వాడుకరి:రాగంరవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పరిచయం: నా పేరు రవికుమార్ రాగం. మా స్వగ్రామం కృష్ణాజిల్లాలోని గురవాయిపాలెం అనే చిన్నగ్రామం.7వ తరగతి వరకు మా ఊరిలోనే చదువు పూర్తిచేసాను,8- 10వ తరగతి(జెడ్.పి.హెచ్ స్కూల్,1997-1999), ఇంటర్మీడియట్(ఎ.ఎస్.ఆర్.ఆర్. జూనియర్ కాలేజి,1999-2001) వరకు పక్కనే ఉన్న కలిదిండిలోనే చదువుకున్నాను.ఇంటర్మీడియట్‌లో 748 మార్కులతో కళాశాలలో మొదటి ర్యాంక్ సాధించాను. నా జీవితంలో ఇంటర్మీడియట్‌కు చాలా ప్రాధాన్యత ఉందనే చెప్పాలి. ఎందుకంటే చాలా బుద్ధిగా,సంతోషంగా,ఆడుతూ... పాడుతూ... నాన్నకు వ్యాపారంలో సహకరిస్తూ బాగా చదువులో రాణించాను. ఆ తరువాత డిగ్రీ కోసం భీమవరంలోని కె.జి.ఆర్.ఎల్ కళాశాలలో బి.కామ్‌(2001)లో చేరాను. ప్రతిరోజూ నేను,నా స్నేహితుడు(పడవల వేంకటేశ్వర రావు,కలిదిండి) బస్సులో కలిదిండి-భీమవరం వెళ్ళేవాళ్ళం. ఈ 3 సంవత్సరాల బస్సు ప్రయాణం ఎన్నో అనుభవాలను,పాఠాలను మరియు బాధ్యతలను నేర్పింది. మా కొట్టులోకి కావలసిన సరుకులను కొని,చేరవేస్తూ కొడుకుగా నాన్నగారికి కొంతవరకు సహాయపడే వాడిని. ఇది కూడా నా జీవితంలో ఎన్నో మధురస్మృతులను నింపింది.

2004లో బి.కామ్ ప్రథమశ్రేణిలో పూర్తి చేశాను. ఆ తరువాత చదువు మానివేసి, ఏదైనా చిన్న ఉద్యోగంలో చేరి నాన్నగారికి సహాయపడదాం అనుకున్నాను. కానీ అప్పటికే హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్.సి.యు)లో ఉన్నత విద్యలను అభ్యసిస్తున్న మా అన్నయ్య దానికి సమ్మతించలేదు. ఏదిఏమైనా నువ్వు తప్పకుండా పై చదువులు చదివి మంచి ఉద్యోగం సంపాదించాలి అని నాలో స్ఫూర్తిని నింపాడు. అన్నయ్యే నా తరపున హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్.సి.యు)లో ఎమ్.ఎ భాషాశాస్త్రంలో దరఖాస్తు వేశాడు. దాని రాతపరీక్షకు సంబంధించిన మెటీరీయల్ నాకు పంపించాడు, కానీ ఆ పదజాలం నాకు ఏమాత్రం అర్థం కాలేదు. అప్పుడు నేను అన్నయ్య సూచన మేరకు పరీక్షకు 4రోజుల ముందు హైదరాబాదు వెళ్ళాను. అన్నయ్య ఇచ్చిన పుస్తకాలతో అక్కడే సాధన చేశాను. భగవంతుని దయవలన నాకు భాషాశాస్త్రంలో సీటు వచ్చింది. కానీ అన్ని సబ్జెక్టులు ఇంగ్లీషులోనే చదవాల్సిన పరిస్థితి. ఇంగ్లీషు-తెలుగు నిఘంటువులు,తెలుగు ఆచార్యుల సహాయంతో కొద్దికొద్దిగా ఇంగ్లీషు నేర్చుకోవడం మొదలుపెట్టాను. ఒకానొక సందర్భంలో నాలో స్థైర్యాన్ని కోల్పోయి కోర్సు విడిచిపెట్టి వెళ్లిపోదామనిపిచ్చింది. కానీ తెలుగు సీనియర్లు,ఆచార్యులు దానిని వ్యతిరేకించి నన్ను కొంచెం ఓపికపట్టి,నిలదొక్కుకొనుటకు ప్రయత్నించమన్నారు. మొత్తం మీద ఎమ్.ఎ ఎటువంటి అవాంతరాలు లేకుండా ప్రథమశ్రేణి(69.4%)లో ఉత్తీర్ణుడనయ్యాను.

ఆ తరువాత 2006లో ఎం.ఫిల్(అనువాదశాస్త్రం)లో చేరాను. తెలుగులో కంప్యూటర్ పదజాల స్థానీకరణ-ప్రభావం అనే అంశంపై సిద్ధాంత గ్రంథాన్ని రాశాను. 2008లో ఎం.ఫిల్ 81.5%తో ఉన్నతప్రథమశ్రేణి(డిస్టింక్షన్)లో ఉత్తీర్ణుడనయ్యాను. ఆ తరువాత 2008 జూలైలో పి.హెచ్.డి(అనువర్తిత భాషాశాస్త్రం)లో చేరాను. అదే సంవత్సరంలో విశ్వవిద్యాలయ విద్యార్థి నాయకుడిగా అఖిల భారత విద్యార్థి పరిషత్(ఎబివిపి) తరపున ఎన్నిక అయ్యాను. అలా ఎన్నికయిన రోజునే నవంబర్ 7,2008 సీడాక్,పూణే నుండి ఉద్యోగంలో చేరమని ఆఫర్ లెటర్ వచ్చింది. ఏమి చేయాలో తెలియని పరిస్థితి కుటుంబ సభ్యులు,అధ్యాపకులు,మరికొంతమంది మిత్రులు తక్షణమే చేరమని సలహా ఇచ్చారు. పి.హెచ్.డి,విద్యార్థి నాయకుడి పదవికి స్వస్తి చెప్పి 2008,డిసెంబర్ 1న సీడాక్‌(అధునాతన కంప్యూటీకరణ అభివృద్ధి కేంద్రం)లో చేరాను. ప్రస్తుతం సీడాక్‌లోనే తెలుగు బాషా నిపుణుడిగా పనిచేస్తూ తెలుగు భాషా అభివృద్ధికి నా వంతు కృషి చేస్తున్నాను.

మనవి: ప్రతీ ఒక్కరూ మాతృభాషాభివృద్ధికి కృషి చేయండి అంతేకాని ఇతర భాషలను ద్వేషించరాదు. ఇతర భాషలలోని పదజాలాన్ని,సారాన్ని దేశీయ పద నిర్మాణ పద్ధతుల ద్వారా మన భాషలోని తీసుకొనుట శుభపరిణామమే.