Jump to content

వాడుకరి:వెన్నెల సత్యం

వికీపీడియా నుండి

వెన్నెల లాంటి కవిత్వం సత్యం సొంతం!

వెన్నెల ఆకాశం నుండి జాలువారినా అది గగనానికి చెందదు అవనికి చేరి ఆహ్లాదమవుతుంది. వెన్నెల సూర్యరశ్మిలా మండిపోదు చంద్ర కాంతి అయి సుతిమెత్తగా తాకుతుంది. వెన్నెల ఆనందం వెన్నెల అనురాగం వెన్నెల అనుభూతి వెరసి..వెన్నెల కవిత్వం...!

ఆ వెన్నెల లాంటి కవిత్వమే 'వెన్నెల సత్యం. కవిత్వ ప్రక్రియ ఏదయినా సరే ఆ ప్రక్రియకు మరింత గౌరవం, అందం తేవడం మెరుపులు మెరిపించడం సత్యం గారి ప్రత్యేకత. వీరు 6-మే - 1976 లో వనపర్తి జిల్లా నాగల్ కడుమూర్ లో జన్మించినారు. వీరి తల్లిదండ్రులు మోనమ్మ , వెంకట్రాములు. షాద్ నగర్ లో ప్రస్తుతం నివసిస్తున్న సత్యం వృత్తి రీత్యా ప్రభుత్వ ఉపాద్యాయులు. మొదట కండక్టర్ గా దాదాపు పదకొండేళ్లు పనిచేసిన సత్యం కవిగా మేల్కొన్నది మాత్రం ఉపాద్యాయ వృత్తిలోనే (2009). కండక్టర్ గా పని చేసిన అనుభవం వల్లనేమో వివిధ రకాల మనుష్యులను సమాజం స్థితిగతులను అర్దం చేసుకొని ఇంత మంచి రచనలు చేస్తున్నారు.

  • వీరి రచనలు*
  • నానీల వెన్నెల ( మే-2017)
  • ప్రేమ నానీలు ( అక్టోబర్ - 2017)
  • వెన్నెలమ్మ శతకం ( మే - 2018)
  • వెన్నెల మణిపూసలు ( డిసెంబర్ - 2018)
  • బతుకు చెట్టు (వచన కవిత్వం, నవంబర్-2019)
  • వెన్నెల తొడిగిన రెక్కలు (డిసెంబర్-2019)
  • పుప్పొడి ( 2019- సహ సంపాదకత్వం - సర్ఫరాజ్ అన్వర్ ; వి.జయ ప్రకాశ్ లతో కలసి)
  • గడ్డిపూలు ( 2020 సంపాదకత్వం - బడి పిల్లల కవితా సంకలనం)
  • అమ్మ నానీలు (2020)
  • వాసంతిక - గజల్ సంపుటి(త్వరలో)
  • పాలమూరు నానీలు ( అముద్రితం)
                  కవిత్వం పరంగా అభివ్యక్తిలో బలమైన భావుకత గల సత్యం గారు తొలిసారిగా నానీలతో సాహిత్య లోకానికి పరిచయం అయ్యారు. వీరి తొలి రచన నానీల వెన్నెల. ఇందులో అనితరసాధ్యంగా అత్యధికంగా 500 నానీలు రాసారు. అవి కూడా వేటికవే విభిన్నమైనవి. 
                    నానీల వెన్నెలలో రాశి ఎక్కువ అయినా వాసిలో కూడా నాణ్యమైనవే. దీనిలో మనిషి పై ; వృత్తులపై ; మనసు పై ; ప్రేమ పై ; ఆరోగ్యం పై ; పల్లె పై ; బాల్యం పై ; ఇలా అనేకానేక అంశాలపై నానీలు కలవు. వేటికవే ప్రత్యేకం.
  • నానీల వెన్నెల లోని కొన్ని నానీలు*

గడియారానికి/గర్వమెక్కువ/తన చుట్టూ లోకం/తిరుగుతోందని( 1 ) మీ ఇంట్లో/ఆత్మీయతలు ఎక్కువా/అయితే/టీవి లేదన్న మాట ( 2 ) మేము చేస్తే ఏదైనా/ఉద్యమమైతది/ఇంకెవరు చేసినా/ద్రోహమైతది( 3 ) ఒక చేతిలో కత్తి/మరో చేతిలో యాసిడ్/వీడండి/నేటి ప్రేమికుడు!( 4 ) అతడు/చెయ్యి తిరిగిన వడ్రంగి/అతనింట్లోనూ/ప్లాస్టిక్ కుర్చీలే! ( 5 )

                 నేటి తెలుగు సినిమాలు ప్రేమ అనే మాటను కామం , ఆకర్షణ అనే స్థాయికి దిగజార్చాయి. సిన్మా పాటల సాహిత్యంలో సైతం అశ్లీలం తాండవిస్తుంది. పాఠకుల లోకం నిజమైన ప్రేమను చదువుతుందంటే అది కవిత్వం పుణ్యమే. ప్రేమకు నిరూపణ కామం అయినచోట ప్రేమకు సరైన నిర్వచనం ఇస్తున్నది నేటి కవిత్వమే. ప్రేమను వస్తువుగా తీసుకుని నానీల రూపంలో ప్రేమ పరిమాళాలను వెదజల్లారు సత్యం గారు. ప్రేమంటే స్వర్గం కాదు అది నరకంలో కూడా బతకనివ్వాలి అంటారు సత్యం.

నీ ప్రేమ నాకు/బతుకునిచ్చింది/నరకంలోనూ/నన్ను బతకనిచ్చింది!

                    ఇలా ప్రేమను సుకుమారంగా అక్షరీకరిస్తూ ప్రేమ పట్ల తన భావనలు తెలిపారు కవి. దీనిలో ఎక్కువ భాగం తన శ్రీమతిపై ప్రేమను తెలియజేసేవిగా కనిపిస్తున్నాయి. ఉదాహరణ కు........

ఏమండీ/ఆ పిలుపుతో/వలపు తేనె చెవుల్లో/పోసినట్లుంది!( 1 ) ఈ రోజు నానీలేవి/ఈ ప్రశ్న తో/నన్ను నడిపించేది/ నాలోని సగమే!( 2 ) చివరికి తెలిసింది/ఏ అక్షరమూ/నీ సౌజన్యాన్ని/చిత్రించలేవనీ!( 3 ) ఇంకా ప్రేమలో ఆకర్షణ వికర్షణ సుఖదుఃఖాల ప్రస్తావనలు వీరి నానీలలో కనిపిస్తాయి. నింగి నేలా/అమర ప్రేమికులు/వాళ్లది యుగయుగాల/చూపుల భాష!

                      ఆకాశం భూమి ఎప్పుడు కలవవు. కానీ నింగి ఔదార్యం తోనే నేల వికసించేది.ఆ ప్రేమనే చూపుల భాష అన్నారు కవి.ఇలా నానీలన్నీ గంభీరంగా వున్నా ఎంతో భావకతతో వున్నాయి. వెన్నెల సత్యం గారికి నానీలపై మక్కువ ఎక్కువ . తెలుగు పూల తోటలో నేను సభ్యుడిగా ఉన్నాను. అప్పట్లో వరుసగా వారు రైతు ; పల్లె ; అమ్మ ; రాజకీయ నానీలు ఇలా రకరకాల నానీలు విస్తృత్తంగా రాసారు. ఇలా వారు ముద్రణ చేయదలుచుకుంటే వారి నానీల పుస్తకాలే 10-15 దాక ఉండే అవకాశం వుంది. 
  • ప్రేమ నానీలలో కొన్ని*

మనసున మనసైన/శ్రీమతి ఉన్నోడి కన్నా/లోకంలో/శ్రీమంతుడెవరు! ( 1 ) నువ్వు దగ్గరుంటే/నే కవిత్వాన్నవుతా/దూరమైతే/ కన్నీటి కావ్యమౌతా! ( 2 ) నువ్వు లేని స్వర్గం/నాకసలే వద్దు/నువ్వు తోడుంటే/నరకమైన ముద్దు! ( 3 ) నీ కోసం/ఎక్కడెక్కడో వేతికాను/చివరికి/నాలోనే దొరికావు! ( 4 ) నీ గురించి/కావ్యం రాయాలనుకుంటా/నువ్వేమో/ నానీలో ఒదిగిపోతావు ( 5 )

                 వచన కవితా ప్రక్రియలో అద్భుతంగా రాణిస్తున్న సత్యం గారు పద్య కవిత్వాన్ని కూడా ఔపోసన పట్టి ఏకంగా ఒక శతకం రాయడం ప్రత్యేకత. శతకమంటే దీర్ఘ సమాసాలు, అర్దం కాని పదబంధాలు అనుకునే నేటి కాలపు విద్యార్దులకు స్వచ్ఛమైన వ్యవహరిక భాషలో సత్యం గారు శతకం రాయడం మెచ్చుకోదగ్గ విషయం. వెన్నెలమ్మ శతకానికి పెట్టిన ఉపశీర్షిక ను బట్టే ఇందులో పర్యావరణం,చెట్లను గురించి ఉందన్న విషయం అర్దమవుతుంది. దీనిలోని 100  పద్యాలలో దాదాపు 50-55 పద్యాలు చెట్టు చుట్టే తిరిగాయి. చెట్టు మీద ఇన్ని పద్యాలు చెప్పవచ్చా అని మనం కూడా ఆశ్చర్యపోతాం. 

నీడలోకి బిలిచి ఆడుకొమ్మని చెప్పి అలసటంత దీర్చు అమ్మవోలె అనునయమ్ము జూపు ఆ చెట్టు నాన్నోలే వెన్నెలమ్మ మాట వెలుగు బాట

                ఇలా చెట్టు గొప్పదనాన్ని కన్నతండ్రితో పోల్చుతారు కవి. పద్యం మకుటం ఎంచుకోవడంలోనే కవి ప్రతిభ తెలుస్తుంది. సుమతీ శతకం ; కుమారి శతకం ; ఇలా చాలా శతకాలను చూస్తే మకుటం వాడడంలో సాత్వికతను ప్రభోదించేట్లు ఉంటాయి. అలా కాకుండా బెదిరించినట్లు పులి మాట అనో, బెబ్బులి మాట విను అనో, ఓరీ ! కుమతి అనో ఇలా కొట్టే బెత్తంలా హెచ్చరికలా వుంటే అదీ ఎంత మంచి మాట అయినా పాఠకుడు చదవడు. చదివినా మార్పు కోరుకోడు. సత్యం గారి శతకం లో మకుటం ప్రధానాంశం. వీరి మకుటం చీకటి దారి లో వెలుగు ప్రభోదిస్తుంది అనే భావంలో కలదు. అదే ఈ శతకానికి సున్నితత్వాన్ని ఇచ్చింది. 
              ఈ మధ్య పత్రి యేడు హరితహారం పేరుతో ప్రభుత్వం అనేక కార్యక్రమాల ద్వారా కృషి చేస్తుంది. కానీ ఫలితాలు శూన్యం ఎందుకు అనేది వారి పద్యంలోనే......

కోట్ల సంఖ్యలోన కోరి మొక్కలు నాటి రక్ష జేయకున్న రాళ్ళ పాలు బాట వెంట చెట్లు బతుకుకే దీపాలు వెన్నెలమ్మ మాట వెలుగు బాట

                 హరితహారం పేరు తో ఏదో మొక్కుబడిగా మొక్కలు నాటి వదలివేసే ప్రభుత్వాలకు ఇది చురక. అలాగే ప్లాస్టిక్ ప్రబలుతున్నా నేటి ప్రపంచాన చెట్టు ప్రాధాన్యతను దాని ఆర్ద్రతను తెలిపే ఎన్నో పద్యాలు ఇందులో కలవు. 

గండ్ర గొడ్డలెపుడు గాండ్రించు జూసినా తల్లడిల్లునోయి తరువు మనసు కాస్త జాలి జూపి కాపాడమని యేడ్చు వెన్నెలమ్మ మాట వెలుగు బాట

                         అవనిలో మొలచిన ప్రతి చెట్టు ఏదో ఒక రకంగా జనులకు ఉపయోగమే. చివరికి కాల్చి బూడిద చేసినా బొగ్గురూపంలో తరువు ఉపయోగం. అలాగే చెట్టును నరికినా కూల్చినా  మళ్లీ చిగురించు. దీనిపై కవి....

ఆకులన్ని రాలి ఆ చెట్టు శిశిరాన మోడు వారినంత యెండి పోదు ఆశల చిగురేయు ఆత్మ విశ్వాసాన వెన్నెలమ్మ మాట వెలుగు బాట

                   ఇలా మనిషి కూడా జీవితం లో చెట్టును ఆదర్శంగా తీసుకోవాలంటారు కవి. చెట్టు గురించి మాత్రమే కాదు నాయకుల గురించి; నేటి కాలంపై ; రైతులపై ఇలా సామజిక ఆంశాల పై పద్యాలు రాసారు సత్యం.

వీరి పద్యాలలో దుష్టాంతాలు ; సామెతలు ; ఉపమానాలు ; రూపకాలు ఎన్నో కలవు. ఉదాహరణ కు వాటిని చూస్తే....

1) తలలు దీయువాడు తరువుల్ని వదులునా 2) మనిషి కన్న మాను అనువైన నేస్తమ్ము 3) వనము లేక పుడమి వానెట్లు వచ్చురా 4) అమ్మ కన్న మిన్న అవనిలో లేదేది 5) చిత్త శాంతి కన్న నుత్తమంబేదిరా 6) తామరాకు వోలే తలయెత్తి బతకాలి 7) మనసు లేని యంత్రమైపోయె మనిషిరా

                ఈ శతకానికి వల్లభపురం జనార్దన గారు రాసిన వెన్నెల చినుకులు అనే ముందు మాట ప్రత్యేకమైంది.దీనిలో వారన్నట్లు సత్యం గారి పద్యధార ఎక్కడా కుంటుబడకుండా సాగింది. అక్కడక్కడ వేమన గారిని తలపించినా పద్య రచనలో ఇంకా పరిణితి సాధించాల్సి వుంది. సత్యం గారు రాసిన శతకం లో 100 పద్యాలున్నాయి. అయితే వీరి మొత్తం రచనలను పరిశీలన చేస్తే కవికి కొంత నాస్తికత , శాస్త్రీయ దృక్పధం ఉన్నాయని అనిపిస్తుంది. ఏది ఏమయినా వీరి శతకంలో సరాసరి 100 పద్యాలు ఉండటం కంటే ఇంకాస్త 5-8 పద్యాలు ఉండి శతకనియమ ఖచ్చితత్వం పాటించి 108 పద్యాలు ఉంటే బాగుండని అనిపించింది. 
                తన వెన్నెలలాంటి కవిత్వంతో చల్లదనాన్ని ఆ ప్రక్రియ వ్యాప్తి వెచ్చదనాన్ని అన్నీ సమపాళ్ళలో చిలికించి పాఠకులకు రుచి చూపించగల మంచి కవి సత్యం గారు మణిపూసలలో కూడా తన ప్రతిభ చూపారు. మణిపూసలు అతి తక్కువ కాలంలో మంచి ఆదరణ తో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న ప్రక్రియ ఇది. దీనిని వడిచర్ల సత్యం గారు రూపొందించారు. ఇది 2018 ఆగస్టు1 న వడిచర్ల గారి మణిపూసలు ప్రక్రియ ఆవిష్కరణ జరిగింది. మణిపూసలు లో నాలుగు పాదాలు ఉంటాయి. 1-2-4 పాదాలలో అంత్య ప్రాస వుండాలి. మణిపూసలు ప్రక్రియ లో వడిచర్ల గారి పుస్తకం తర్వాత వెలువడిన రచన వెన్నెల మణిపూసలు. దీనిలో శీర్షికల పరంగా 22 మణిపూసలు కలవు. 
                 దీనిలో ఎన్నికలు, రాజకీయాలు, కేరళ వరద, తెలుగు భాష, రైతు వంటి అంశాలపై మణిపూసలు ఉన్నాయి.దీనిలో జీవితం పైన రాసిన మణిపూసలు చూస్తే.....

ఒంటరివే ప్రతి రేయి/తోడు రాదు ఏ చేయి/నిరాశను వదిలిపెట్టి/ముందుకే కదలవోయి

                 వంటి మణిపూసలు చూస్తే గురజాడ గారి ముత్యాల సరాలను గుర్తుకు తెస్తుంది. 

మణిపూసల పాదాలు/ఎదను నింపెను మోదాలు/ సాహిత్య లోకంలో/దొరికెను ఆమోదాలు

                  ఇలా సత్యం గారు మణిపూసలకు తన ద్వారా కవులపక్షాన అంగీకారం తేలిపారు. సహజంగా చాలా ప్రక్రియలలో ముక్తకాలు ఎక్కువ . ఉదాహరణకు నానీలు, రెక్కలు,  హైకూలు. కానీ వీరి మణిపూసలు శీర్షిక పరంగా వుండడం విశేషం. మైత్రి ని గురించి వీరు రాసిన మణిపూసలు చూస్తే..

స్నేహం ఓ తపస్సు/తొలగించును తమస్సు/ ఎడారంటి జీవితాన/స్నేహమే ఒయాసిస్సు!

                 ఇక్కడ నిజమైన స్నేహం దొరకడం కష్టం అంటారు కవి. స్నేహం అంటే చీకటి ని తొలగించేలా వుండాలి అంటారు. కానీ నేటి కాలం లో అలాంటి స్నేహాలు ఎండమావి లాంటిదే అని కవి భావన. ఈ మణిపూసలలో వ్యంగరూపంలో సాగిన మణిపూసలు 'భజన' శీర్షికన ఉన్నాయి.

ఎలినోరి భజన చేసి/పాలకులకు పూజ చేసి/ కవితలెన్నొ రాసేస్తాం/సిగ్గు యెగ్గు వదలివేసి

అన్నిటికీ ఆహాయని/అంతటా ఓహోయని అలుపెరుగక పొగిడెదము/పాలకులను సాహోయని

                     నేటి  పాలకులు ఏది చేసినా వారి పై స్వార్థప్రేమ ఒలకబోసే భజన కవులను తమ మణిపూసలలో నిరసిస్తాడు సత్యం. వెన్నెల మణిపూసలలో ఎక్కువ రాజకీయాల పైనే సాగినవి. ఇందులోని పెట్రోల్ భాధలు; స్వాతంత్య్రం ; భజన; ఓట్ల నాడు ; తెలుసుకో ; నేతలు ; ఎన్ని'కల'లో ; ఇవన్నీ నాయకులపై వ్యంగ్యంగా విమర్శనాత్మకంగా సాగినవే.
  • కొన్ని వెన్నెల మణిపూసలు*

కవిత్వాన మెరుపుంది/హృదయంలో ఎరుపుంది/ మా ఎదలో ఉదయించే/ఎర్రెర్రని తూరుపుంది (శ్రీశ్రీ)పరిశోధనలో మేటి/పాండిత్యములో పోటి/మీకెవ్వరు లేరులే/ సాహిత్యములో సాటి

                             *సినారె*

పెరుగుతున్న ఈ ధరలు ఆపలేరు మన దొరలు కంపెనీల ముసుగు వేసి కప్పుతారు మాయపొరలు

                             *పెట్రోల్ ధరలు*

రంగు రంగు జెండాలు రహస్యపు ఎజెండాలు ఎన్నికలయ్యే దాక వొంగి వొంగి దండాలు

                           *ఓటు కోసం*

పాలమూరు కపిలవాయి పరిశోధనకతడు వాయి కన్నీళ్లును పెట్టించెను స్వర్గానికి చేరిపోయి

                        *అలుపెరుగని యోధుడు*
          సత్యం గారు రాసిన వచన కవితా సంపుటి బతుకుచెట్టు. దీని శీర్షిక చూడగానే అర్దమవుతుంది.దీనిలో మనిషి బతకడం కోసం వృత్తులను ఎలా నమ్ముకుంటాడో అని. ఇదే విషయాన్ని పుస్తకం ముఖచిత్రం కూడా బలపరుస్తుంది.
                 తెలుగులో విస్తారంగా కవిత్వం వస్తున్న ఈ కాలంలో విభిన్న ప్రక్రియలపై రాసి తనదైన ముద్ర వేయాలని పరితపిస్తున్న కవి సత్యం. అలాగని ఏదో గుర్తింపు కోసం తాపత్రయం కాదు. తన చుట్టూ వున్న సమస్యలకు స్పందన తెలియచేస్తూ ప్రజలను ఆలోచించే విధంగా కవిత్వం రాస్తున్నారు. అందుకే వీరి కవిత్వం సార్వ జనీతను సంపాదించుకునే స్థాయిలో వుంది. ఇంకా చెప్పాలంటే తోటి కవులు స్పందించుటకు ఆలోచించే విషయాలకు కూడా సత్యం గారు దైర్యం గా కవిత్వం రాస్తున్నారు. (ఉదాహరణ నకు ఆర్టీసీ కార్మికుల సమ్మె).
                 సాధారణంగా నేను ఏదైనా పుస్తకం సమీక్షించుకోవాలి అనుకున్నప్పుడు ఆ పుస్తకం లోని కవితలను చదువుతూ నాకు నచ్చిన పాదాలను, వాక్యాలను అండర్ లైన్ చేసుకుని ఆ తర్వాత వ్యాసంలో పొందుపరుస్తాను. కానీ బతుకుచెట్టు పుస్తకంలోని  కవితలను చదువుకుంటూ అండర్ లైన్ చేస్తూ పోతే 63 కవితలలో దాదాపు 30-40 కవితలకు పూర్తిగా లైన్స్ కొట్టడం జరిగింది. దీనిని బట్టే చెప్పవచ్చు. ఒక పాఠకుడికీ, సమీక్షకుడికీ, విమర్శకుడికీ గుక్క తిప్పుకోకుండా విస్మరణ చేయకుండా, దాటి వేయకుండా చదివించ గల కవితా పుష్టి ; సృజనాత్మకత సత్యం కవిత్వానికి ఉంది. ఒక మంచి కవికి, కాబోయే గొప్ప కవికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి. 
                  వెన్నెల సత్యం కవిత్వంలో అక్కడక్కడ హేతువాద ధోరణి ; దైవ తిరస్కారణ ; సంప్రదాయ నిరసన ఎక్కువ గా కనిపిస్తుంది. బతుకుచెట్టులో తొలి కవిత ఈ పుస్తక శీర్షిక.

దీనిలో శ్రమైక జీవన సౌందర్యాన్ని చెబుతారు....

కార్మికుడి కష్టాల్ని బాధల్ని దాచుకున్నందుకేమో దాని దేహానికి అన్ని గరుకు గాట్లు



ఎడారి పరిస్థితులను తట్టుకుంటూ ఎదిగే ఈతచెట్టు మనిషికి బతుకు పాఠాలెన్నో నేర్పుతుంది..

             అంటూ ఈత చెట్టును గురించి చెబుతూ ఆ చెట్టే కార్మికుడికి బతుకుచెట్టయి నిలబెడుతుంది అంటారు. ఇలా బతుకు చెట్టుతో మొదలైన ఈ సంపుటి సకల వృత్తులను గుర్తుకు చేస్తుంది. దీనిలో ముసుగు అనే కవిత ఫేస్ బుక్ పరిచయాలను, వాటి వలన వచ్చిన దుష్ప్రభావాలను పరిణామాలను విమర్శిస్తూ......

ముక్కు మొహం తెలియని వారిని ముగ్గులోకి దింపుతున్న ముఖపుస్తకం

                 అంటూ FB లోని మత్తును గమ్మత్తు ను నయా వంచనను తన కవిత్వం లో ఎత్తి చూపుతూ ఇలా అంటారు...

వయసు లో పెద్దవారనుకుంటే బుద్దిలో చిన్నతనం చూపిస్తారు మేక తోలు కప్పుకున్న పులుల్లా పంజా విసిరే అదనుకోసం పరితపిస్తారు.

                 ఇలా సంఘటనల ద్వారా వీరు రాసే కవిత్వం చూడడానికి మొదట సింపుల్ గా సాధరణంగా అనిపించినా ఎంతో మందిని ఆలోచింపచేసే ముగింపుతో వుంటుంది. అలాంటిదే వీరు రాసిన కవిత "యాత్ర". ఇది డిల్లీ లోని రైతులు చేసిన పాదయాత్ర నేపథ్యంలో రాసిన కవిత...

కుల మతాల కుట్రలతో విభజించి పాలించే వారికి వేలాది రైతుల విశాల ఐక్యత వెగటుగానే తోస్తుంది

                 అంటూ అన్నం పేట్టే  రైతన్నల బొబ్బలెక్కిన చైతన్య పాదాల కింద నిర్దాక్షిణ్యపు ప్రభుత్వాలు పడిపోయే రోజు వస్తుందని అంటారు కవి. చక్కని ఉపమానాలతో రూపకాలతో సత్యం రాసిన మరో కవిత "కర్చీఫ్".దీనిలో.... 

ఎర్రటి ఎండలో నీడైనప్పుడు నాన్నని తలపిస్తుంది వానలో గొడుగైనప్పుడు అమ్మ చీర కొంగును మరిపిస్తుంది!

                     అంటూ రహస్యాలను సంతోషాలను పంచుకునే కర్చీఫ్ ఆత్మీయ నేస్తం అంటారు కవి చివరగా చెబుతూ....

ఒట్టి గుడ్డ ముక్క కాదది నా దేహంలో భాగమై మసులుకుంటుంది!

                  అంటూ ముగించడం బాగుంది. ఈ కవిత వెబ్ పత్రిక లో బహుమతి కూడా పొందినది. వీరు రాసిన మరో కవిత "నువ్వొచ్చినంక". దీనిలో సత్యం గారు తన అర్దాంగిని గురించి రాసిన వాక్యాలు వారి శ్రీమతి పట్ల వారికి వున్న ప్రేమను తెలుపుతాయి.

నీ మెడలో మూడు ముళ్ళు వేసినప్పుడు నాకు తెలియదు నా బతుకు బాటలో ముళ్లన్నీ పూలవుతాయని

నీతో కలిసి ఏడడుగులు నడిచినప్పుడు నాకు తెలియదు సుదూర గమ్యాలన్నీ చేరువతాయని

                    ఇలా వివాహ బంధంలో మాధుర్యాన్ని, స్నేహాన్ని, ఆత్మీయతను ప్రతి వాక్యంలో అద్భుతమైన వంతెనగా రాసారు సత్యం. ఈ కవిత చదివితే అర్దం అవుతుంది. ఒక కవి శ్రీమతికి ఇంత కంటే మంచి అక్షరాంజలి  ఏమి రాయగలరు ఏమి ఇవ్వగలరు........ 
  • బతుకుచెట్టు లోని కొన్ని కవితా పంక్తులు*

అమ్మ రొట్టెలు కొడుతున్నప్పుడు జాకీర్ హుస్సేన్ సంగీతాన్ని తలదన్నే ఆ శబ్దాల్ని వింటూ తాను కాలుతున్న సంగతే మరచిపోయేది!

                          *నల్లని చందమామ*

కొత్త బండ్ల విడి భాగాలన్నీ మా వాకిట్ల పడి ఉన్నప్పుడు అదొక దారు శిల్పశాలలా తోచేది!

                           *ఏడ్ల బండి*

నా అస్తిత్వం గుర్తించని గుడ్డి లోకం కోసం నా కడుపు మలినం చేసుకోను పురిటి నొప్పులు పంటి బిగువున భరించడం మానుకుంటా!

                              *గర్భశోకం* 
                   అయితే ఈ వచన కవితా సంపుటి ని పరిశీలనగా చూస్తే సత్యంగారికి  వున్న మినీ కవితల ; నానీల ప్రభావం స్పష్టంగా తెలుస్తుంది.  దాని నుంచి బయట పడితే బాగుండు అనిపించింది. దీనిలోని చాలా కవితలను మినీ కవితరూపంలో కూడా మార్చవచ్చు. 
                  ఈ మధ్య కాలంలో రెక్కలు ప్రక్రియ కవిత్వం చూడడం తక్కువ అనుకునే సమయం లో.. మళ్లీ ఆ ప్రక్రియలో మాధుర్యాన్ని గుర్తు చేసారు వెన్నెల. 2002 లో వచ్చిన ఈ ప్రక్రియలో దాదాపు 250 దాక పుస్తకాలు వచ్చాయి. తొలిసారిగా పి.శ్రీనివాస్ గౌడ్ రెక్కల సంపుటి ని తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. సుగమ్ బాబు గారు ప్రారంభించిన ఈ ప్రక్రియ కు అద్దేపల్లి రామమోహన్ రావు గారు ఆదరువుగా నిలిచారు. 
                  ఇక సత్యం గారు రాసిన వెన్నెల తొడిగిన రెక్కలు. దీనిలో 104 రెక్కలు ఉన్నాయి. సత్యం రాసిన రెక్కలులో సన్నివేశాన్ని చూపే అటువంటి రెక్కలు కనిపిస్తాయి.

ఒట్టేసి ఓట్లు దండుకున్న నాయకులు గట్టుకు చేరారు

                  ఓటరిప్పుడు
                  అంటరాని వాడు!
                     ఇలా రాజకీయ నాయకుల స్వభావాన్ని వర్ణించారు. మనిషి తన తత్వాన్ని మరిచి తోటి వారిని ప్రేమించడం మరిచాడు. ఇదే విషయంపై

మనిషికి మానవత్వం ఉందో లేదో చేప్పలేను జంతు తత్వం బాగా ఒంట బట్టింది

                 తోటి మనిషిని వదిలి
                 కుక్కలను ప్రేమిస్తాడు! 
                       ఇలా పరులను హితులను వదిలి జంతువులపై ప్రేమను ఒలకబోసే వారికి చెంపపెట్టు ఈ రెక్కలు. మరో రెక్క...

వీపు మీద ఎక్కితే అంబారీ వయ్యావు చిట్టి పాదాలకు మెత్తని గుండెపర్చావు

                        నాన్న నువ్వు
                        అమ్మ కు తీసిపోవు! 
                  ఇక్కడ అమ్మ నాన్నలకు ఆభేదం  చెప్పిన అభివ్యక్తీకరణ చాలా గొప్పది. మరో రెక్క....

దళితులకు మూడెకరాలు మిధ్య స్వామిజీలకు రూపాయి ఎకరం సత్యం

                   బంగారు తెలంగాణ
                   బ్రహ్మ రహస్యం ఇదే! 
                     ఇలా ఆరు పాదాలలో ఎంతో విషయం చెప్పారు. నేటి తెలంగాణ స్థితిని ఆవిష్కరించారు. ఉపమానాలతో కవిత్వం రాయడం సహజం గానీ దృశ్యాత్మకత ఉండటం గొప్ప విశేషం. కవికున్న ఎమోషనల్, సెన్సిటివ్ నెస్ దీనికి అధారం. మరో రెక్కలో....

నాన్న నా కోసం బాట వేసాడు కొడుకు కోసం నేను రహదారి వేసాను

                  నా కోసం పుత్రుడు
                  ఆశ్రమానికి దారి వేసాడు! 
                   దీనిలో బాట, రహదారి, దారి ; అనే విశేషణాలున్నాయి. సందర్భాన్ని బట్టి వీటి విలువ మారుతుంది. కొడుకుని పెంచి ప్రయోజకుడిని చేస్తే అతడు చివరికి తండ్రిని అనాధలా వృద్ధాశ్రమాలకు చేర్చడం అనే అర్థంలో వుంది. ఇంతటి ఆర్ద్రత వున్న రెక్కలు ఎన్నో వున్నాయి.ఈ సంపుటి పేరుకి ఆరు పాదాలే కానీ వ్యాఖ్యాన విస్తృతి గల రెక్కలు ఇవన్నీ.

అమ్మ నుదుటి బొట్టులో నవ్వుతూ నాన్న కనపడేవాడు

                   ఇప్పుడు అమ్మ కళ్లలో
                   వెతుకుంటున్నా!
                         ఇక్కడ నుదిటిబొట్టు స్త్రీ ఐదోతనానికి ప్రతీక. అదీ లేకపోవడం అంటే  భర్త లేకపోవడమే. కళ్లలో నీరు అనడం నాన్న కోసం ఏడుస్తుందని భావం. ఎంతో ఆర్ద్రతతో కూడిన వ్యక్తీకరణ ఇది.
  • వెన్నెల తొడిగిన రెక్కలు లోని కొన్ని రెక్కలు*

ఎన్నికల శిశిరం ఓట్ల ఆకుల్ని రాల్చిపోయింది

                   వసంతం మళ్లీ
                   అయిదేళ్లకే        ( 1 )

నువ్వు నా మీద పూలు విసిరినపుడు నీ కోసం మాలలు అల్లాను

                      రాళ్లు విసిరితే
                      నీకు గుడి కడతా  ( 2 )

రెవిన్యూలో అవినీతి మూసేయండి ఇంటర్ బోర్డు అలసత్వం ఎత్తేసేయండి

                  చివరికి మిగిలేది 
                  అతనొక్కడే    ( 3 )

ప్రశ్నించే వారి ఉనికి తెలంగాణ లో ప్రశ్నార్థకమైంది

                    ప్రశ్న ఇక్కడ
                    ఓ బూతు పదం ( 4 )

స్వర్గానికి నిచ్చెన వేయాలని ఎంత ప్రయత్నించినా వృద్ధా ప్రయాసే

                  స్వర్గమెక్కడో లేదు
                  నీ మనసులోనే   ( 5 )

నీ ఉనికి ప్రశ్నార్ధకమైన చోట బతుకున్నా నువ్వు శవానివే

              ఊపిరి సైతం అక్కడ
              ఉరేసుకుంటుంది   ( 6 )


               ఫిబ్రవరి - 2016 లో వెన్నెల సత్యం గారు తెలుగు పూల తోట అనే వాట్సప్ సమూహం ను ఏర్పాటు చేసారు. ఈ సమూహం మూడు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో వీరు సహ సంపాదకత్వం వహిస్తూ "పుప్పొడి" అనే కవితా సంకలనం  తీసుకు వచ్చారు. ఒక వాట్సప్ సమూహ సభ్యులు ఒక సంకలనం గా పుస్తకం తేవడం నాకు తెలిసి ఇదే ప్రధమం అనుకుంటాను. అయితే 257 మంది పరిమిత సభ్యులతో ఉండే వాట్సప్ సమూహ కవితా సంకలనంలో కేవలం 51 మంది కవితలతోనే కాకుండా ఎక్కువ మంది కవితలకు అవకాశం ఇవ్వాల్సింది. 
  • వీరికి వచ్చిన అవార్డులు- బహుమతులు*
  • "నల్ల చందమామ" కవిత కు (2018) - మల్లెతీగ ఆత్మీయ పురస్కారం
  • "గర్భశోకం" కవితకు (2019) - అరసం ప్రోత్సహక బహుమానం
  • "ఎడ్లబండి" కవితకు ఎక్స్ రే ఉత్తమ కవితా పురస్కారం
  • "గ్రంథాలయం" కవిత కు రంజని కుందుర్తి పురస్కారం
  • సంచిక వెబ్ పత్రిక కవితల పోటీలో ద్వితీయ, తృతీయ బహుమతులు
  • కలానికి ఏమైంది కవితకు బాలగంగాధరయ్య పురస్కారం

ఇంకా కొన్ని పుర‌స్కారాలు అందుకున్నారు

                 నిత్య జీవిత సంఘటనలకు తన కవిత్వం ద్వారా తరచూ స్పందన తెలియచేస్తున్న కవి సత్యం. వీరికి మిత్ర సంపద కోకొల్లలు. అందరినీ కలుపుపోవాలనే తత్వమే అందుకు కారణం. తాను రాస్తూ ఇతరుల మంచి కవితలు స్పందన తెలియచేస్తూ సాగే గుణం సత్యం గారిది. ఏ ప్రక్రియ రాసినా సరే ఆ ప్రక్రియకు మరింత గౌరవం, అందం తేవడం మెరుపులు మెరిపించగల సవ్యసాచి వెన్నెల. ఇంత మంచి కవి కేవలం మినీ కవిత్వం లో కూరుకుపోవడం కొంత విచారకరం. ఎవరు ఏమనుకున్నా సరే ఒక కవిని నిలబెట్టేవి ఏ నానీలో ; ఏ మినీ లో కావు. కవిగా నిలబెట్టేవి పద్య , వచన కవిత్వమే. ఆ మాటకొస్తే ఈ ఆధునిక కాలంలో వచన కవిత్వం మాత్రమే. ఒక వేళ అన్ని ప్రక్రియల్లో  ఒకసారి రాసి వచన కవిత్వం అప్పుడప్పుడు రాస్తే బాగుంటుంది. ఇక్కడ ప్రక్రియల మోజులో పడి సత్యం గారు వచన కవిత్వాన్ని విస్మరిస్తున్నారనిపిస్తుంది.
                చివరగా అన్ని ప్రక్రియలలో అద్భుతమైన ముగింపులు తనదైన శైలి పంచ్  లతో మంచి కవిత్వం రాయడం వెన్నెల సత్యం కు వెన్నెతో పెట్టిన విద్య. ఇలాంటి కవి ఇదే ఒరవడితో బాల సాహిత్యంలో కూడా కృషి చేస్తే ఉపాధ్యాయుడైన సత్యం గారికి కవిగా సంపూర్ణత నిండుదనం వస్తుందని నా అభిప్రాయం. కవితా ప్రేమికుడిగా అది నా వినమ్ర ఆకాంక్ష.


                                      *ఐ.చిదానందం* "