Jump to content

రూపకం

వికీపీడియా నుండి
(రూపకభేదాలు నుండి దారిమార్పు చెందింది)

రూపకం అనేది ఆంగ్లములో డ్రామా అనే దానికి సంస్కృతంలో ప్రయోగించే సమానార్ధకపదం. నటులు ఆయా పాత్రల రూపాలను ఆరోపించుకొని అభినయిస్తారు కాబట్టి దీనికి రూపకమని పేరు వచ్చింది. రూపక భేదాల్లో ఒకటి నాటకం. ఇప్పుడు ప్రచారంలో నాటకమనే పదమే ఉంది. అందువల్ల రూపక నాటక పదాలను పర్యాయపదాలుగా వాడతారు.

రూపకభేదాలు

[మార్చు]

రస, వస్తు, నాయకాది భేదాలను బట్టి ఈ రూపకాలను పది రకాలుగా విభజించారు . (ధనంజయుని దశరూపకం )

  • నాటకం - నాటకంలో కథ (ఇతివృత్తం ) ప్రసిద్ధంగా ఉండాలి. నాయకుడు ధీరోదాత్తుడు , క్షత్రియుడు , ప్రసిద్ధరాజవంశీకుడై ఉండాలి. ఇందులో శృంగారం లేదా వీరం ప్రధానరసమై ఉండాలి.నాటకం రూపకాలన్నింటేలోకి విశాలమైనది. ఇందులో 7 అంకాలుంటాయి.ఒకేసమయంలో రంగస్థలంపై నాలుగైదు పాత్రలకన్నా ఎక్కువ ఉండకూడదు. ప్రతి అంకంలో నాయకుడో , నాయికో కనిపించాలి.
  • ప్రకరణం – ఇందులో కథ కల్పిపబడినదై ఉండాలి. ప్రసిద్ధమైన కథను స్వీకరించకూడదు., రాజవంశీయుడు లేదా బ్రాహ్మణుడు లేదా వైశ్యుడు లేదా మంత్రికుమారుడు నాయకుడు కావచ్చును. అతడు ధీరశాంతుడు. నాయిక కులీనురాలు గాని వేశ్యాస్త్రీ కాని కావచ్చును. శృంగారం ప్రధానరసమై ఉండాలి. ఇందులో 5 నుండి 10 అంకాలు ఉంటాయి. ఇది నాటిక అనే ఉపరూపక భేదం ,నాటక ప్రక్రియలకు మధ్యరకమైనది.
  • భాణము – ఇందులో ఒకే ఒక అంకం ఉంటుంది. ఒకే ఒక పాత్ర ఉంటుంది. అతడు ( ఆ పాత్ర ) చతురవ్యక్తి కాని ,పండితుడు కాని విటుడు కాని అయి ఉండాలి. ప్రధానరసం శృంగారం లేదా వీరం అయి ఉండాలి. ఇది ఆధునికయుగంలోని ఏకపాత్రాభినయం వంటిది. (Mono Action)
  • ప్రహసనం – ఇందులో ఒకటి లేదా రెండు అంకాలుంటాయి. ఇందులో ప్రధానమైనది హాస్యరసం. కథ కల్పిపబడినదై ఉండాలి. బ్రాహ్మణుడు , సన్యాసి ,రాజు ,విటుడు వీరిలో ఒకరు నాయకుడై ఉండాలి. మిగతా పాత్రలు విటులు ,భిక్షుకులు , వేశ్యలు , సేవకులు మొదలైన వారుంటారు. ఉదాత్త గంభీరమైన నాటకప్రక్రియ గ్రీకు విషాదాంత నాటకానికి దగ్గరగా ఉండగా , ప్రకరణ ,ప్రహసనాలు గ్రీకు హాస్య నాటకాలకు దగ్గరగా ఉన్నవని చెప్పవచ్చును.
  • డిమం – ఇందులో నాలుగు అంకాలుంటాయి. కథ (ఇతివృత్తం ) ప్రసిద్ధమైనదై ఉండాలి . దీనిలోని పాత్రలు మానవజాతికి చెందినవి కాక యక్ష గంధర్వ రాక్షస నాగాది జాతులకు చెందినవారై యుండాలి. భూత ప్రేత పిశాచాది పాత్రలుండవచ్చును. ఇందులో 16 పాత్రలు ఉండాలి. వీరు ఉద్ధతస్వభావం కలవారై ఉంటారు. ఇందులో ఇంద్రజాలం ,మాయ , యుద్ధం .సూర్యగ్రహణ ,చంద్రగ్రహణాది దృశ్యాలుంటాయి. డిమ ధాతువుకు సంఘాతమని అర్ధం. శృంగార హాస్య రసాలు కాక మిగిలిన రసాల్లో ఏదైనా ఒకటి ప్రధానరసంగా ఉండవచ్చును.
  • వ్యాయోగం – ఇందులో ఒకే ఒక అంకం ఉంటుంది.రసపోషణ డిమంలో వలె జరుగుతుంది.ఉద్ధతుడైన వ్యక్తిని ఆశ్రయించి ఇతివృత్తముంటుంది. ఇందులో యుద్ధముంటుంది. అది స్త్రీ కొరకు లేక ఏ కారణం కొరకైనా కావచ్చును. ఒక్క రోజు జరిగిన సంఘటన మాత్రమే ఉంటుంది.
  • సమవాకారం – ఇందులో 6 అంకాలుంటాయి. 12 నాయకపాత్రలుంటాయి. వారు పురాణ ప్రసిద్ధులైన పురుషులై ఉండాలి. ప్రస్తావన నాటకంలో వలె ఉంటుంది. ఇందులోని కథ దేవతలకు ,దైత్యులకు సంబంధించిందై ఉంటుంది.ప్రధానరసం వీరరసం.
  • వీథి – దీనిలో ఒకే ఒక అంకం ఉంటుంది. ఒకటి లేదా రెండు పాత్రలుంటాయి. శృంగారాదిరసాలు సూచ్యంగా మాత్రమే ఉంటాయి.
  • అంకం - దీనిలో ఒకే ఒక అంకం ఉంటుంది. కథ ప్రసిద్ధమైనదై ఉండాలి . కథలో కవి మార్పు చేయవచ్చును.ప్రధానరసం కరుణం. దీనికి ఉత్స్ష్టాంకమని కూడా పేరు. స్త్రీరోదనం ప్రధానంగా ఉంటుంది.
  • ఈహామృగం – ఇందులో 4 అంకాలుంటాయి. కథ ప్రసిద్ధం కొంత , కల్పితం కొంత ఉంటుంది. నాయకులు , ప్రతినాయకులు పురాణప్రసిద్ధులై ఉంటారు. వారు నరులు , దేవతలు కావచ్చును. ప్రతినాయకుడు తనయందు అనురాగం లేని స్త్రీని ఎత్తుకొని పోవడానికి ప్రయత్నిస్తాడు. నాయకుడు ప్రతినాయకుని అడ్డగిస్తాడు. కాని చంపకూడదు. పొందడానికి వీలుకాని నాయికను పొందడానికి ప్రతినాయకుడు మృగంలా ప్రవర్తిస్తాడు. కాబట్టి ఈ రూపక ప్రభేదానికి ఈహామృగమని పేరు వచ్చింది.
"https://te.wikipedia.org/w/index.php?title=రూపకం&oldid=3466820" నుండి వెలికితీశారు