వడదెబ్బ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒకినావా చురామి అక్వేరియం యొక్క ప్రధాన ద్వారం యొక్క ఎడమ వైపున, "హీట్ స్ట్రోక్ రాకుండా జాగ్రత్త వహించండి అనే బోర్డు

వడదెబ్బ (Heat stroke) లేదా ఎండదెబ్బ అంటే పరిసరాల్లో ఎక్కువ ఉష్ణోగ్రత వల్ల శరీరంలోని వేడిని నియంత్రించే విధానం (thermoregulation) విఫలమవడం. చాలా వేడియైన వాతావరణంలో, సరియైన మోతాదులో ద్రవపదార్థాలని తీసుకోకుండా తీవ్ర వ్యాయామం లాంటి చురుకైన పనులవలన కలిగే అధిక వేడిని శరీరం తట్టుకోలేనప్పుడు ఇది సంభవిస్తుంది. అధిక ఉష్ణోగ్రతలు, శరీరం యొక్క ప్రాథమిక అవయవాలు విఫలమయ్యేలా చేస్తాయి. వేడికి సంబంధించిన సమస్యలలో వడదెబ్బ చాలా తీవ్రమైనది.[1]

శరీరంలో వేడిని చల్లబరచడానికి చెమటపట్టే క్రమంలో కొన్నిసార్లు రక్తంలో ద్రవం ఎక్కువగా ఆవిరైపోతుంది. అప్పుడు శరీరంలో ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ కుప్పకూలి, చెమట పట్టడం కూడా ఆగిపోయి, శరీర ఉష్ణోగ్రత బాగా పెరిగిపోతుంది. కొన్ని సందర్భాల్లో శరీర ఉష్ణోగ్రత 106 డిగ్రీలు కూడా దాటవచ్చు. ఆ సమయంలో శరీరం ముట్టుకుంటే కాలుతూ ఉంటుంది. చర్మం పొడిబారుతుంది. నీరు, రక్తం పరిమాణం తగ్గడం వల్ల రక్తపోటు కూడా పడిపోతుంది.[2]

లక్షణాలు[మార్చు]

వడదెబ్బకు ముందస్తు సూచనలు వేడి నిస్త్రాణ (Heat Exhaustion). అంటే ఎండ వేడిమికి తట్టుకోలేక కొంతమందిలో తీవ్రమైన నీరసం, నిస్సత్తువ, నిస్త్రాణ ఉంటుంది. చుట్టుపక్కన వేడిగాలిని, శరీరం తట్టుకోలేకపోతుందని, చల్లబరుచులేకపోతుందనడానికి ఇది ఒక హెచ్చరిక. విపరీతంగా చెమట పడుతుంది, శ్వాస ఎక్కువగా తీసుకోవలసి వస్తుంది. ఎక్కువ చెమట పట్టడంవల్ల శరీరంలో లవణాలు కూడా బయటకు వెళ్ళిపోతాయి. నాడి వేగం కూడా తగ్గుతుంది. ఇదే పరిస్థితి ఎక్కువసేపు కొనసాగితే వడదెబ్బకు దారితీస్తుంది.

కారణాలు[మార్చు]

జీవక్రియలో భాగంగా ఎక్కువ వేడి ఉత్పన్నం కావడం, పరిసరాల్లో వేడి ఎక్కువగా ఉండటం లాంటి కారణాల వల్ల శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ సరిగా పని చేయక శరీర ఉష్ణోగ్రత అమాంతం పెరిగిపోతుంది. శరీరం చల్లబడటాన్ని అడ్డుకునే పదార్థాలైనా ఆల్కహాలు, ఉత్ప్రేరకాలు, కొన్ని రకాల ఔషధాలు మొదలైనవి డీహైడ్రేషన్ ను కలుగ జేస్తాయి. ఇది సాధారణంగా పెద్ద వాళ్ళలోనూ, పెద్దగా గాలి ఆడని ప్రదేశాల్లో నివాసం ఉండేవారిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది.[3]

నియంత్రణ[మార్చు]

వడదెబ్బను నివారించడానికి ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. అధిక వేడి వాతావరణానికి దూరంగా ఉండాలి.[4]

చికిత్స[మార్చు]

వడదెబ్బకు గురైనపుడు శరీరాన్ని వేగంగా చల్లబరిచే ప్రయత్నం చేయాలి. చల్లటి నీళ్ళు చల్లడం, ఫ్యాను గాలి ధారాళంగా తగలనీయాలి. చల్లటి సెలైన్లు నరాల ద్వారా ఎక్కించడం కూడా చేయవచ్చు.

వడదెబ్బ తగలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు[మార్చు]

 • ఎండలో ఎక్కువగా తిరగరాదు. అవరసమై వెళ్ళవలిస్తే నెత్తికి గొడుగు లేదా టోపీ రక్షణగా వాడాలి
 • తగినన్ని నీళ్ళు తాగాలి.
 • వేసవికాలంలో వదులైన నూలు దుస్తులు ధరించాలి.
 • కారం, మసాలా పదార్థాలు తినడం తగ్గించాలి

వడదెబ్బ తగిలినపుడు పాటించవలసిన నియమాలు[మార్చు]

 • రోగిని నీడపట్టున చేర్చాలి. దుస్తులను వదులుగా చేసి తడిగుడ్డ తో ఒళ్ళంతా తుడవాలి
 • రోగికి తగినంత గాలి ఆడేటట్లు చేయాలి. రోగి చుట్టూ గుమిగూడకూడదు.
 • వీలైనంత త్వరగా ఆసుపత్రికి తరలించాలి

మూలాలు[మార్చు]

 1. జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమీ, హైదరాబాదు.
 2. "ఎండకు మండొద్దు". EENADU. Retrieved 2022-03-29.
 3. "Heat emergencies: MedlinePlus Medical Encyclopedia". www.nlm.nih.gov. Archived from the original on జనవరి 5, 2016. Retrieved జనవరి 19, 2016.
 4. "Tips for Preventing Heat-Related Illness, Extreme Heat". www.cdc.gov (in అమెరికన్ ఇంగ్లీష్). జూన్ 19, 2017. Archived from the original on జూలై 29, 2017. Retrieved జూలై 17, 2017.
"https://te.wikipedia.org/w/index.php?title=వడదెబ్బ&oldid=3553067" నుండి వెలికితీశారు