లవకుశ (నాటకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

లవకుశ ఒక ప్రసిద్ధిచెందిన పౌరాణిక నాటకము. ఈ నాటకాన్ని బళ్ళారి పండిత సుబ్రహ్మణ్యశాస్త్రి 1920లో రచించారు. ఇందులో కాస్త గ్రాంధిక భాష మిళితమై ఉంటుంది.

ఇతివృత్తం[మార్చు]

తండ్రి దశరథ మహారాజు ఆనతి మేరకు,సీతా లక్ష్మణ సమేతుడై, వనవాసాన్ని పూర్తి చేసుకున్న శ్రీ రామచంద్రుడు అయోధ్యాపురి చేరగానే అతని పాదులకలను కాళ్ళకు తొడిగి సింహాసనాన్ని అధిష్టించమని వేడుకుంటాడు భరతుడు. వశిష్ఠ మహర్షి కిరీటాన్ని అలంకరించగా కొలువుదీరిన రామచంద్రునికి విభీషణుడు, సుగ్రీవుడు,ఇంద్రుడు తమ తమ కానుకలను అందిస్తారు. ప్రక్కనే పాదాలచెంత కూర్చున్న హనుమంతునికి సీతమ్మ ముత్యాలహారాన్ని బాహుకరించగా అందులోని ఒక్కొక్క ముత్యాన్ని కొరికిచూసి వాటిలో తన ఆరాధ్యదైవం కనిపించడం లేదంటాడు. బాగా పరికించి చూడమని రాముడు తెలుపగా వాటిలో స్వామి ప్రతిబింబం కనిపిస్తుంది. తనకు రాముని పాదసేవ చేసుకునే భాగ్యం ప్రసాదించమని సీతమ్మను కోరుతాడు హనుమ.

శ్రీ రాముని పట్టాభిషేక వైభవాన్ని చూసిన శూర్పణఖ కరాళులు తమ రాక్షస వంశ నాశనానికి కారకుడైన రామచంద్రుడు సుఖంగా ఉండరాదని, సీతారాముల మధ్య ఎడబాటు కలిగించాలని మారువేషాలు ధరించి చాకలి దంపతులుగా మారిపోయి గొడవపడుతుంటారు. భార్యను ఏలుకొమ్మని చెప్పిన కులపెద్దలతో, నేను వెర్రి రాముణ్ణి కాదు, పరాయివాడి పంచన ఉండివచ్చిన భార్యను ఏలుకోవడానికి అనగా విన్న భద్రుడు అనే గూఢచారి ఈ మాటాలను రామునికి తెలియజేస్తాడు. అది విన్న రాముడు ఖిన్నుడై, భరత లక్ష్మణ శతృఘ్నులను పిలిచి జననిందకు కారణభూతురాలైన జానకిని భాగీరథీ నదీతీరాన విడిచిరమ్మని ఆజ్ఞాపిస్తాడు. వద్దని వారించిన తమ్ములతో వారు ఈ పని చేయకున్న తానే వెళ్ళి దిగవిడిచి వస్తానంటాడు. చివరకు లక్ష్మణుడు వదినను మున్యాశ్రమాలను చూపుతానని రథములో వనభూములకు తీసుకొని వెళ్ళి రాముని ఆజ్ఞను తెలియజేస్తాడు. ఆ మాటలను వినజాలక, కఠిన నిర్ణయం పట్ల విస్మయం చెంది మూర్ఛపోయిన తరుణం లో రథాన్ని మరల్చుకొని తిరిగివస్తాడు. మూర్ఛనుండి తేరుకొన్న జానకి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడబోగా వాల్మీకి మహర్షి అమెకు తన ఆశ్రమం లో ఆశ్రయం కల్పిస్తాడు.ఆమెకు జన్మించిన కవలలకు కుశ-లవులుగా నామకరణం చేస్తాడు. వాల్మీకి మహర్షి వద్ద అస్త్రవిద్యతో పాటుగా సకల విద్యలనూ ముఖ్యంగా రామాయణ కథాగానంలో ప్రావీణ్యం సంపాదిస్తారు.

ఒకనాడు తోటి మునిబాలకులతో ఆడుకుంటున్న లవునికి శ్రీ రాముడు అశ్వమేధయాగం లో విడిచిన యజ్ఞాశ్వం కనిపిస్తే దానిని బంధిస్తాడు. విడిపించుకోవడానికి వచ్చిన శతృఘ్న, భరత, లక్ష్మణులను మూర్చ పోగొడతారు బాలలు. చివరకు యజ్ఞదీక్షలో ఉన్న రామచంద్రుడే స్వయంగా బాలలను చూసి అప్రతిభుడై వారిలో మునిబాలకుల లక్షణాలు లేవని భావించి ఎవరని ప్రశ్నించగా తాము వాల్మీకి మహర్షి శిష్యులమని తమ తల్లి జానకీదేవి కుమారులమని తెలుపగా ఆ పేరు విన్న రాముడు మూర్చ పోతాడు. ఇది చూసిన హనుమంతుడు బాలలపైకి గద ఎత్తగా రామనామ గానం తో మారుతిని కట్టి పడేస్తారు. అంతలోనే తేరుకున్న హనుమ ఈ వార్తను ఆశ్రమం లో ఉన్న సీతాదేవికి,వాల్మీకి మహర్షికి తెలుపగా వారు పరుగు పరుగున వచ్చే సరికి రాముడు మూర్ఛనుండి తేరుకొని, సీతనుజూసి మన్నింపమని, తన వేటా అయోధ్యాపురికి రమ్మని కోరుతాడు. అవమానాలపాలైన తనకు ఇంకా ఈ రాజ్యభోగాది విభవమ్ములపై కాంక్ష లేదని, కుమారులను తండ్రికి అప్పగించి తన తల్లియైన భూమాత ఒడిలోనికి చేరిపోతుంది జానకీ మాత. వాల్మీకి సహితుడై శ్రీ రాముడు అయోధ్యాపురి జేరి లవకుశులకు యువరాజ పట్టాభిషేకం జరుపుతాడు.