Jump to content

వాడుకరి:Gvpurnachand

వికీపీడియా నుండి

Dr. G.V.Purnachand

దేశీయ భోజన అవమానాలు

డా. జి వి పూర్ణచందు

“మధురాన్నములు మాని మహనీయులందఱు దోసెలుప్మాలకు దాసులైరి

శతవర్ష జీవులు శల్యగత ప్రాణు లకట కాఫీగత ప్రాణులైరి

ఎళనీరు ద్రావి హాయిగ సుఖి౦చెడు వార లైసు సోడాలకు నర్థులైరి

కర్పూర తాంబూల ఖాదనులగువారు ఖారఖిల్లీల సర్దారు లైరి

మంచి పెసరట్టు, సిగరెట్టు మనకు రెండె

పంపె స్వర్గంబు నుండి ఈశ్వరుడటంచు

బలికి కొఱమాలి నిను గోరి పిలిచినాము

గాని, లేకున్న నీవు రాగలవె కఱవ...?

క్షామదేవత! లేక రాగలవె నీవు...?

భావ కవిత్వపు తొలినాళ్ళలో కాకినాడ కేంద్రంగా సాహితీ సేవ చేసిన ప్రసిద్ధ సాహితీవేత్త ఉమ్రాలీషా కవిగారి రచన ఇది. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న తొలితరం యోధుల్లో ఆయన ఒకరు. టీకా తాత్పర్యాలు అవసరంలేకుండా అలతి అలతి పదాలతో ఆయన రచన సాగుతుంది. ఈ ఖండకృతిలో ఉమ్రాలీషాకవి చెప్పిన ఒక్కో విషయాన్నీ మనం పట్టించుకోవాలి.

కమ్మని రుచుల్ని వదిలేసి మహనీయులంతా దోసెలు ఉప్మాలకు దాసులయ్యారు. ఇడ్లీ అట్టూ పూరీ ఉప్మాలు మన భోజన వ్యవస్థని పూర్తిగా మార్చేశాయి. ప్రొద్దునపూట వాటిని తినటం సర్వమానవాళికీ వేదాలు నిర్దేశించిన విధి అన్నట్టు భావిస్తున్నారు. కమ్మని చద్ది తిని పనులకు పోయే కార్మిక, శ్రామిక, రైతాంగ సోదరులంతా రెండిడ్లీ సాంబార్లకు బలైపోతున్నారు. సంపాదించిన రోజుకూలీలో తన ఒక్కడి టిఫినూ కాఫీ/టీ కోసం కనీసం పాతిక రూపాయలు వెచ్చించ వలసి వస్తున్నా సరే, పూర్వం పద్ధతిలో కమ్మని పెరుగన్నం దండిగా తిని, మెండుగా పని చేసి, నిండుగా సంపాదించుకోవాలనే ఆలోచన తగ్గిపోయింది. మేథావి వర్గం కూడా ఇందుకు మినహాయింపు కాకపోవటమే విచిత్రం.

వందేళ్ళు సుఖంగా జీవించాల్సిన ప్రాణులు కాఫీ తాగకపోతే ప్రాణాలే పోయేలా తయారయ్యారు. షుమారుగా 1900-1910 ఆ ప్రాంతాలనుండీ కాఫీ మన జనసామాన్యాన్ని పూర్తిగా లోబరచుకుంది. 1960-70ల తర్వాత టీ కూడా దానికి తోడయ్యింది. ఆకల్నీ, జీర్ణశక్తినీ చంపే ఇలాంటి పానీయాలకు బానిసలం కావటం వలన కొన్ని వ్యాధులకు రాచద్వారాలు తెరిచినట్టయ్యింది. ఎలనీరు అంటే కొబ్బరి బోండాం నీళ్ళు తాగి హాయిగా సుఖించే వాళ్ళంతా ఐసుసోడాల కోసం వెంపర్లాడిపోతున్నారు. మన నీళ్ళలో రంగులు, రసాయనాలు కలిపి మన ఆయుఃపరిమాణాన్ని తగ్గించే కూల్ డ్రింకుల్ని ఇష్టారాజ్యంగా అమ్ముకోమని మన ప్రభుత్వాలు విదేశీ కంపెనీలకు అనుమతు లిస్తున్నాయి. కానీ, మన విఙ్ఞత ఏమయ్యిందీ…? మన దేశ ఆదాయాన్ని మనం విదేశీ కంపెనీలకు అప్పళంగా అర్పించటంలో మనవంతు పాత్ర మనం కూడా పోషిస్తున్నాం కదా! గాంధీగారి విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమాన్ని ఈ దేశప్రజలే విజయవంతం చేసిన సంగతి మనం మరిచిపోకూడదు. కర్పూర తాంబూలాలు వేసుకుని గౌరవప్రదంగా జీవించేవాళ్లు మన పూర్వీకులు. కానీ, ఈ నాటి మనుషులు ఖారఖిల్లీలతో నోరు పాడుచేసుకుని, బుగ్గ కేన్సరూ, గొంతు గడ్దలూ తెచ్చుకుని తాము నాగరికులం అని చెప్పుకుంటూ బతుకు వెళ్ళదీయటం మామూలు విషయం అయిపోయింది. రోడ్డుమీద ఎక్కడ తెల్లని గోడ కనిపిస్తే అక్కడ మేకలా ఆకులు నమిలి ఎర్రగా ఉమ్మి ఖరాబు చేసే ‘ఉమ్మూర్తు’లూ, నిస్సిగ్గుగా మూత్రవిసర్జన చేసే ‘నిలబడుద్ధాయి’లూ పెరిగారు.

మంచి పెసరట్టు, సిగరెట్టు ఈ రెండింటినే భగవంతుడు మనకు స్వర్గం నుంచి పంపాడని భావిస్తూ, లోకం ఎలా కొట్టుకుపోతున్నా పట్టించుకోకుండా అభినవ నీరోల్లా, అబినయ సామ్రాట్టుల్లా జీవించటానికి అలవాటు పడిపోతున్న వారిని ఈ కవితలో ఉమ్రాలీషా కవి తూర్పారపట్టారు. “బుద్ధి తక్కువై నిన్ను కావాలని పిలిచాం...కరువా! మాకే గనక అట్లూ, సిగరెట్లూ, కూల్డ్రింకులూ, ఖారాఖిల్లీలూ తీసుకునే అలవాట్లే లేకపోతే, మా గుమ్మం ఎక్క గలిగేదానివా క్షామ దేవతా...?” అనడుగుతారాయన!

1921 బెజవాడ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరిగాక ప్రజా చైతన్యం పెరిగి జాతీయ దృక్పథం ప్రతి ఒక్కరిలోనూ కలిగింది. ఇది గొప్ప పరిణామం. కానీ, ఇది తాత్కాలికమే అయ్యింది. తరువాత్తరువాత ఇడ్డెనలు, దోసెలూ, సాంబారులూ, కాఫీలు, బెంగాలీఆకులతో ఖారాఖిల్లీలూ, గుట్కాలు, పాన్ మషాలాలు ఒకటేవిటీ సమస్త దౌర్భాగ్యాలూ ఆధునికత, నాగరికత పేరుతో క్రమేణా మనల్ని ఆవహిస్తూ వచ్చాయి. తాజాగా పీజ్జాలూ బర్గర్లది ఆధిపత్యం అయ్యింది.

ఫ్రెంచివాళ్ళు, బ్రిటిష్జర్లూ ఒకప్పుడు మనల్ని చెరోవైపూ ఎలా దోచుకున్నారో అలా ఈ రెండూ మనల్ని దోచుకుంటున్నాయి. ఇదంతా విదేశీ వ్యామోహం, ఆధునికత, నాగరికత పేర్లతోనే జరుగుతోంది. విదేశీయం ముద్ర వేస్తే చాలు ఎగేసుకుపోయే తత్త్వం ఒకటి గాంధీగారు పోయాక మన దేశంలో మితిమీరిపోయింది. మానసిక వైద్యులు ఇంకా ఈ వింత మనోదౌర్బల్యానికి ఒక పేరు పెట్టలేదనుకుంటాను.

ఉమ్రాలీషా కవిగారి కవితని విశ్లేషిస్తే ఇన్ని అర్థాలు కనిపిస్తాయి. కానీ, ఆయన స్వరంలో ఇంతకన్నా కాఠిన్యం కనిపిస్తోంది.

ఇలాంటి అలవాట్లతో మన ఆహార సంస్కృతిని మరిచిపోయి నిర్లక్ష్యంగా వ్యవహరించటం వలన, కేవలం మన నిర్లక్ష్యం వలనే మనకు కరువుకాటకాలు వస్తున్నాయనీ, మనం దేశీయమైన పద్ధతిలో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించ వలసి ఉంటుందనీ ఉమ్రాలీషా కవిగారి హెచ్చరికతో కూడిన సూచనని పట్టించుకోవాల్సి ఉంది.

దేశం గురించి ఆలోచించటం అంటే సామూహికంగా మనం మనకోసం ఆలోచించటమే అన్నసంగతిని ఇంకా సమర్థవంతంగా ఈ తరానికి తెలియ జేయాల్సి ఉంది.