తెలుగు వికీపీడియా అభివృద్ధికి ఎంతో ఉపయోగపడే అంశాల్లో అనువాద పరికరం ఒకటి. పేజీల నాణ్యతను చెడగొట్టే కారకాల్లో కూడా ఇది ఎత్తు పీట మీదే ఉంటది.
ఈ పరికరాన్ని అశ్రద్ధగానో, నిర్లక్ష్యం గానో వాడితే, అది ప్రచురించే వ్యాసాల్లో నాణ్యత చచ్చి ఊరుకుంటుంది. ఇందుకు అనేక ఉదాహరణలున్నాయి. ఈ పరికరపు ఇంజనుతోనే అనువదించిన 1700 పైచిలుకు చచ్చు పుచ్చు వ్యాసాలను మూకుమ్మడిగా తొలగించాల్సి వచ్చింది.
ఈ పరికరం ద్వారా వివిధ భాషల్లో అనువాదాలు ఎలా జరుగుతున్నాయో చూపే పేజీ ఇది. ఇంకా మరిన్ని గణాంకాలు ఉంటే బాగుంటుంది. దీన్ని కనీసం ఏటా నాలుగు సార్లు తాజాకరిస్తూ ఉంటే బాగుంటుంది.
అనువాద పరికరాన్ని సరిగ్గా వినియోగించుకుంటే పెద్ద యెత్తున వ్యాసాలను రాయవచ్చు. పెద్ద వ్యాసాలనూ రాయవచ్చు. అంగుష్ఠం పరిమాణంలో ఉండే మొలకలను మాత్రమే ప్రచురించి సమాజం మీద వదిలేసే అంగుష్ఠమాత్రులకు, తమపై ఉన్న ఆ ముద్రను వదిలించుకునేందుకూ తామూ పెద్ద వ్యాసాలను రాయగలమని నిరూపించుకునేందుకూ ఈ అనువాద పరికరం ఒక వరం లాంటిది.
అనువాదం అంటే మక్కికి మక్కి అనువదించడం కాదు, వీలైనంత సహజమైన తెలుగులో ఉండాలి. "అంబేద్కర్ చేత రాజ్యాంగం రచించబడింది" అనేది తప్పెలా అవుతుంది అని వాదించొద్దు మహాప్రభో! "అంబేద్కర్ రాజ్యాంగం రచించాడు" అనేది సహజమైన తెలుగు అని గ్రహించు.
అనువాద పరికరం మెరుగైంది, అవుతూ ఉంది. ఉండేకొద్దీ దాని ఉత్పాదకత పెరుగుతోంది. ఈ పరికరాన్ని నిక్షేపంగా వాడవచ్చు, వాడాలి. కానీ అది చేసే తప్పులను సరిదిద్దుకున్నాకే ప్రచురించాలి. ఆ తప్పుల్లో కొన్ని:
మూలంలో And ఉన్న ప్రతీచోటా "మరియు" అని రాస్తుంది. వాటిని సవరించుకోవాలి
కర్మణి వాక్యాలు రాస్తుంది. అలాంటి వాక్యాల్లో కనీసం 99% శాతం వాటిని కర్తరి వాక్యాలుగా మార్చాల్సి ఉంటుంది.
"యొక్క" రాస్తూంటుంది. "వికీపీడియా యొక్క వాడుకరులు" అంటుంది. "వికీపీడియా వాడుకరులు" అని గదా అనాల్సింది. అంచేత వాటిని (కనీసం 90% కేసుల్లో) సవరించాల్సి ఉంటుంది
అనువాదం చేసినపుడు అర్థాన్ని మార్చేస్తూ ఉంటుంది. సరిగ్గా వ్యతిరేక అర్థం వచ్చేలా అనువదిస్తూంటుంది. మరీ తరచుగా ఏమీ జరగదుకానీ జరుగుతుంది. చాలా జాగర్తగా ఉండాలి.
ఢిల్లీ, ఔ లాంటి కొన్నిటిని అనువదించాల్సిన చోట అది చిత్రమైన తప్పులు చేస్తుంది. వాటిని సవరించాల్సి ఉంటుంది.
ఎన్ని లోపాలున్నా దానితో అనేక ఉపయోగాలూ ఉన్నాయి
దాన్ని వాడి చాలా వేగంగా పనులు చెయ్యవచ్చు. పైన చూపిన తప్పులను సవరించుకుంటూ కూడా రెండు మూడు గంటల్లో 20, 30 వేల బైట్లను సునాయాసంగా అనువదించి (సైన్సు వ్యాసాలకు కొంత ఎక్కువ టైం పడుతుంది) సలక్షణమైన వ్యాసాన్ని ప్రచురించవచ్చు.