Jump to content

వాడుకరి:M.VENKATA KRISHNAREDDY

వికీపీడియా నుండి


      వాసుదేవశతకం
     -------------
     


     కవి పరిచయం

పేరు  : మల్లు వెంకట కృష్ణారెడ్డి

విద్యార్హతలు  : యం.యస్సీ; బి.యిడి.

తెలుగుభాషను పదవతరగతి వరకు మాత్ర మే చదువుకున్ననూ తెలుగుభాష మీద ఉన్న అభిమానంతో దేవదేవశతకం,వాసుదేవ శత కాల రచన చేయడం జరిగింది.

స్వస్థలం  : నెల్లూరు

వృత్తి  : ఉపాధ్యాయులు

      యం. పి. పి.స్కూల్
            భగత్సింగ్ కాలనీ
         వెంకటేశ్వరపురం 
             నెల్లూరు. 
      -----------
  పద్యములను రాగయుక్తంగా పఠనం చేయవలయను.



     ప్రారంభ పద్యం

బుద్ధితోడ సిద్ధి పోరక సాధించి ఆదిపూజలందు అంబతనయ తోడు నీవె నాకు తోడ్పాటునందించు వాస్తవమును దెలుపు పటిమనిమ్ము!


1.

రాముడైన గాని రహ్హీమయిన గాని క్రిష్ణుడైనగాని క్రీస్తుగాని హితముజెప్పె గాని హింసను చెప్పిరా వాస్తవమును దెలుపు వాసుదేవ!


2.

మనుజుడొకడు వచ్చి మంచిపనిని చేయ చిన్నతప్పు జూపి చిన్నబుచ్చు చేయకున్నగాని చేయూత నివ్వరు వాస్తవమును దెలుపు వాసుదేవ!


3.

లోతు గొయ్యిదీసి పాతిపెట్టిన గాని వన్నె తగ్గిపోదు వజ్రమునకు మహుల గుణములిటుల మారవే స్థితినైన వాస్తవమును దెలుపు వాసుదేవ!


4.

వృత్తి పట్ల తగిన దృష్టియే లేకున్న వృత్తియందు కలుగు వృద్ధి సున్న మతికి పడని వృత్తి మానివేయుట మేలు వాస్తవమును దెలుపు వాసుదేవ!


5.

గొప్పవార లెవరు చెప్పనీ జగతిలో గొప్పపనులు పెక్కుగుండు గాని గొప్పపనుల చేత గొప్పతనము గల్గు వాస్తవమును దెలుపు వాసుదేవ!


6.

ఆస్తియందము గని అమెరికా చదువని పిల్లనిచ్చువాడు పిచ్చివాడు బుద్ధిలోపమున్న బుగ్గియౌ జీవితం వాస్తవమును దెలుపు వాసుదేవ!


7.

మనిషి బుద్ధులన్ని మారవు మొదలుకు అంతరంగమందు అణగియుండు తగిన సమయమందు తప్పక చెలరేగు వాస్తవమును దెలుపు వాసుదేవ!


8.

విడువరు తుదివరకు వీరులు గెలువక ఓడి కుంగిపోరు ఊరుకోరు కార్యసాధకులకు కడగండ్లు మెట్లురా వాస్తవమును దెలుపు వాసుదేవ!


9. చేయ మనసురాదు చెప్పినను వినరు చేయిగలిపి వెంట చేరరారు చిత్తమందు మార్పు శిక్షతో వచ్చునా వాస్తవమును దెలుపు వాసుదేవ!


10. భాగ్యవంతుడియెడ భక్తులై జనులెల్ల అడగకుండ ధనము నరువులిచ్చు అరిచి పేదవాడు అడిగితే యిచ్చునా వాస్తవమును దెలుపు వాసుదేవ!


11.

కరులు మోయలేని కనకంబు నిచ్చినా కరుణ చూపబోడు కాలుడెపుడు ధర్మజీవనంబు దైవప్రీతికరము వాస్తవమును దెలుపు వాసుదేవ!


12.

దైవమెక్కడనుచు తాము వాదనచేసి చేయదలచుకొన్న సేవయేమి దైవభీతి వలన ధర్మంబు నిలవదా వాస్తవమును దెలుపు వాసుదేవ!


13.

ప్రాయమందు గలుగు పరలింగ మోహము ప్రేమయనుచు వెర్రి పెంచుకోకు పేగుపంచువారి ప్రేమే నిజమ్మురా వాస్తవమును దెలుపు వాసుదేవ!


14. (పొడుపు పద్యం)

గృహమునందుయుండు గిరులు కానలనుండు నింగినుండు గనగ నీటనుండు ధనికపేద యనుచు తను వేరుపరచదు భావమేమొ దెలుపు వాసుదేవ!


15.

నచ్చి యాచరించు నమ్మకం తప్పని కోవిదుండు పలికి గొడవ పడిన పరువుబోవు ప్రజల పద్ధతుల్ పోవునా వాస్తవమును దెలుపు వాసుదేవ!


16.

జలము వాడవలయ జాగరూకత గల్గి జగతి పరిఢవిల్లు జలములున్న జలముల నిల నిలుపు మెలకువలెరుగరా వాస్తవమును దెలుపు వాసుదేవ!


17.

పేదకెంత కూడు పెట్టినా జాలితో పేద రాజు కాడు పేద పేదె ఊరకీయ మాని ఊతమీయుము బూని వాస్తవమును దెలుపు వాసుదేవ!


18.

నెమలిజూచి జగతి నిలచి పరవశించు కాకివంక జూచి కర్ర విసురు వేషభాష లటుల విలువ దెచ్చునిలలో వాస్తవమును దెలుపు వాసుదేవ!


19.

ఆవగింజ మెదడు అమితమైన తెలివి చీమకేల గలిగె సింహబలిమి కనగ చీమకన్న గజమేలయగు మిన్న వాస్తవమును దెలుపు వాసుదేవ!


20.

పొసగని పరదేశ పోకడల్ పాటించి నవ్యరీతులంచు నడచుకొన్న నిండువనమునందు నిప్పేసినట్లగున్ వాస్తవమును దెలుపు వాసుదేవ!


21.

శుభ్రతగల వీధి శునకము నైనను ముచ్చటపడి జనులు ముద్దులాడు శుచియొసగును సుఖము శుభము గౌరవమును వాస్తవమును దెలుపు వాసుదేవ!


22.

గాలి తోడ ఇనుము కలిసి తుప్పైపట్టు చెమ్మదగిలి కొయ్య చెదలు బట్టు శ్రేష్ఠులైనవారు చెడుదురే ఈ రీతి వాస్తవమును దెలుపు వాసుదేవ!


23.

ఫలితమిచ్చు చోట పనులు చేయుట మాని వేరుతావు చేయు వెర్రియేల చెరువుగాక బయట చేపలు దొరుకునా వాస్తవమును దెలుపు వాసుదేవ!


24.

వెర్రి మనసునందు వేల తలపులుండు చెడ్డతలపు రేగి చెరచజూడు మంచితలపునెంచు మదిని చెడ్డనణచు వాస్తవమును దెలుపు వాసుదేవ!


25.

కూరలందు యుప్పు కూర్చినా రుచులను హెచ్చుగున్న నదియె తెచ్చు ముప్పు పులుపు తీపి యుప్పు పురిగొల్పు రోగముల్ వాస్తవమును దెలుపు వాసుదేవ!


26.

హితముకోరి హితులు హితవాక్యములు పల్క రోషపడును అల్పు డీసడించి చేటుకాలమందు చెవికెక్కునా సూక్తి వాస్తవమును దెలుపు వాసుదేవ!


27.

భార్యలేని ఇంట భర్త కర్థములేదు భర్తతోడు పెంచు భార్యవిలువ ఆలుమగల మైత్రి మేలురా గృహముకు వాస్తవమును దెలుపు వాసుదేవ!


28.

చెప్పగానె పనులు చేసేటి తనయులు విన్నవించగానె వినెడి పతిని కలిగియున్న సతికి కాపురం స్వర్గము వాస్తవమును దెలుపు వాసుదేవ!


29.

ఎంత చదువుకున్న నెవడు నేర్పరిగాడు అనుభవమున గలుగు నసలు నేర్పు అనుభవమును మించు ఆచార్యుడెవ్వడు వాస్తవమును దెలుపు వాసుదేవ!


30.

సాగునీరు లేక సాగు జేయను రాక మన్ను మిన్ను దన్ను మానుకొనగ రైతు వెతలు దీరి రాతలెన్నడు మారు వాస్తవమును దెలుపు వాసుదేవ!


31.

ఆరుపూట్ల తిండి నాశగా రుచియని మూడుపూట్లలోనె ఊడ్చి తినకు మూడుపూట్లది తిను ఏడుసార్లుగ మేలు వాస్తవమును దెలుపు వాసుదేవ!


32.

ప్రజలు మూర్ఖులైన ప్రభువు దేవుడనను ప్రజలు విజ్ఞులైన బంటుననును ప్రజలు యోగ్యులైన పాలన యోగ్యమౌ వాస్తవమును దెలుపు వాసుదేవ!


33.

సజ్జనులకు పదవి సంస్కారమును పెంచు బరువు బాధ్యతలను పరువుబెంచు అథములకు అహమును ఐశ్వర్యమునుపెంచు వాస్తవమును దెలుపు వాసుదేవ!


34.

సకల జీవులందు సర్వేశ్వరుడు యుండ ఒక్క రూపమునకు మొక్కులేల ధరణి జీవులందు దైవంబు గాంచరా వాస్తవమును దెలుపు వాసుదేవ!


35.

దేశభక్తి విడిచి దేశ భద్రత మర్చి దేశ నియమములను ధిక్కరించు దుష్టశక్తుల పొడ దోషంబు విడువరా వాస్తవమును దెలుపు వాసుదేవ!


36. లేతవయసునందు లెక్కజేయక యుండి మధ్యలోన మారు మనసు పొంది చావువేళ గీత చదివేమి ఫలమయా వాస్తవమును దెలుపు వాసుదేవ!


37. ఆయువున్న నాళ్ళు అన్నమే పెట్టక గోతికాడికేల కోడికూర తల్లిదండ్రి ఋణము చెల్లింప తరమౌన వాస్తవమును దెలుపు వాసుదేవ!


38. విజయమెపుడు నిన్ను వెదికి వెంటబడదు వెంటతరిమి నీవు వెళ్ళకున్న ఓర్పు విడువబోకు ఓటమికి బెదరకు వాస్తవమును దెలుపు వాసుదేవ!


39.

పరిసరాలు మరచి పంతుళ్ళు లీనమై పాఠమెంతజెప్పి ఫలములేదు శ్రద్ధ శిశువు కున్న సిద్ధించు ఫలితంబు వాస్తవమును దెలుపు వాసుదేవ!


40.

నేత చెప్పునట్టి రోత మాటలు నమ్ము సోదెగాళ్ళు చెప్పు సొల్లు నమ్ము సద్గురుండు చెప్పు సంభూతి నమ్మరు వాస్తవమును దెలుపు వాసుదేవ!


41.

పద్ధతైనవాడు పనిమీద శ్రద్ధతో పటిమజూపి మెచ్చు పనులుజేయ పట్టలేనివారు బయట పల్చనజేయు వాస్తవమును దెలుపు వాసుదేవ!


42.

వర్ణ చిత్రములను వందలాదిగ చూపి గొప్పలెన్ని మనము చెప్పుకున్న నమ్మబోదు జగము నడత లోపములున్న వాస్తవమును దెలుపు వాసుదేవ!


43.

కోట్లు ఖర్చుపెట్టు కూడి విందులు చేయు అంబరాలనంటు సంబరాలు కష్టమున్నదన్న కన్నెత్తి చూడరు వాస్తవమును దెలుపు వాసుదేవ!


44.

నేత నోటజారి నీతిమాటలు పారు చిత్తమందు నీతి చిన్నబోవు చిత్తమందు లేక చేతలన్ చూపునా వాస్తవమును దెలుపు వాసుదేవ!


45.

రాజకీయ నేత రథయాత్ర చేసినా ఊరువాడలందు ఊడిపడిన నోటు,మాట విసిరి ఓటు గుంజనె సుమా వాస్తవమును దెలుపు వాసుదేవ!


46.

ఉన్నవాటియందు ఉత్తమమైనవి ఎంచుకొనగ జూడు ఎన్నడైన పుచ్చుపండ్ల కన్న పచ్చివి నయమురా వాస్తవమును దెలుపు వాసుదేవ!


47.

ఎవరు చెప్పిన విని ఏది చూపిన గని ఇదియె నిజమని మదినెంచబోకు కల్లకపటములను కనిపెట్టి నడవరా వాస్తవమును దెలుపు వాసుదేవ!


48.

మంచి నాచరించ మతముతో పనియేల తప్పు దిద్దుకున్న తప్పుయేల మానవత నెరుగని మతమేమి మతమురా వాస్తవమును దెలుపు వాసుదేవ!


49.

ఆశ పడెడివాని కన్నిటా బాధలు ఆశలేని వాని కాత్మశాంతి శ్రమను నమ్మి కదులు భ్రమను కాంక్షను వీడు వాస్తవమును దెలుపు వాసుదేవ!


50.

మనషులందు ఎన్ని మంచి గుణములున్న మాటతప్పుగుణము మాటదెచ్చు మాట తప్పువాని మరి జనం నమ్మునా వాస్తవమును దెలుపు వాసుదేవ!


51.

మంచిపనుల మెచ్చి మంచివారల నచ్చి మృదువు మాటతోడ మెలగు గుణము సహృదయులకు గాక సాధ్యమా ఒరులకు వాస్తవమును దెలుపు వాసుదేవ!


52.

వన్యజీవులైన వానరములలోన మంచిమార్పు గలిగి మనిషి బుట్టె మనుషులు చెడమారి మరియేమి బుట్టునో వాస్తవమును దెలుపు వాసుదేవ!


53.

పనికిరాని యట్టి పాత వస్తువులిచ్చి అక్కరున్న వారలాదు కొనుము అవయవముల దానమందించు ప్రాణము వాస్తవమును దెలుపు వాసుదేవ!


54.

పదవియాశ చేత పనిచేయునొక్కడు గొప్పకొరకు యొకడు మెప్పుకొకడు విధిగ చేయువారు పృథివిలో గురువులే వాస్తవమును దెలుపు వాసుదేవ!


55.

గురువు భయము లేక కూరదు వినయము వినయశీలి గాక విద్యరాదు విద్య రాకయున్న విజ్ఞత గలుగునా వాస్తవమును దెలుపు వాసుదేవ!


56.

నోరులేనిజీవి నొక్కవేటున జంపి పంచుకోని తిన్న పండగౌన పశులపూజ చేయు పండగే పండుగ వాస్తవమును దెలుపు వాసుదేవ!


57.

గురుడు చెప్పెగదని గుడ్డిగా నమ్మేసి పుస్తకాలు చదివి పూజ చేయ కలిమి కలిసిరాదు కష్టంబు తీరదు వాస్తవమును దెలుపు వాసుదేవ!


58.

చిన్నతనము నందు చేసిన తప్పులు చిత్తమందు తలచి చింతపడక తెలుసుకున్న నీతి తెలుపరా యువతకు వాస్తవమును దెలుపు వాసుదేవ!


59.

అరువుదెచ్చి చాల ఆడంబరము చేసి ఘనతచాటువాడు ఘనుడుగాడు కాణియప్పులేని కడుపేద నయమురా వాస్తవమును దెలుపు వాసుదేవ!


60.

ప్రాంతమేదియైన భాషలు వేరైన కులమతాల నడుమ గొడవలున్న జాతికొరకు కలసి జగడమ్ము చేయరా వాస్తవమును దెలుపు వాసుదేవ!


61.

రాజులింట బుట్టి రాజ్యాల నేలినా పేద కడుపునబడి బాధపడిన విగతులైనవేళ విలువయొక్కటె గదా వాస్తవమును దెలుపు వాసుదేవ!


62.

ఇష్టమైనవాడు ఎనుముల దొంగైన వెన్ను తట్టి వాని వెనుక నిలుచు మచ్చలేనివాడు నచ్చక దొంగౌను వాస్తవమును దెలుపు వాసుదేవ!


63.

పాపభారములను వదిలించుకొనుటకై పరమశివునిగొల్వ భక్తిగాదు దైవభీతితోడ ధర్మపథమునెంచు వాస్తవమును దెలుపు వాసుదేవ!


64.

తనయులు చెడి దెచ్చు తండ్రికి యపకీర్తి శిష్యుల నడవడిక చెడి గురువుకు దైవమునకు గల్గు దైవ సేవకులచే వాస్తవమును దెలుపు వాసుదేవ!


65.

జాతిగీతమన్న జనులకు పడకున్న దేశభద్రతన్న దేల నిలుపు దేశభక్తిలేని దేహమెందులకురా వాస్తవమును దెలుపు వాసుదేవ!


66.

కౌసుమంబువంటి కమ్మని పదములు సోయగమ్ములొలుకు సుందరలిపి తెలుగువంటి భాష దేశాన లేదురా వాస్తవమును దెలుపు వాసుదేవ!


67.

చట్టసభలయందు జట్టుగా పెద్దలు చెప్పినట్టి మాట చెల్లకున్న జగతి గేలిజేయు జాతిపరువు పోవు వాస్తవమును దెలుపు వాసుదేవ!


68.

నిగ్రహమును జూపు నిజమైన బలశాలి ఆగ్రహమును జూపు యల్పజనుడు నిగ్రహించుగుణము అగ్రగణ్యతదెచ్చు వాస్తవమును దెలుపు వాసుదేవ!


69.

అణువునెన్నొ వైరియంశమ్ము లిముడును గర్భమందున బహు కవలలిముడు కొంపలో నిరువురు కోడళ్ళు యిమడరు వాస్తవమును దెలుపు వాసుదేవ!

    .   పొడుపు పద్యం

తనువు పంచు ఓపి తరువుల కనిపెంచు అన్నమిచ్చు ఆశ్రయమ్మునిచ్చు జీవుల మనుగడకు చేదోడు నందించు భావమేమొ దెలుపు వాసుదేవ!


70.

నీతిలేని జనుని నేతగా జేసిన జాతి పరువుదీయు నీతిదప్పి జాడ్యము తనదైన జాతికంత పులుము వాస్తవమును దెలుపు వాసుదేవ!


71.

జనము మాటలాడు జగము మారాలంటు జగతిన యవినీతి జాస్తియనుచు జనము గొర్రెలైన జగమేల మారురా వాస్తవమును దెలుపు వాసుదేవ!


72.

మంచిమనసు కొరకు మదిని మ్రొక్కుకొనుచు ఊరకున్న మనసు మారబోదు మంచిపనులమీద మరలించు మనసును వాస్తవమును దెలుపు వాసుదేవ!


73.

ఆదినరుడు బ్రతికె నానాడు మృగముగా నవ్య నరుల యందు నాణ్యమేమి మాటనేర్చెగాని మార్పేమి కలిగెరా వాస్తవమును దెలుపు వాసుదేవ!


74.

అద్దమందు మేని యందమ్ము గనుటకై విడువకుండ జనులు వెదుకుగాని ఆత్మసొగసు జూడ నారాట పడుదురా వాస్తవమును దెలుపు వాసుదేవ!


75.

ఉచ్చపదవియందు ఉన్నట్టి నేతకు పదవి గౌరవమ్ము పట్టకున్న స్థానభ్రష్టుడగును చరిత హీనమగును వాస్తవమును దెలుపు వాసుదేవ!


76.

పట్టపగలు తాగి పదిమందిలోకొచ్చి గొప్పవాడినంటు గొడవ చేయు తాగుబోతుబాధ తట్టుకోలేమయా వాస్తవమును దెలుపు వాసుదేవ!


77.

ఒకటి రెండు తప్పులోర్చి విడువవచ్చు తప్పులన్ని దాయదగదు ఓపి ఖలునిపట్ల కరుణ తెలివైన పనియౌన వాస్తవమును దెలుపు వాసుదేవ!


78.

రుబాటలోన పొరబాటు చేసిన ప్రక్కదారి పట్టి బాధపెంచు పోరు మంచికైన ఊరంత కదలదా వాస్తవమును దెలుపు వాసుదేవ!


79

ప్రజలు బిచ్చమేయు పదవి శాశ్వతమని ఒళ్ళు మరిచి నేత తుళ్ళిపడును చెల్లుబడి సడలిన అల్లాడు గొల్లున వాస్తవమను దెలుపు వాసుదేవ!

80.

పరుల యున్నతిగని పడిపడి కుములుచు ఈర్ష్యపడును యల్పుడీసడించు చిన్నబుద్ధి పైకి చెప్పక చెప్పును వాస్తవమును దెలుపు వాసుదేవ!


81.

ఇష్టదైవములను నిష్ఠతో పూజించి ఖలుడు వెతలుదీర్చి గావమన్న మానవుండురీతి మాధవుండు వినునా వాస్తవమును దెలుపు వాసుదేవ!


82.

నరులు జీవితమున నడచుదారులు రెండు చెరచునొకటి మేలు చేయునొకటి నడవ సులువు యనుచు చెడుదారి నెంచకు వాస్తవమును దెలుపు వాసుదేవ!


83.

అందగించదన్ను యణకువ లేకున్న అణగుయున్న యన్ను అందగత్తె అంగు యణగుయున్న అంగన సురకాంత వాస్తవమును దెలుపు వాసుదేవ!


84.

చుట్టియున్న గాలి చూడలేని జనుడు ఆత్మయందునున్న హరిని గనునె దైవలక్షణమును దానవుండెరుగునా వాస్తవమును దెలుపు వాసుదేవ!


85.

హక్కులడుగు పదవియధికారముల గోరు విద్య,వైద్యమడుగు చోద్యముగను బాధ్యతలను తాము పట్టించుకోరయా వాస్తవమును దెలుపు వాసుదేవ!


86.

కనులు రెండుయుండి జనులు గాంచుచుయున్న వీక్షణమున మిగుల భేదముండు జనుల మనసుబట్టి కనుదోయి గనునయా వాస్తవమును దెలుపు వాసుదేవ!


87.

మానవతను బెంచ మతములు గల్పించె మతములన్ని చెప్పు మర్మమొకటె మతము జెరచువాడు మతబోధకుడు గదా వాస్తవమును దెలుపు వాసుదేవ!


88.

వీడిది మనకులము వాడిది వేరని కులమతాలు చూడు కుత్సితుండు ఉత్తముండు చూడు ఉన్నతాశయమును వాస్తవమును తెలుపు వాసుదేవ!


89.

నీతినియమమువిడి రోతదారులు తొక్కి కరుణ జూపమనుచు హరికి మ్రొక్కి వేడుకున్న ఖలుని విడుచునా దైవంబు వాస్తవమును దెలుపు వాసుదేవ!


90.

ఓటు ఆయుధమును ఒడుపుగా వాడిన దురితపాలన చెర తొలగిపోవు గట్టిమేలు చేయ కదిలి ఓటేయరా వాస్తవమును దెలుపు వాసుదేవ!


91.

పంతములకుబోవు పరిధులు జవదాటు పరుషపదముల సిగపట్లుబట్టు నేతలేల నిలుపు జాతి గౌరవమును వాస్తవమును దెలుపు వాసుదేవ!


92.

లొసుగులున్నవారు లోపంబు లెరుగక లొసుగులెతుకుచుండు లోకులందు లొసుగు లేనివాడు లోకమందుండునా వాస్తవమును దెలుపు వాసుదేవ!


93.

చుట్టుపక్కలెవరు చూడకున్న యెడల తులువజేయు మిగుల తులిపిపనులు నరుల మధ్య తిరుగు నసురులు,యెరుగరో వాస్తవమును దెలుపు వాసుదేవ!


94.

సంపదెంత యున్న సానుభూతియె లేక పరులబాధ గనుచు పలుకకున్న జనుడు దనుజుడగును మనుజుడేల యగును వాస్తవమును దెలుపు వాసుదేవ!


95.

కులము వలదు యనుచు కులసంఘముల పెట్టు మతము వలదు యనుచు మాన్యమిచ్చు కులమతాలు పెంచు కూర్మిచే సర్కారు వాస్తవమును దెలుపు వాసుదేవ!


96.

ఎండ వానలనక తిండి తిప్పలు మాని తండ్రి కూలిజేయ తనయులాడు తండ్రిమాట తాము తలదాల్చ నొప్పరు వాస్తవమును దెలుపు వాసుదేవ!


97.

ఉర్వియందు లేనిదొక్కటైనను లేదు అవసరమును బట్టి యన్నిబుట్టు సృజనచే సకలము చేయ సాధ్యమెయగు వాస్తవమును దెలుపు వాసుదేవ!


98.

యోగ ధ్యానములను ఓర్పుగా శ్రద్ధతో అనుదినమ్ము జేయ అద్భుతముగ బాధలన్ని తొలగు పరమశాంతి కలుగు వాస్తవమును దెలుపు వాసుదేవ!


99.

మంచిపనుల చేత మనసు పొందును శాంతి చెడ్డపనుల చేయ చింతగలుగు చిత్తశాంతిలేని జీవితం నరకము వాస్తవమును దెలుపు వాసుదేవ!


100.

గడ్డిమేయు జీవి గొడ్డండ్రు,యడవిలో గొడ్ల తినెడి జీవి క్రూరమృగము మనిషి గొడ్ల తిన్న మరి భేదముండునా వాస్తవమును దెలుపు వాసుదేవ!


101.

కోపమందు పనులు గుంజినా చేయకు మోహమందు తగదు మొండి తెగువ కోపమోహము లిల పాపకారకములు వాస్తవమును దెలుపు వాసుదేవ!

        🙏🙏🙏🙏🙏
     వెంకట కృష్ణారెడ్డి మల్లు         
________________________

_____________________________


      దేవదేవశతకం
    ______________

కవి పరిచయం


పేరు  : మల్లు వెంకట కృష్ణారెడ్డి

విద్యార్హతలు  : యం.యస్సీ; బి.యిడి.


తెలుగుభాషను పదవ తరగతి వరకు మాత్ర మే చదువుకున్ననూ తెలుగుభాష మీద ఉన్న అభిమానంతో దేవదేవశతకం,వాసుదేవశతకా ల రచన చేయడం జరిగింది.


స్వస్థలం  : నెల్లూరు

వృత్తి  : ఉపాధ్యాయులు

            యం. పి. పి. స్కూల్              భగత్సింగ్ కాలనీ              వెంకటేశ్వరపురం               నెల్లూరు.
  __________©©©©©_________


   ఈ దేవదేవ శతకము ను
     నా తల్లిదండ్రులు

స్వర్గీయ శ్రీ మల్లు వెంకటరెడ్డి, రమణమ్మ గార్ల

   దివ్యస్మృతికి అంకితమీయడమైనది.                             
         🙏🙏🙏
        _____________®®®_____________


పద్యములను రాగయుక్తంగా పఠనం చేయవలయను


     ప్రారంభ పద్యం  


తెలుగు తల్లి చరణ తేజమ్ము పెంచగ వేయదలచి నేను విరులు రెండు నీతి చెప్పనెంచ నేర్పును యొసగుచు దోవ జూపుమయ్య దేవదేవ!


1.

రొమ్ము పాలు బట్టి రోజంత ముద్దుగా గోరుముద్ద తోడ గోముజేసి తల్లి అడ్డమగును తనయులకు కడకు తెలుపుమయ్య నిజము దేవదేవ!

2.

వెంట రాదు ధనము యెంత పోగేసినా వెంట వచ్చు కడన వెదురుకొయ్య వెంటరాని దాని వెనకేల బడెదరో తెలుపమయ్య నిజము దేవదేవ!

3.

అక్కరున్న వేళ యణకువెక్కువ చూపు తీరగానె బాధ తీరు మారు మనిషి గుణములిట్లు మారురా ధరణిలో తెలుపుమయ్య నిజము దేవదేవ!

4.

కష్టపడుట కెవడు కదిలి ముందుకు రాడు కష్టజీవి కన్న ఘనుడు యెవడు కష్టపడిన అష్ట కష్టాలు తీరవా తెలుపుమయ్య నిజము దేవదేవ!

5.

మంచి పేరు రాను మాసకాలము పట్టు చెడ్డపేరు వచ్చు చిటికెలోన మంచితనము చేయు మనిషి నమరునిగా తెలుపుమయ్య నిజము దేవదేవ!

6.

అన్యభాష పట్ల యభిమాన మున్నను మాతృభాష మమత మరువ దగదు అమ్మ దీనజేసి యన్యుల పూజేల తెలుపుమయ్య నిజము దేవదేవ!

7.

బ్రతుకు నేర్పలేని బడియును నడవడి రాని గురువు తావి లేని పూవు ఉన్న లాభమేమి యుర్వికి భారము తెలుపుమయ్య నిజము దేవదేవ!

8.

బాల్యమందు చదువు బాగుగా యబ్బిన భావి చదువులందు వాశిగల్గు గుంజ గట్టిగున్న గుడిసె గట్టిదవదా తెలుపుమయ్య నిజము దేవదేవ!

9.

కాలమనునది ఝరి కాలుని నెచ్చెలి క్షమను చూపదోయి క్షణము యైన వ్యర్థపరచ నేల వాడలన్ దొరకునా తెలుపుమయ్య నిజము దేవదేవ!

10.

నమ్ము మాటలాడి వమ్ము జేయుట గాదు అన్న మాట నిలుపు అక్కరందు నమ్మకమును నిలుపు నరుడె నాగరికుడు తెలుపుమయ్య నిజము దేవదేవ!

11.

మదగజమును బట్టి మాను గట్టగవచ్చు సింగమెక్కి సాము జేయవచ్చు కులము రూపుమాప కలనైన కుదురునా తెలుపుమయ్య నిజము దేవదేవ!

12.

తప్పు చిన్నదనుచు తనయుల వెనకేసి తప్పు దాచి తల్లి ముప్పుదెచ్చు తప్పు చేసినపుడు చప్పున అణచరు తెలుపుమయ్య నిజము దేవదేవ!

13.

కనగ జీవితమున కౌమార మందున మనసు తీరు మారు మనిషి మారు మనసు గమనమెరిగి మసలు బదిలముగా తెలుపుమయ్య నిజము దేవదేవ!

14.

ఫలము లిచ్చు పీల్చ ప్రాణవాయువు నిచ్చు వర్షమిచ్చు భువికి హర్షమిచ్చు చెట్ల నరక బూన చిత్తమేల ఒప్పురా తెలుపుమయ్య నిజము దేవదేవ!

15.

హింస తగదు భువిని ఇంపుగ బ్రతుకగ శాంతి సరణి నడువు భ్రాంతి వీడి శాంతితోడ జగము స్వర్గమై వర్ధిల్లు తెలుపమయ్య నిజము దేవదేవ!

16.

చదువు కష్టమనుచు జంకి విడువబోకు తెలిసి చదువుకొనుము తెలివితోడ చదువు ఇష్టముంచి సాధించు యున్నతి తెలుపుమయ్య నిజము దేవదేవ!

17.

నీకు తెలిసినదియె నిజమని తలచకు ఎరగకున్నదంత వెర్రి యనకు తెలిసి వాగు వాడె తెలివైనవాడురా తెలుపుమయ్య నిజము దేవదేవ!

18.

మహుల మాట ధరన మంత్రమై నిలుచును ఖలుని పలుకు జిమ్ము కల్మషమును మనసునున్న తలపు మాటలన్ దొరలును తెలుపుమయ్య నిజము దేవదేవ!

19.

కొడుకుకై వరపడి కోరి కనడమేల కడన కొడుకు కనక కష్టమేల కొడుకు కూతురన్న కుటిల భేదములేల తెలుపుమయ్య నిజము దేవదేవ!

20.

ఆవుపాల రుచులు అమృతపు మధురిమ తేట తేనెయూట తెలుగు మాట తెలుగు పలుచనైన దేశంబు చులకన తెలుపుమయ్య నిజము దేవదేవ!

21.

దానమీయు వాడు దైవంబు ధరణిలో దానమిచ్చు గుణము దైవగుణము త్యాగదనుల కన్న దైవమ్ము లెవరయా తెలుపుమయ్య నిజము దేవదేవ!

22.

అగ్రకులజులు మము యణగ ద్రొక్కిరనుచు గళములెత్తు భ్రాతృ దళిత జనులు ఎన్నికందు కోరి యెంచుకొనడమేల తెలుపుమయ్య నిజము దేవదేవ!

23.

దైవపూజ చేయ దైవకరుణ దక్కు గురుల పూజ దెచ్చు గౌరవమ్ము వ్యక్తి పూజయనెడి వ్యసనంబు తగదయా తెలుపుమయ్య నిజము దేవదేవ!

24.

దారిలో నగపడు వారెల్ల గురువులు మంచి వానిని గని మానవతను నీచ జనుని జూచి నేర్వు ఇంగితమును తెలుపుమయ్య నిజము దేవదేవ!

25.

ఉన్న సమయమంత ఊరక గడిపేసి కడన చిత్తగించు కలత జెందు ముందుచూపు యున్న మోదంబు గలుగదా తెలుపుమయ్య నిజము దేవదేవ!

26.

సుందరాంగి చుట్టు సూదంటు రాళ్ళల్లె ప్రేమ పేరుజెప్పి ప్రియులు దిరుగు అందహీన చుట్టు అయ్యలు తిరుగునా తెలుపుమయ్య నిజము దేవదేవ!

27.

తరువువంటి గుణము ధరవంటి మనసును చీమవంటి కష్టజీవుల గని బ్రతుకు శాంతితోడ పరహితమ్ము దలచి తెలుపుమయ్య నిజము దేవదేవ!

28.

అభ్యసించు దశన యతివ ప్రేమ తగదు చెడ్డవారి చెలిమి చేయవలదు మనసు నదుపుజేయ మరువకు మెన్నడు తెలుపుమయ్య నిజము దేవదేవ!


29. పొడుపు పద్యం

ఆటపాట చూపి ఆకలి మరపించు మాటలెన్నొ చెప్పి మాయ జేయు పనులు చక్కబెట్టి జనుల బంట్లుగ మార్చు దీని గుట్టు తెలుపు దేవదేవ!

30.

అవిటివాడు యెగిరి ఆకాశ మందగా అన్నియున్న వాడు వెన్నుజూపు అవిటి యెరుగనట్టి యలసట తనకేల తెలుపుమయ్య నిజము దేవదేవ!

31.

ఒక్క తడవయైన ఒప్పగ మనసును పట్టి చూడరేమి పాడు జనులు చూడ దెలియు గదర చేసెడి తప్పులు తెలుపుమయ్య నిజము దేవదేవ!

32.

వృద్ధులైన వేళ మృగములై పితరుల ఆశ్రమమున విడువ నాత్రపడిన తాము నడచు దారి తమ బిడ్డ నడవడా తెలుపుమయ్య నిజము దేవదేవ!

33.

ఇంటి పరువు నెపుడు యితరులు దీయరు ఇంటివాడె దీయు హీనుడయ్యి మాట జెల్లనపుడు మనుషులటుల జేయు తెలుపుమయ్య నిజము దేవదేవ!

34.

జరుగు దాని యెడల జాగరూకత లేక కనులముందు కీడు గానకున్న చేయి జారివోవ చేసేది యుండునా తెలుపుమయ్య నిజము దేవదేవ!

35.

ఇంటిలోన యెన్ని యిబ్బందు లున్నను వీధి కెక్కుటేమి బెట్టు గాదు కోతి పెద్దరికము కొంపలు ముంచురా తెలుపుమయ్య నిజము దేవదేవ!

36.

ఎంంచుకున్న లక్ష్య మెట్టిదైననుగాని కష్టపడిన యన్ని కలలు దీరు అడ్డదారి ద్రొక్కి యందు యోచన తప్పు తెలుపుమయ్య నిజము దేవదేవ!

37.

సుఖము నీయమనుచు సురల వేడుట కన్న బాధలను జయించు వరము గోరు భాగ్య మీయకున్న బలము నిచ్చిన చాలు తెలుపుమయ్య నిజము దేవదేవ!

38.

పరుల సిరులను గని పడిపడి వగచిన కడుపుమంట తప్ప కలుగునేమి స్పర్ధమాని వృద్ధి సాధించి చూపరా తెలుపుమయ్య నిజము దేవదేవ!

39.

హలము యున్ననేమి పొలము దున్నకయున్న కొడవ లున్ననేమి కోయకున్న చట్టమున్ననేమి చుట్టమై మెలగిన తెలుపుమయ్య నిజము దేవదేవ!

40.

పాడుపనులు చేసి పాపాలు పోగేసి తపము చేసినంత తప్పునేమి ఇహము చూడకున్న ఈశుండు చూడడా తెలుపుమయ్య నిజము దేవదేవ!

41.

పెదవులందు తేనె హృదయమందు విషము జాతిమేలు గనని స్వార్థపరత నేతయందు యున్న నీతిని చూపునా తెలుపుమయ్య నిజము దేవదేవ!

42.

నక్క వంటి వాని నమ్మి తాను తిరిగి గొర్రె వంటివాడు గోడు చెందు శకుని వంటి వాని సలహాలు వినకురా తెలుపుమయ్య నిజము దేవదేవ!

43.

మాతృభూమి విడిచి మాతృభాష మరచి అన్యదేశ మేగ నాశయేల దేశసేవ చేయ దీక్షతో సాగరా తెలుపుమయ్య నిజము దేవదేవ!

44.

ఎదురుగాలి లోన చెదిరిపోవు గొడుగు గాలివాట మందు గలుగు సుళువు ప్రకృతికి ఎదురేగి పడకురా బాధలు తెలుపుమయ్య నిజము దేవదేవ!

45.

తాగుబోతు మరచు తన బంధుజనమును తాగి తెలివి దప్పి వాగుచుండు తాగుబోతు సచ్చి ధరకు మోదము దెచ్చు తెలుపుమయ్య నిజము దేవదేవ!

46.

మనసు నచ్చకున్న మనిషికి కష్టంబు మనసు నచ్చెనన్న తనకు సుఖము కష్టసుఖము లెరుగ దుష్ట మానస లీల తెలుపుమయ్య నిజము దేవదేవ!

47.

మంచిమాట తోడ మనసు గెలవవచ్చు పోరి ప్రజల యండ పొందవచ్చు కాఱుకూత కూసి కలహాలు రేపకు తెలుపుమయ్య నిజము దేవదేవ!

48.

పదవి మీద మోజు ప్రజలపై జూపిన ప్రజలు ప్రేమ చూపి పదవులిచ్చు పదవి ముఖ్యమన్న ప్రజలేల మెచ్చురా తెలుపుమయ్య నిజము దేవదేవ!

49.

స్వార్థపరత యన్న జాడ్యంబు సోకిన జ్ఞానదీప్తిని తను గానలేడు త్యాగనిరతి కన్న తపమేమి యున్నది తెలుపుమయ్య నిజము దేవదేవ!

50.

ప్రళయమొచ్చు ననుచు ప్రజలెల్ల భీతిల్లి శాంతిపూజలు పలు సలుపుగాని ప్రళయభావమునకు బాధ్యులు ఎవరయా తెలుపుమయ్య నిజము దేవదేవ! 51.

తరువు వీడి ఫలము ధరణితలము జేరు నింగి కెగిరి బంతి నేలజేరు కారణంబు గొప్ప కాంతఱాయిర ధర తెలుపుమయ్య నిజము దేవదేవ!

52.

ఆశపరులు చచ్చి అణగి బానిసలగు నీతిపరులు యెదురు నిలిచి నెగ్గు ఉప్పు తినెడివాడు తప్పెత్తి చూపునా తెలుపుమయ్య నిజము దేవదేవ!

53.

ఎన్నికల దినముల వేల మాటలు చెప్పు మలుపు తిరగగానె మాట మరచు నేత మాటలెపుడు నీటి బుడగలురా తెలుపుమయ్య నిజము దేవదేవ!

54.

హద్దుపద్దు మరచి ఆలుమగలు తాము పరమ వైరులౌను పడక సతము సాధ్యమౌన బ్రతుకు సర్దుబాటెరుగక తెలుపుమయ్య నిజము దేవదేవ!

55.

నేత కన్న జూడ జాతి క్షేమము మిన్న పుట్టుకేల మిన్న బుద్ధి కన్న రాచజనము కన్న రాజ్యంబు మిన్నరా తెలుపుమయ్య నిజము దేవదేవ!

56.

పడనివాని చేయి పట్టి తా నడచిన పగతుడల్లె జూడు బంధుజనము కష్ట సమయమందు కనికరం జూపరు తెలుపుమయ్య నిజము దేవదేవ!

57.

కష్టమెంచకుండ కార్యమందున దిగి సౌఖ్యముంండు ననుచు సాగబోకు లోతు దెలియకుండ గోతిలో దిగుదురా తెలుపుమయ్య నిజము దేవదేవ!

58.

సంతనైన రెండు అంతరంగములను కలిపి నిలుపు వింత చెలిమి ప్రేమ దేహవాంఛ దెలుపు మోహంబు గాదయా తెలుపుమయ్య నిజము దేవదేవ!

59.

ఓటు వేయకుండ చాటు కెళ్ళకుమయ్య కోటికైన లేదు ఓటు విలువ ఓటు ఓటిదైన చేటురా మరువకు తెలుపుమయ్య నిజము దేవదేవ!

60.

మోయువాని కెరుక మోతతీపు గతికి తిరుగువార లేల తీపునెరుగు బాధ్యతన్న పూల బంతాట కాదురా తెలుపుమయ్య నిజము దేవదేవ!

61. పొడుపు పద్యం

మేనియందు నుండు మేదిని దాగుండు గగనమందు నుండు గాలినుండు ఉర్విదివిల సందు నూరేగు భూతము దీని గుట్టు తెలుపు దేవదేవ!

62.

హీనుడొప్పి చేయు హిత కార్యములయందు వంచనుండు దాగి మంచి వెనుక ఎదురు నాలుగిచ్చి ఎనిమిది గుంజురా తెలుపుమయ్య నిజము దేవదేవ!

63.

రోజు కొక్క గుడ్డు రుక్మంబు జాలక బాతు పొట్టగోసి వగచినట్లు హద్దులేని యాశ అసలుకు చేటురా తెలుపుమయ్య నిజము దేవదేవ!

64.

తమకు మేలుయన్న తక్షణమున చేసి మేలుగాక ప్రభుత మిన్నకుండు స్వార్ధపరత నేటి జనతంత్ర మతమయా తెలుపుమయ్య నిజము దేవదేవ!

65.

తాను తప్పు జేసి తన వైరిజనము పై నెట్టజూడు తులువ నెపము మోపి తులువ లాచరించు తొలినియమ మిదియే తెలుపుమయ్య నిజము దేవదేవ!

66.

మూర్ఖజనుల చెంత ముఖ్య సంగతులను ముచ్చటించ ముప్పు మచ్చుకైన సాధుజనుల తోడ సంవాదములు మేలు తెలుపుమయ్య నిజము దేవదేవ!

67.

మనసు కన్న నీచమైన దేదియు లేదు దానికన్న మంచి దసలు లేదు మంచి మనసు యున్న మనిషి మాధవుడురా తెలుపుమయ్య నిజము దేవదేవ!

68.

ఒళ్ళు తనది గాదు యిల్లు సొంతము గాదు బంధుజనము సొంతవారు గారు నరుడు నావి యన్న నవ్వురా భూతాలు తెలుపుమయ్య నిజము దేవదేవ!

69.

తనకు తీరదంటు పనికి మాలి బొంకి తీరి పెక్కు పనుల తిరుగుచుండు శ్రద్ధ లేక బొంకు సమయంబు లేకనా తెలుపుమయ్య నిజము దేవదేవ!


70.

అర్హుడంచు బుడత కధికారమిచ్చిన కార్యమందు నేర్పు కానగలమె అనుభవమును మించు అర్హత యుండునా తెలుపుమయ్య నిజము దేవదేవ!

71.

పూని బాలకుండు పుస్తకం బట్టక కాంక్షసేయు తను పరీక్ష రాయు విల్లు యంబు లేని వేట సార్థకమౌన తెలుపుమయ్య నిజము దేవదేవ!

72.

మంచిచెడ్డలుండు మనిషి జీవితమున కష్టసుఖములుండు కాపురమున గెలుపు ఓటములును క్రీఢలో సహజము తెలుపుమయ్య నిజము దేవదేవ!

73.

అడిగినన్ని నాళ్ళు అసలు ఎరుగనట్లు దాటవేయు ఎదురు దాడిచేయు ఓట్ల వేళ దొరలు మెట్లుదిగును సుమ్ము తెలుపుమయ్య నిజము దేవదేవ!

74.

మనుషులెదుట పొగిడి మమతను కురిపించి వెనుక తూలనాడి వెక్కిరించు కపటి వర్తనంబు కనుగొన్న చోద్యమౌ తెలుపుమయ్య నిజము దేవదేవ!

75.

తండ్రి తాగుచుండు తనయుండు దాపున మధువునమ్ము ప్రభుత వీధులందు అందుబాటు యున్న అలవాటు గలుగదా తెలుపుమయ్య నిజము దేవదేవ!

76.

విర్రవీగ దగదు విత్తము యెంతున్న లెస్స వగచవలదు లేమియున్న ఉన్న లేమియున్న నొక్కతీరుగ నుండు తెలుపుమయ్య నిజము దేవదేవ!

77.

గతము తలచుకొనుచు సతతము బ్రతుకును పొరుగువారి తోడ పోల్చుకొన్న బాధహెచ్చు మరువ పరవశం గల్గురా తెలుపుమయ్య నిజము దేవదేవ!

78.

మొరకువాని తప్పు సరిదిద్ద జూసిన ఇచ్చగించకుండు ఈసడించు సుజనుడైన మెచ్చి స్తోత్రంబు చేయడా తెలుపుమయ్య నిజము దేవదేవ!

79.

కొలువు లేనినాడు కూలి జేసినవాడు కొలువు కుదరగానె బలుపు జూపు విలువలొదిలి తాను వేధించు జనులను తెలపుమయ్య నిజము దేవదేవ!

80.

వాడుకెరుగ నట్టి వాజమ్మ ముంగిట వనరులెన్ని యున్న వగచు లెస్స సూక్ష్మబుద్ధి చెంత సూదున్న చాలదా తెలుపుమయ్య నిజము దేవదేవ!

81.

పేదరికము మాపు పెద్ద పథకమంచు కులము జూసి మేళ్ళు కొలువు లీయు బ్రతుకుతీరు గనని పథకంబు పారునా తెలుపుమయ్య నిజము దేవదేవ!

82.

పెద్దవారి మాట బుద్ధిగా వినకుండ మొండికేసి యువత దండుగవును ఆలకించి నడువ అగచాట్లు తప్పవా తెలుపుమయ్య నిజము దేవదేవ!

83.

లేనిదాని కొరకు కానిపనులు మాని ఉన్నదానితోనె ఒదిగి బతుకు తృప్తిపడి బతికిన దిగులేల గల్గురా తెలుపుమయ్య నిజము దేవదేవ!

84.

ఒక్క పూట కూడు కుక్కకు పెట్టిన ప్రేమజూపి యేళ్ళు వెంటదిరుగు యేండ్లు దిన్న మనిషి యెమ్మటే మరచురా తెలుపుమయ్య నిజము దేవదేవ!

85.

నీటిమీద నావ నిలచి తేలుచు నుండు నీరు లోనజేరి నీట మునుగు చెడ్డతలపు లిట్లు చెరచురా జనులను తెలుపుమయ్య నిజము దేవదేవ!

86.

కనులు రెండు యుండి జనులు గాంచుచుయున్న వీక్షణమున మిగుల భేదముండు జనుల మనసు బట్టి కనుదోయి గనునయా తెలుపుమయ్య నిజము దేవదేవ!

87.

కొమ్మ విరుగునన్న గుబులు కొంచెములేక చెట్లమీద కోతులెట్లు దూకు కోతి తన్ను నమ్ము కొమ్మను గాదయా తెలుపుమయ్య నిజము దేవదేవ!

88.

అమ్మ వైపువారు ఆప్తజనము కాగ భర్త వైపువారు భారమౌను వధువు కాపురమున వైనంబు నెరుగదు తెలుపుమయ్య నిజము దేవదేవ!

89.

ఒక్కడాడు మాట నొప్పుగా భావించి వడిగ పనికి దిగుట వలను గాదు నలుగురన్నది విని నడుచుట మేలురా తెలుపుమయ్య నిజము దేవదేవ!

90.

మఱ్ఱి విర్రవీగి బిఱ్ఱుగా నిలబడి గాలివాన కొరిగి నేలగూలు వెదురు గాలి కొదిగి వెయ్యేళ్ళు బ్రతుకదా తెలుపుమయ్య నిజము దేవదేవ!

91.

పిల్ల పెళ్లి జేసి తల్లిదండ్రులు చాల యూరడిల్లు బరువు దీరినట్లు బాధ పెరుగు గాని భారంబు తొలగునా తెలుపుమయ్య నిజము దేవదేవ!

92.

వీధిలోని కసవు వెంట దీసుకువచ్చి గృహమునింప కుళ్ళి కీడుసేయు స్వాంతమందు పగలు పంతంబు లట్టివే తెలుపుమయ్య నిజము దేవదేవ!

93.

అమ్మ ఎవరు పిన్ని అమ్మమ్మ లెవ్వరు బామ్మ వదిన చెల్లి భార్య లెవరు ఆడది అలుసైన అమ్మయు నలుసురా తెలుపుమయ్య నిజము దేవదేవ!

94.

నోటి దురుసు చేత మాటతూలి మనసు గాయ పరచువాడు గాలిగాడు ఈటెగాటు మాను ఎద గాయ మణగునా తెలుపుమయ్య నిజము దేవదేవ!

95.

ధరణియందు నున్న తరుణులెల్ల ఖలుని కనులకింపు యాలు కంటగింపు కనులుయుండి తాను కనలేని అంధుడు తెలుపుమయ్య నిజము దేవదేవ!

96.

తిండి గింజలున్న వండి యధికముగా మితము లేక దిన్న హితము గాదు పోషక సహిత మిత భోజనంబులు చాలు తెలుపుమయ్య నిజము దేవదేవ!

97.

పెళ్ళి పబ్బమన్న పేరున ధనికులు వ్యర్థపరచు తిండి వండి పోసి తిండి గింజ వెనుక తిప్పల నెరుగరు తెలుపుమయ్య నిజము దేవదేవ!

98.

సంశయించి ప్రజలు శంక దీర్చమనిన వాదులాడ నేల వంక బెట్టి మేలిమి కనకంబు కొలిమికి బెదురునా తెలుపుమయ్య నిజము దేవదేవ

99.

ఎండతాపమునకు యంత్రాలు పెట్టుకు సేదదీరు నింట బాధమరచు కాక బెంచు మూలకారణం బెతుకరు తెలుపుమయ్య నిజము దేవదేవ!

100.

ఎండ వాన రెండు నొండుగా మెలగిన ఇలను వెల్లివిరియు ఇంద్రధనుసు ఆలుమగల యనుగు అటుల అందము నిచ్చు తెలుపుమయ్య నిజము దేవదేవ!

101.

జరిగినట్టి దెరిగి జరుగుచున్న దెరిగి జరుగబోవు కీడు జాడనెరిగి విధిని మరచువాడు విష కీటకంబురా తెలుపుమయ్య నిజము దేవదేవ!


       🙏🙏🙏🙏🙏       వెంకట కృష్ణారెడ్డి మల్లు

M.VENKATA KRISHNAREDDY చివరిసారి 16 నిమిషాల క్రితం దిద్దుబాటు చేసారు వికీపీడియా అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం గోప్యతా విధానం వాడుక నియమాలుడెస్కుటాప్