లూయీ హెన్రీ మోర్గాన్ పురాతన సమాజం
లూయీ హెన్రీ మోర్గాన్ (Louis Henrey Morgan)ఇంగ్లీషులో రచించిన"Ancient Society" పురాతన సమాజం పేరుతో మహీధర రామమోహనరావు తెలుగులోకి అనువాదం చేశారు, విశాలాంధ్ర ప్రచురణ సంస్థ 1987 అచ్చువేసింది. ఇది సామాజిక శాస్త్రవేత్తలకు కరదీపిక. అత్యంత ప్రాచీన కాలంలో, ఆటవికదశలో మానవుడు ఉన్నప్పుడు ఆనాటి సమాజాన్ని, మానవ సంబంధాలు, బంధుత్వాలను రచయిత ఇందులో విశ్లేషించారు. చరిత్ర పూర్వ చరిత్రలో, మానవుడు ఇంకా వేటాడి పచ్చిమాంసం తింటూ జంతువుల్లా బ్రతుకుతున్న కాలాన్ని ఊహించి ఇందులో రికార్డు చేశారు.
అదృష్టంకొద్దీ ఆస్ట్రేలియా, అమెరికా ఖండాల్లో, అమెజాన్ పరీవాహక ప్రాంతంలో ఇంకా కొన్ని అదిమ సమాజాలు నాగరికతకు దూరంగా జీవిస్తున్నాయి. ఆ సమాజాల జీవన విధానాన్ని బట్టి ప్రపంచంలో ఇతర అభివృద్ధి చెందిన సమాజాలు కూడా కాలక్రమంలో నాగరికులవుతూ ఈ దశలన్నీ దాటుకొని ప్రస్తుత స్థితికి చేరి వుంటారని రచయిత ఈ గ్రంథంలో ప్రతిపాదించారు.
ప్రపంచం ఇంకా కళ్ళు తెరవని దశలో ఉన్నప్పుడు భారతదేశం అత్యున్నత నాగరికతను సాధించిందని భ్రమలో ఉన్న వారందరూ శ్రద్ధగా పఠించవలసిన గ్రంథం ఇది.
సమాజశాస్త్రం, సోషల్ ఆంత్రోపాలజి వంటి సామాజిక శాస్త్రాలు ఇప్పుడు జన్యుశాస్త్రం, కార్బన్ డేటింగ్, ఇతర శాస్త్రాల సహకారంతో ఊహించని ఎత్తులకు ఎదిగాయి. ఊహాగానాలు కాక, శాస్త్రీయమైన పరిశోధన ఫలితాలను వాడుకొని ఆంత్రోపాలజి నిర్దిష్ట సామాజిక శాస్త్రంగా అభివృద్ధి చెందింది. ఇటువంటి సాక్ష్యాధారాల సహకారం లేకుండానే లూయీ మోర్గాన్ ఆనాటి క్రైస్తవ మిషనరీల అనుభవాలు, రచనలు ఆధారంగా మానవ సమాజం అత్యంత పూర్వదశను ఊహించి రాశారు. శాస్త్ర విషయాలు కనుక పుస్తకం చదివి బోధపరచుకోడం రవంత క్లిష్టంగా ఉంటుంది. మహీధర సులభశైలిలో అనువాదం చేశారు.
వివిధ మానవ దశలలో ఆస్తి అనే భావన ఎట్లా అభివృద్ధి చెందుతూ వచ్చింది?
నాగరిక యుగం ఎగువ దశలో "దంపతీకుటుంబం" మొట్టమొదట కనబడింది. అది అంతకు ముందు ఉన్న "సింథియాటిక్" కుటుంబ వ్యవస్థలో నుంచి వచ్చింది. ఇనుము ఉపయోగాలు తెలిసే వరకూ నాగరికత అసలు సంభవంకాదు.
ఈనాటి ప్రజలు అభవిస్తున్న ఇన్ని సుఖాలకు, మన రక్షణకూ సాధనాలు ఉన్నాయంటే అతి పురాతన కాలపు పూర్వీకులయిన ఆటవికులు, అనాగరికులు చూపిన ఓర్పు, ధీరత్వం, పోరాటాలు, భరించిన బాధలే కారణమని మనం గుర్తు చేసుకోవాలని మోర్గాన్ అంటారు.
ఒక స్త్రీ, ఒక పురుషుడు అనే దాంపత్య రూపానికి ముందు ఎన్ని దశలు, వావివరుసలు లేని సంబంధాలను నుంచి ఈ దంపతి వ్యవస్థ దశకు మానవులు ఎదిగారని పుస్తకం వివరిస్తుంది. వేలవేల ఏళ్ళక్రితం మానవ సమాజం అనుభవాలే మనను ఈ పరిణత దశకు తీసుకొని వచ్చాయి. వేయి సంవత్సరాల తరువాత ఈ సమాజం ఎన్ని మార్పులు పొందుతుందో ఎవరూ ఊహించలేరు. తప్పక చదవవలసిన పుస్తకం.
ఆకరాలు:విశాలాంధ్ర సంస్థ 2017లో ఈ గ్రంథానికి పునర్ముద్రణ తెచ్చి అందుబాటులోకి తెచ్చింది. షుమారు 400/పుటలు పుస్తకం. 2.Lewis Henry Morgans'Ancient Society.