెలిసిన అనేకులు సంస్థానాధీశునికి కోపం తెప్పించి అవమానపడి లాభం పొందుదామని ప్రయత్నాలు చేసేవారు. ఇటువంటి నకిలీ ప్రయత్నాలను రామారావు సూక్ష్మబుద్ధితో తెలుసుకుని వాటి వలలో పడక కోపించేవారు కాదు.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 వేంకట శాస్త్రి, చెళ్ళపిళ్ళ (డిసెంబరు 2011). కథలు గాథలు 1. హైదరాబాద్: ఎమెస్కో బుక్స్. ISBN 978-93-80409-97-9. Retrieved 6 December 2014.