Jump to content

లదాక్ బ్రోక్పాల చరిత్ర

వికీపీడియా నుండి

"లదాక్ బ్రోక్పాల చరిత్ర" ఆర్యన్ వేలీ, దా ,హను, దార్చిక్, దాబేమా ,గార్కొన్ అనే ఊళ్ళను కలిపి ఆర్యన్ వేలీ అంటారు లదాక్.లో. ఈ ఊళ్ళు లే, కార్గిల్ జిల్లాలలో పక్క పక్కనే, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్నాయి. లదాక్ యాత్రికులు ప్రత్యేకంగా ఈ లోయను కూడా దర్శిస్తారు.

శ్రీ నగర్ లోయ దాటి కార్గిల్ లో ప్రవేశించడానికి 16వేల అడుగుల ఎత్తున ఉన్న జోజి లా పాస్ దాటాలి. కొండ అంచున ఇరుకు దారిలో తరచూ పేరుకుపోయిన మంచుమీద ప్రయాణం చేయాలి. సోన్.మార్గ్ నుంచి ప్రమాదం అంచున ప్రయాణం. ఆర్యన్ వేలీ చేరుకొను 211కి.మీ ప్రయాణం. కార్గిల్ కు ముందు ప్రపంచంలో అత్యంత శీతల ప్రదేశాల్లో ఒకటి డ్రాస్ అనే చిన్న టౌన్ వస్తుంది. ఆకాశాన్నంటే పర్వతాల అంచున చీమలాగా టేక్సీ వెళ్తూంటే భయాన్ని గుండెల్లో అణచిపెట్టుకొని ఈ మహాపర్వతాల్ల మార్గంలో యాత్రికులు బ్రోక్పాల గ్రామాలు చరుకోవాలి.

పర్యాటకులు లదాక్ లో "బ్రొక్పా"ల గ్రామాలు దర్శించడానికి అధికారుల అనుమతులు అవసరం, మిలటరీవారు పర్యాటకుల వివరాలన్నీ తెలుసుకొని అనుమతిస్తారు.

ఊరి దారికి ఒకవైపు లోయ, మరొక వైపు బండరాళ్ళు మట్టితో కట్టిన ఇళ్ళు. కొన్ని రెండతస్తుల మిద్దెలు. ఇళ్ళవెనక పెరడు, పొలాలు, సింధూనది నుంచి కయ్యల్లోకి చిన్న కాలువ గుండా నీళ్ళు పొలాల్లోకి ప్రవహిస్తాయి. ఇళ్ళమధ్య సందులో ఫలవృక్షాలు. ఇళ్ళముందు ఎండకు ఆరబోసిన ఆప్రికాట్ పళ్ళు. ఊరినడుమ హైస్కూలు, హాస్టల్, చెల్లాచెదురుగా అక్కడక్కడా ఇళ్ళు, బౌద్ధసన్యాసుల మఠం, రంగస్థలం వెనక నేపథ్యంలో ప్రకృతి దృశ్యాన్ని చిత్రించిన తెర దింపినట్లు ఊరిచివర ఎత్తయిన పర్వతాలు, అగాధమైన లోయలు.

బ్రోక్పాల "దా, బేమా, దార్చిక్, హను, గార్కొండ్" గ్రామాలు ప్రకృతి వడిలో నాగరికతకు దూరంగా, నిమ్మళంగా మనుగడ సాగిస్తున్నాయి. ఈ ఊళ్ళపేర్లు ఒక వింతవార్తతో మోత్తం ప్రపంచానికి వెల్లడి అయ్యాయి. ఈ నాలుగైదు ఊళ్ళ ప్రజలను లదాకీలు 'స్థానికేతరులు అనే అర్థంలో 'బ్రొక్పా'లంటారుగాని, వీళ్ళు మాత్రం తమను తాము 'మినారో'లని చెప్పుకొంటారు. మూడువేల సంవత్సరాలుగా పర్వతాల వడిలో నివసించే వీరు లదాకీలకన్నా విలక్షణంగా, యూరోపియన్లవలె కనిపిస్తారు. స్ఫురద్రూపులు, తెల్లని నిర్మలమైన దేహవర్ణం, నీలికళ్ళు, బంగారు రంగు కురులు, మొదలైన లక్షణాలతో యూరోపియన్లను తలపింపజేయడం చేత, కొందరు పాశ్చాత్య పండితులు వీరిని ఆర్యులని పేర్కొన్నారు. అలెక్జాండర్ సైన్యం వెనుతిరిగి పోయే సమయంలో కొంతమంది గ్రీకులు లదాక్.లో నిలబడిపోయారని, వారిసంతతే మినారోలనే అభిప్రాయం ఉంది. జన్యుపరీక్షల్లో యూరోపియన్లకు వీరికి మధ్య చాలా పోలికలున్నట్లు తేలింది. ఈ గ్రామీణుల భాష మీర్మ్.మో.

1980 దశకంలో కొంతమంది జర్మనీ యువతులు ఆర్యన్ వేలీకి వచ్చి మినారో యువకులతో సంబంధాలు పెట్టుకొని అచ్చమయిన ఆర్యసంతానం పొందారన్న వార్తలు, "Pregnancy Chasers, Pregnancy Tours" వంటి వార్తలు పత్రికలలో రావడంతో ఈ ఊళ్ళకు, ఆర్యన్ వేలీకి పర్యాటకుల తాకిడి మొదలైంది.

మినారోలు బౌద్ధధర్మం స్వీకరించకముందు బొన్(Bon)మతాన్ని అనుసరించేవారు. ప్రకృతిని, సూర్యచంద్రులను, లాహ్ అనే దేవుణ్ణి ఆరాథించేవారు. ఇప్పుడు కూడా లాహ్ దేవతకు జాతర జరిపి మేకలు బలియిస్తారు. లదాకీ ప్రజలు చేసుకోని పండుగలు పబ్బాలు వీళ్ళు చేసుకొంటారు. వీరు శుద్ధ శాకాహారులు. గోవు మాంసం, పాలు, గోసంబంధమైనవేవీ ముట్టరు. పండుగ సమయాల్లో మాత్రం మేకమాసం భుజిస్తారు.

మినారోల సమాజంలో మంత్రగాడికి, వైద్యుడికి, జ్యోతిష్కుడికి, పూజారికి చాలా ప్రాధాన్యం ఉంది. శుభాశుభ సమయాల్లో బార్లీతో తయారు చేసిన ఛాంగ్ అనేమద్యం సేవిస్తారు. ప్రపంచీకరణ గాలులు బలంగా వీచి పాత అలవాట్లు, సంప్రదాయాలు తుడిచి పెట్టుకొని పోతున్న స్థితిలో ఈ ప్రజలు తమ సంస్కృతి, భాష, జీవనవిధానం, జాతి స్వచ్ఛతను కాపాడుకోడానికి తంటాలు పడుతున్నారు. బహుభార్యాత్వం, పాలియాండ్రి ఇంకా ఈ సమాజంలో ఉన్నాయి.

బార్లి వీరి ప్రధాన పంట. వంటిళ్ళు వీరికి అత్యంత పవిత్రమైన ప్రదేశాలు. ధగధగమెరిసేట్లు తోమిన లోహపాత్రలు ప్రతి ఇంట్లో అందంగా పేర్చి ఉంటాయి.ఇళ్ళల్లో రకరకాల పూలమొక్కలు పెంచుతారు. స్త్రీపురుషులు తమ టోపీలను రకరకాల పువ్వులతో అలంకరించుకుంటారు. షాక్లో లేదా మాంతి అనే పువ్వులతో టోపీలను అలంకరిస్తారు. వీళ్ళు తమ తెగలో తప్ప బయటివారితో వివాహం చేసుకోరు. ఇప్పుడు ఆడా మగా అందరూ చదువుకొంటున్నారు. సప్తసముద్రాలు దాటి ఇక్కడ స్థిరపడినట్లు బ్రోక్పాలు గర్వంగా చెప్పుకొంటారు.


మూలాలు:1.ఆంధ్రజ్యోతి ఆదివారం13 నవంబరు సంచిక,2016. 2. హిందూ పత్రిక వ్యాసాలు.