Jump to content

లైనస్ కార్ల్ పౌలింగ్

వికీపీడియా నుండి
L Pauling

Linus Carl Pauling-లైనస్ కార్ల్ పౌలింగ్

లైనస్ కార్ల్ పౌలింగ్ 1901 ఫిబ్రవరి 28న అమెరికాలోని ఓరిగాన్‌లోని 'లేక్ ఓస్వెగొ'లో హెర్మన్ పౌలింగ్, లూసీ ఇసబెల్లా దంపతులకు జన్మించాడు. 1917లో పాఠశాల విద్య పూర్తయ్యాక కెమికల్ ఇంజినీరింగ్ చదవడానికి కార్వల్లీస్‌లోని ఓరిగాన్ స్టేట్ అగ్రికల్చరల్ కాలేజీలో చేరాడు. 1925లో పట్టభద్రుడయ్యాడు. తర్వాత పేసాడేనాలోని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నుంచి Ph.D.పొందాడు. తన రెండు సంవత్సరాల యూరప్ పర్యటనలో ప్రముఖ శాస్త్రవేత్తలైన నీల్స్ బోర్, స్క్రోడింగర్, బ్రేగ్‌లతో కలిసి పనిచేశాడు. పౌలింగ్ అణు నిర్మాణాన్ని క్వాంటం యాంత్రిక శాస్త్రంతో వివరించాడు.

పౌలింగ్ 1939లో రసాయన బంధాలపై ఒక పుస్తకాన్ని ప్రచురించాడు. దీనిలో క్వాంటం యాంత్రిక శాస్త్రం ఆధారంగా రసాయన బంధాలు ఏర్పడటాన్ని వివరించాడు. ఆర్బిటాళ్లు సంకరీకరణ చెందుతాయని వివరించాడు. రుణ విద్యుదాత్మకత అనే భావనను ప్రవేశపెట్టి, మూలకాల రుణ విద్యుదాత్మకతల పట్టికను తయారు చేశాడు. మొట్టమొదటి సారిగా యాంటీబాడీస్, ఎంజైమ్‌లు ఎలా పనిచేస్తాయో వివరించాడు. 1951లో పౌలింగ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఏడు పీచు ప్రొటీన్‌ల నిర్మాణాలను వివరించింది. 1954లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందాడు. అణుపరీక్షలను నిషేధించాలని, అణ్వాయుధాల మీద నియంత్రణ ఉండాలని ప్రపంచమంతా తిరిగి ప్రచారం చేశాడు. అణ్వాయుధ పరీక్షలు జరపకుండా చూడాలని ఐక్యరాజ్యసమితికి 11వేల మంది శాస్త్రవేత్తల సంతకాలతో ఒక విజ్ఞాపన పత్రాన్ని అందజేశాడు. 1962లో పౌలింగ్‌కు నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. 1994 ఆగస్టు 19న కాలిఫోర్నియాలో మరణించాడు.

మూలాలు

[మార్చు]