వందేళ్ల ఏకాంతం
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
వందేళ్ల ఏకాంతం (వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్) గాబ్రియెల్ గార్షియా మార్క్వెజ్ రాసిన నవల. దీనిని పి. మోహన్ తెలుగులోకి అనువాదం చేశాడు.
ఇష్టమూ, కష్టమూ అయినదాన్ని, ఒక దుర్భర స్మృతిని ఏం చెయ్యాలి? దిక్కుమాలిన అందమైన నాస్టాల్జియాను కాదు, నిత్యం రాచి రంపాన పెట్టే అది అనుభవవేద్యం. గాబ్రియెల్ గార్షియా మార్క్వెజ్ ‘వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్’ అలా ప్రేమగా కాల్చుకు నంజుకు తింటుంది పాఠకుల్ని. మేజిక్ రియలిజం, అద్భుత కథనం, రాజకీయాలుకు మించినది ఏకాంతంతో మమేకం కావడం. ఏకాంతం దానంతట అది చెడ్డదీ కాదు, మంచిదీ కాదు. మంచిచెడ్డల మేలు కలయిక. వందేళ్ల ఏకాంతం నవల్లోని చాలా పాత్రలు ఏకాంతంలో కునారిల్లిపోతూనే తేటపడతాయి, నశించిపోతాయి. హృదయం ప్రక్షాళనమై మళ్లీ సమూహంలోకి వెళ్లి ఏదో కాసింత ఉపకారం చేద్దామని అనిపించినా, అప్పటికే జీవితకాలం ఆలస్యమై ఉంటుంది. నిత్యం రణగొణధ్వనులలో తిరిగేవాళ్లయినా మధ్యలో కాసింతసేపైనా ఒంటరితనపు కార్చిచ్చులో తగలబడిపోతుంటారు. తెలుగు సమాజంలో, సాహిత్యంలో కళా విషయాలు కూడా ఒకరకంగా ఏకాకులే. పికాసో, డావిన్సీ, రాజారవివర్మ, జీవన లాలస (విన్సెంట్ వ్యాన్గో) పుస్తకాలు రాసిన తర్వాత పి.మోహన్ మార్క్వెజ్ ‘సాలిట్యూడ్’ని తెలుగులోకి అనువాదం చేశాడు. మార్క్వెజ్ సాలిట్యూడ్ లో కథలూ, మనుషులూ, ఆశనిరాశలు, సుఖదుఃఖాలు, ఏకాంత కోలాహలాలు ఈ నవల చదువరుల జీవితాలలోనూ ఉన్నవే.
ఈ నవల్లోని చాలా పాత్రలతో, వాటి అనుభవాలతో పాఠకులు మమేకమైనట్లే అనువాదకుడు మోహన్ కుడా అయ్యాడు. ఏదో కాసింత మంచి చేద్దామని దెబ్బతినిపోవడం, నెలపాటు రాజ్యంచేతిలో ఏకాంత చిత్రవధలో నలిగిపోవడం, చిమ్మచీకట్లో మగ్గినవాడు ఒక్కసారిగా బయటికొస్తే ‘వెలుగు’ను భరించలేక మళ్లీ నీడల్లోకి వెళ్లిపోయినట్లు జారుకోవడం.. గొప్పకాదుగాని, నవల్లోని లిబరళ్ల విప్లవయోధుడు కర్నల్ ఔరెలియానో బుయెందియాలా చేతగాని యుద్ధాలు చేసొచ్చి ఇంట్లో తేలాక మరేమీ పట్టించుకోని నిరంతర ఏకాంతంలో మగ్గిపోవడం, అతడు కేవలం పొద్దుపోవడానికే చేసిన బంగారు చేప బొమ్మల్లా ఏదో చదువుకోవడం, రాసుకోవడం, వెర్రిబొమ్మలు వేసుకోవడం తప్ప మరే గట్టి మేల్ తలపెట్టలేని బావురుమనే ఏకాంతంలో నశించిపోవడం.. అర్థం కాని, చేతులు కట్టేసిన గుండెకోత.. మాటలకు అందని బాధాకర మానసిక స్థితి.. దొరికిందేదో తిని కొండకోనల్లో విహరించిన పిట్ట ఎడారిలో గొంతు తడుపుకోడానికి చుక్క నీళ్లకోసం అల్లాడినట్టు.. ఈ నవల్లోని ఫెర్నాందాలా, ఆమె మనవడిలా వాకిళ్లకు, కిటికీలకు చెక్కపలకలు దిగ్గొట్టుకుని మగ్గిపోయినట్టు అనువాదకుడి అనుభవాలు ఈ నవల అనువాదానికి స్ఫూర్తి నిచ్చి ఉండవచ్చు. ఏకాంతం దానంతట అది చెడ్డదీ కాదు, మంచిదీ కాదుకదా. ఈ నవలను ఇంగ్లిష్ బాగా వచ్చినవాళ్లు ఇంగ్లిష్లో చదివి చక్కగా ఫీల్ అవుతారు. ఇంగ్లిష్ రాని వాళ్లు, అరకొర వచ్చిన వాళ్లు, నవల్లోని సంక్లిష్టత అర్థం కానివాళ్లకు అది సాధ్యం కాకపోవచ్చు. పదిహేనేళ్లుగా వృత్తి అనువాదం కావడంతో మోహన్ ఏకాంతాన్ని తెలుగు చేశాడు. మార్క్వెజ్ స్వయంగా అన్నట్టు ఈ నవల్లో నలభై రెండు పొసగని విషయాలు(ఇన్‌కన్‌స్టిస్టెన్సీస్) ఉన్నాయి. అనువాదంలో ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే అనువాదంలో ఎదురయ్యే ఇబ్బందులే. మోహన్ ఇంగ్లిష్‌లో పండితుడు కాకపోవచ్చు కానీ, సామాన్య పాఠకులకు నవలను చేరువ చెయ్యాలనే అతని ప్రయత్నం సార్ధకంయింది.
వందేళ్ల ఏకాంతం ముందుమాట
మన కాలపు మహా ఇతిహాసం
స్పానిష్ రచయిత గాబ్రియెల్ గార్షియా మార్క్వెజ్‌ను , ఆయనకు ప్రపంచ ఖ్యాతి సంపాదించి పెట్టిన 'వందేళ్ల ఏకాంతం' నవలను తెలుగు సాహిత్యప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చెయ్యక్కర్లేదు. 1967లో వెలువడిన ఈ 'సియెన్ అనోస్ దె సొలెదాద్' ఇప్పటికి యాభైకి పైగా భాషల్లో అనువాదమై ఐదు కోట్ల ప్రతులు అచ్చయింది. స్పానిష్ బైబిల్ తర్వాత అత్యధికంగా అమ్ముడైన పుస్తకం ఇదేనంటారు. మేజిక్ రియలిజం పేరు వినగానే ఇదే గుర్తొస్తుంది. యాభై ఏళ్లుగా ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేస్తున్న ఈ నవలపై కొన్ని వేల పేజీల విమర్శ, విశ్లేషణ వెలువడ్డాయి. ఎలా అర్థం చేసుకోవాలో చెప్పే పుస్తకాలు కూడా. కొందరు దీన్ని మనకాలపు మహా ఇతిహాసమని కొనియాడితే, కొందరు కొరకరాని కొయ్య అని, గాఢత లేదని పెదవి విరిచారు. దూషణభూషణలతో నిమిత్తం లేకుండా ప్రతి తరమూ దీన్ని చదువుతోంది. చదివిన తరాలు మళ్లీ మళ్లీ చదువుతున్నాయి.
తీపిచేదుల వాస్తవం, అద్భుత కల్పన, వ్యంగ్యం, రక్తపాత అంతర్యుద్ధాలు, మోహాలు, సైన్సు, మూఢనమ్మకాలు కలబోసుకున్న ఈ నవలకు భారతదేశంతో బీరపీచు సంబంధం ఉంది. కథ ప్రకారం ఈ రచన మెల్కియాదిస్ అనే ఆసియా ఇంద్రజాలికుడు, బహుశా భారతీయుడు తన మాతృభాష సంస్కృతంలో రాసిన గాథ. మార్క్వెజ్‌కు సంస్కృతంపై, అమెరికాయేతర, యూరపేతర నాగరికతలపై ఉన్న ఆసక్తి వల్ల అతనితో ఆ భాషలో రాయించి ఉండొచ్చు. బాల్యంలో మార్క్వెజ్‌కు కథలు చెప్పిన అమ్మమ్మ మౌఖిక కథన సంప్రదాయం, మెల్కియాదిస్ లిఖిత సంప్రదాయం రెండూ కథనంలో కనిపిస్తాయి.
“పందితోక పిల్లాడు పుట్టకుండా ఓ కుటుంబం వందేళ్లపాటు ఎన్ని తిప్పలు పడిందో చెప్పడానికే ఈ నవల రాశాను," అన్నాడు మార్క్వెజ్. సరదాగా అనిపించినా నిజమైతే అదే. కాకపోతే ఆ కుటుంబపు వందేళ్ల చరిత్ర సామాజిక ఉత్థానపతనాలతోనూ, కౌటుంబిక, వైయక్తిక ఏకాంతంతోనూ గాఢంగా పెనవేసుకుని ఉండడంతో మొయ్యలేనంత గాంభీర్యం సంతరించుకుంది. గిలిగింతలు పెట్టే, చురుక్కుమనిపించే హాస్యం ఆ సంక్షోభాల, మాంత్రిక వాస్తవాల చరిత్రకు ఓ చక్కెర పూత మాత్రమే. ఆ పూత కింద వెచ్చని నెత్తుటితో రగిలే అలవిగాని కోరికలు, ఒళ్లు జలదరించే భయాలు, చెదిరిన కలలు, చల్లారిన విప్లవాలు, కొన ఊపిరి ఆశలు, బిక్కుబిక్కుమనే ఏకాంతాలు మరెన్నో ఉంటాయి. అవన్నీ సార్వజనీన అనుభవాలు కనకే 'వందేళ్ల ఏకాంతం' ప్రతి మనిషి ఏకాంతం అయింది. వందేళ్ల మకోందో చరిత్ర ప్రతి ఊరి కథ అయింది.
మార్క్వెజ్ పుట్టి పెరిగిన కొలంబియాలోని అరకటాకా ఊరికి కాల్పనిక ప్రతిబింబిం మకోందో. స్పానిష్ వలసపాలన ముగింపు దశ నుంచి ఇరవయో శతాబ్ది తొలి మూడు దశకాల (1820-1930) వరకు లాటిన్ అమెరికా సామాజిక, రాజకీయార్థిక చరిత్ర మొత్తం ఈ ఊరి ప్రస్థానంలో ప్రతిఫలిస్తుంది. సమానత్వ విలువలతో అవతరించిన మకోందో కాలక్రమంలో రైళ్లు, టెలిఫోన్లు, సినిమాలు, సామ్రాజ్యవాద పెట్టుబళ్ల అభివృద్ధి వెలుగు నీడల్లో ఎలా నలిగి, ధ్వంసమై నేలపై ఆనవాళ్లే లేకుండా తుడచుపెట్టుకుపోయిందో మార్క్వెజ్ 'నవరస' కథనంతో పరిచయం చేస్తాడు. బుయెందియాల కుటుంబపు ఏడు తరాల ఏకాంత కథ కాలక్రమంలోనే సాగినా వర్తమానం తరచూ గతంలోకి, భవిష్యత్తులోకి తొంగి చూస్తూ త్రికాలాల ఉత్కంఠతోపాటు కాస్త తడబాటుకూ దారితీస్తుంటుంది. ప్రతి తరంలో పునరావృతమయ్యే అర్కాదియో, ఔరెలియానో పేర్లు, చేష్టలు మరో సవాలు.
కల్పనకు మించిన కల్పనలా తోచే వాస్తవికత ఈ నవలకు ఆయువుపట్టు. ఇందులోని చాలా పాత్రలు, సంఘటనలు నిజమైనవే. రచయిత ఈతిబాధలూ, ఏకాంతమూ ఉన్నాయి. కన్జర్వేటివులతో తలపడే లిబరళ్ల యోధుడు కర్నల్ ఔరెలియానో బుయెందియాకు, మార్క్వెజ్ తాత కర్నల్ నికోలస్ మార్క్వెజ్‌తో చాలా పోలికలు ఉన్నాయి. అరటి కంపెనీకి చెందిన వందలాది కార్మికులను సైన్యం కాల్చిచంపిన ఉదంతం 1928లో అరకటాకాకు దగ్గర్లో జరిగినదే. తను పుట్టిన మట్టిని, అక్కడి మనుషులను మార్క్వెజ్ ఈ నవలతోపాటు చాలా రచనల్లో పరిచయం చేస్తాడు. మార్క్వెజ్ ఈ నవలను పద్దెనిమిది నెలలపాటు అప్పుల మధ్య రోజూ అదే పనిగా రాశాడు. అంతకు ఇరవయ్యేళ్ల ముందు నుంచే ఆయన ఊహల్లో, రచనల్లో నమోదవుతూ వస్తున్న మకోందో సహా అనేక పాత్రలు ఇందులో చేరాయి.
మార్క్వెజ్ వామపక్ష అభిమాని. రచనల్లోనే కాదు, ఆచరణలోనూ దాన్ని చూపాడు. లాటిన్ అమెరికాలో సామ్యవాద స్వప్నం ఫలించాలని మనసారా కోరుకున్నాడు. తనకొచ్చిన బహుమతులు సొమ్మును ప్రజా ఉద్యమాలకు విరాళంగా ఇచ్చాడు. శాంతి చర్చల్లో పాల్గొన్నాడు. నోబెల్ బహుమతి ఆయన కీర్తిని ఇనుమడింపచేసినా, అంతకుమించిన గుర్తింపు పాఠకుల ఆదరాభిమానాలే. “ప్రేమే సత్యమైన, సుఖశాంతులతో వర్ధిల్లే, మానవ హననాలకు తావులేని, శాపగ్రస్తులను సైతం చేరదీసే సమాజం,” ఆయన ఆకాంక్ష.
'వందేళ్ల ఏకాంతం' అనువాదానికి సులభంగా లొంగేది కాకపోయినా నా ప్రయత్నం నేను చేశాను. లోటుపాట్లు ఉండొచ్చు. వాటిని నా దృష్టికి తీసుకొస్తే తప్పక దిద్దుకుంటాను. అనువాదంలో ఎంతో సాయపడిన మిత్రులు పన్యాల జగన్నాథ దాసు గారికి, మందలపర్తి కిషోర్ గారికి, వెన్నుతట్టి ప్రోత్సహించే మరెందరో మిత్రులకు, ప్రెస్సు కార్మికులకు, పాఠకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
మూలాలు
[మార్చు]- గాబ్రియెల్ గార్షియా మార్క్వెజ్ ‘వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్’ తెలుగు అనువాదం:వందేళ్ళ ఏకాంతం, పి.మోహన్,2022.