రేమెల వేంకట రాయకవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రేమెల వేంకటరాయ కవి (1820 - 1847) ప్రముఖ తెలుగు కవి పండితుడు.

ఇతడు గోదావరీ మండలములోని దుగ్గుదుర్రు గ్రామ నివాసి. వెలమకుల సంభవుడు. ఆరవేల్ల గోత్రేయుడు. తండ్రి: భావయ. జననము: 1820 ప్రాంతము. నిర్యాణము: 1847 ప్రాంతము. ఇతడు రచించిన గ్రంథము: ఉత్తరా పరిణయము.

ఈకవి వెలమకులీనుడు. ' ఉత్తరాపరిణయ ' మను మూడాశ్వాసముల ప్రౌఢ ప్రబంధము రచించెను. నివాసము కాకినాడ తాలూకాలోని దుగ్గుదుర్రు. అచటికి రెండుమైళ్ల దూరమున ' కుయ్యేరు ' అను పల్లెటూరు ఉంది. అది సుప్రసిద్ధ పండితకవియగు పిండిప్రోలు లక్ష్మణకవి పుట్టినయూరు. లక్ష్మణకవికిని వెంకటరాయకవికిని పరస్పర పరిచయమున్నట్లు తత్రత్యులు చెప్పుదురు. ప్రకృతకవి యిరువదియేడేండ్లు మాత్రమే జీవించియున్నట్లు పరంపరాయాత ప్రసిద్ధి.

శ్రీమీఱన్ ధర సద్గుణావళులచే జెన్నొందుచున్నట్టి యా శ్రీమద్వేంకటనీలశైలపతి వాసిం జూచి పోషింపగా ధీమద్రాజితదుగ్గుదుర్తిపురి నాత్రేయీసమాలోకనో ద్దామత్వంబున నుంటి మిచ్చట సదాధర్మార్జనవ్యాప్తిచే.

అని వ్రాసికొనుట బట్టి శ్రీ పీఠికాపుర ప్రభువగు శ్రీ రావు వేంకట నీలాద్రిరాయినింగారి యాదరణమునకు బాత్రు డయ్యెనని వ్యక్తము. ఈకవి జ్యౌతిషమున మంచి ప్రతిజ్ఞావంతుడట. జాతకమునుబట్టి తా నిరువది యేడేండ్ల వయసున మరణింతునని తెలిసికొని పెళ్ళి గావించుకొనక గ్రంథరచనా దీక్షితుడై శ్రీరామచంద్ర సేవామగ్నుడై కాలము గడపెను. ఈ స్వల్పవయస్సుననే యుభయభాషాభ్యాసముచేసి " ఉత్తరా పరిణయ " కావ్యమూలమున యశము సంపాదించెను. ఈ ప్రబంధము 1930 లో కవి వంశీయులు శ్రీ రేమెల చినవేంకటరాయినింగారు వెలువ రించిరి. శతావధాని చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారు దానికి బీఠిక వెలయించిరి.

ఈప్రబంధ మరసినచో నీకవి చక్కని ధారాశక్తి కలవాడని స్పష్టమగును. మను వసు చరిత్రాదులలోని పద్యములచాయ లీతని కవిత్వమున గలవు. ఏవో స్వల్పదోషము లున్నను మొత్తముమీద నీకవి ప్రయోగపరిజ్ఞాతయు, వ్యాకరణజ్ఞానము కలవాడుగా దోచుచున్నాడు. రెండవయాశ్వాసమున... " భ్రమ, ద్రటదవదాత పత్ర నికురంబము..." అని ప్రయోగించెను. " ఇట ' నికురుంబము ' గాని ' నికురంబము ' గాదు" అని పీఠిక. ' నికురంబ ' మను అత్వయుక్త ప్రయోగమే లక్షణసమ్మతము. బాహులకము వలన ఉత్వము కూడా రాగా " నికురుంబము " అని కూడా నగును. ఉకార విశిష్టమైన ప్రయోగము ప్రహతముగా నున్నది. కాని నికురంబము తప్పుకాదు. ఈపదము నుపయోగించుట బట్టి యీకవికి వ్యాకరణజ్ఞానము చక్కగా నున్నదని యవగతము. ఈకవి ధారాశుద్ధి కలవాడగుటకీ పద్యము చాలును.

బంతులుదేరి పూబొదల సజ్జలజేరి సరోజపాళికై దొంతిగ బాఱి జుమ్మనుచు దూరెకు దూరెకు మల్లికాసభా సంతతి దూరి భాసిత రసాల విశాల మరందధార ల త్యంతము గ్రోల గోరి మధుపావళులోప్పె వనాంతరంబులన్.

2 ఆశ్వాసము

ప్రబంధ ప్రారంభమున " శ్రీలకు దానకంబగుచు..." ఇత్యాదిగా నున్న నీలాసుందరీ పరిణయములోని మొట్టమొదటి పద్యము యథాతధముగ జేర్పబడియున్నది. " ఇంతమాత్రమున నియ్యలఘునందు గ్రంథ చౌర్యము నారోపించుటకన్న, నీయనకు శ్రీ కూచిమంచి కవిసార్వభౌమునియం దపారమైన యభిమానముగలదని తెల్పుటకుగా నది సాధక మయ్యెడి " నని పీఠికలో వ్రాసిరి. కాని యీ మొదటిపద్యము ప్రక్షిప్తమనియో, లేఖకులెవరో ప్రార్థనమునకు వ్రాసికొని రనియో చెప్పితీరవలయును. దీనికి రెండు ప్రబలకారణము లున్నవి. శ్రీ రాజన్మహిజా... అని శ్రీకారముతో రెండవపద్యము ప్రారంభింపబడింది. అది శ్రీరామ ప్రార్థనము. ఈకవి " శ్రీరామచంద్ర సాంద్ర కరుణాసమాగత కవితా మాధురీ ధురీణుడ " నని యాశ్వాసాంతవచనమున జెప్పుకొనుటచే గావ్యాధిని శ్రీరామప్రార్థనమే చేసినాడనుట యుక్తము. ' నీలాసుందరి ' లోని ' శ్రీలకు దానకంబగుచు ' నను పద్యము శివస్తోత్రపరము. ఈ పద్యము మొదటజేర్చుట కవిమతమును జెరుచుట యగును. అదియు గాక మూడవపద్యముల "...కాంచనాచలో, దారశరాసనుండు జయధన్యత మాకొనరించు నెప్పుడున్ " అని ఈశ్వరుని ప్రార్థించాడు కూడను. దీనిని బట్టి కూడా మొదట ముద్రించిన పద్యము తీసివేసినగాని నసిపడదు. ఉత్తరా పరిణయము చక్కని కావ్యము. ఈ కావ్యకర్తకు భగవంతు డాయువిచ్చిన నిట్టికబ్బము లెన్ని సృష్టింపబడెడివో ? ఈ కవి చక్కగ సంభాషించెడివా డనుట కచటివా రీవిషయము చెప్పుచుందురు. " పిండిప్రోలు లక్ష్మణకవిగారును వీరును బావమరది పరియాచక మూడు కొనుచుండువారు. ఒకప్పుడు ఏదో సభలో లక్ష్మణకవి కూర్చుండి యుండ మనకవిగారు వెళ్లిరట. మరియాదకు లక్ష్మణకవి చోటుచూపి " దొరలకు చోటు చాలా " యనెనట. అప్పు డీయన " దొరలకు - చోటు చాలు " నని సమాధానము. (దొరాకుము=ఒత్తగిల్లకుము) కవి సంభాషణ చాతుర్యము!

మూలాలు

[మార్చు]