Jump to content

వాడుకరి:Mallekedi ramoji

వికీపీడియా నుండి
తెలంగాణ అస్తిత్వ కాగడా--దాశరథి

తెలంగాణ సాహిత్యంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్న కాలంలో ఒకవైపు సంప్రదాయ కవిత్వం వ్రాస్తూనే,మరొకవైపుగేయ వచన కవిత్వం, ఒకసారి ప్రళయ కవిత్వం,మరొకసారి ప్రణయ కవిత్వం ఏది వ్రాసినా కవిత్వమంటే దాశరథియే అనిపించుకున్న మహాకవి దాశరథి. వీరి పూర్తి పేరు దాశరథి కృష్ణమాచార్యులు. అయినా దాశరథిగానే జగత్ప్రసిద్ధులు.

1925 జూలై 22 న పూర్వపు వరంగల్లు జిల్లా,ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరులో జన్మించాడు. తండ్రి దాశరథి వేంకటాచార్యులు. బాల్యం ఖమ్మం జిల్లా మధిరలో గడిచింది. ఉర్దూలో మెట్రిక్యులేషన్, భోపాల్ విశ్వవిద్యాలయమునుండి ఇంటర్మీడియట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీషు సాహిత్యంలో బిఎ చదివాడు. సంస్కృత, ఆంగ్ల,ఉర్దూ భాషల్లో మంచి పండితుడు. ఉపాధ్యాయుడుగా పంచాయతీ ఇన్స్పెక్టర్ గా ఆకాశవాణి ప్రయోక్తగా ఉద్యోగాలు చేసాడు. ఖమ్మంలో చదువుకుంటున్న రోజుల్లోనే దాశరథి కవితా కన్యను వరించాడు. నిజాం నవాబు నిరంకుశత్వం పై తన పదునైన కవితాయుధాన్ని సంధించి ఎదురుతిరిగిన ధీశాలి. "మా నిజాం రాజు జన్మ జన్మాల బూజు"అని కొదమసింహంలా గర్జించి చెరసాల పాలయ్యాడు. అయినా చెదిరిపోని సాహసంతో చెరసాల గోడలమీద బొగ్గుతో కవితలు వ్రాసాడు. నిజాం తో పోరాటం లో అప్పటికే చెరసాల పాలైన నాయకుల మనసులపై ఆ కవితలు మరింత చెరగని ముద్ర వేసాయి.

నిజానికి దాశరథి లో పసితనంనుంచి నిజాం పాలనపట్ల వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. పాఠశాలలో చదువుకుంటున్న సమయంలోనే---"తాబుద్ ఖాలిఖెఅలా--మెరయాసత్ రక్ఖే" గీతం పల్లవితో పార్థనాగీతం చదివించేవారు.దీనర్ధం ప్రళయకాలందాకా పరమేశ్వరుడు ఈ రాజ్యాన్ని (హైదరాబాద్) సుస్థిరంగా ఉంచుగాక "అని. కానీ దాశరథి ఈ గేయం పాడే సమయంలో తోటి విద్యార్థులతో గొంతు కలపక హెడ్ మాస్టర్ తో దెబ్బలు తినేవాడు.

అలాగే భాష విషయానికొస్తే ఇంట్లో తండ్రి సంస్కృత భాషాప్రియుడు .తెలుగులో మాట్లాడితే మైలపడిపోతానేమో అన్నంత ఛాందసుడాయన .పాఠశాలలోనేమో ఉర్దూ భాష. ఖచ్చితంగా నేర్చుకోవలసిందే.ఇలా ఇంటా బయటా మాతృభాష తెలుగుపై జరుగుతున్న దండయాత్రను ఛేదించడానికి మధురమైన మనోజ్ఞమైన తెలుగును తన కవిత్వం ద్వారా ఉపయోగించడం ప్రారంభించాడు.

తాను వలచిన కవిత చేయూతతో నూనూగు మీసాల నూత్న యవ్వనలోనే అగ్నిధార ద్వారా కుతకుత ఉడికే చైతన్య కవితకు శ్రీకారం చుట్టాడు. పునర్నవం, అమృతాభిషేకం, మహాంధ్రోదయం రచించాడు.తర్వాత ఉర్దూ గాలిబ్ గీతాలను అవి అసలు తెలుగు గీతాలేమో అన్నట్లుగా తెనుగించాడు.పసందైన తెలుగు సినీ గీతాలను ఎన్నింటినో వ్రాసి, తెలుగు సినీ యవనికపై చెరగని ముద్ర వేసాడు.కవితాపుష్పకం,తిమిరంతో సమరం,ధ్వజమెత్తిన ప్రజ వ్రాసాడు.తన ఆలోచనాలోచనాలు రచనతో ప్రపంచాన్ని పరిశీలించాడు.

వారి కృషికి ఆంధ్ర విశ్వవిద్యాలయం, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయము, ఆగ్రా విశ్వవిద్యాలయము డాక్టరేట్ ప్రదానం చేసాయి.ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డుతో సత్కరించింది. ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవి పదవి రద్దు అయ్యేంతవరకు ఆ పదవి లో కొనసాగాడు.

నా తెలంగాణ కోటి రత్నాల వీణయని మాతృదేశ భక్తిని ,కవితాశక్తిని,ఆత్మ గౌరవ రీతిలో గొంతెత్తి చాటారు దాశరథి. అలాగే నాపేరు ప్రజాకోటి,నాఊరు ష్రజావాటి అని సామ్యవాద కవితను చెప్పాడు. "నా గీతావళి ఎంతదూరము ప్రయాణంబౌనో అందాక ఈ భూగోళంబునకగ్గిబెట్టెద" నని గొంతెత్తి తనదైన శైలిలో పాడారు.తన కవిత్వంలో అగ్నిధారలు కురిపించడమే కాదు,"మాట్లాడని మల్లెమొగ్గ మాదిరిగా నడిచిరా-నిశ్శబ్దం ఎరుగనట్టి నిమ్నగము వలె నడిచిపో"అని అలతి అలతి పదాలతోఅపురూపమైన కవిత్వం వినిపించాడు.కండగల పద్యం ఎంత దండిగా చెబుతాడో ,చేవగల వచనాన్ని అంతే వాడిగాచెబుతాడు దాశరథి.

దాశరథి ఎన్ని వందల కవితలు చెప్పినా," నా మానని గాయాల వజ్రాయుధాలతో,అధికార మదాంధుల బధిర హృదయాలను బ్రద్దలు కొడతాను,దయాహీన మానవ మనో మరోభూమిలో కృపావృష్టి కురిపిస్తాను.కవితాంబోధర గుణాలతో తుపాకుల నోళ్ళు మూయిస్తాను,బాంబుల చెంపలు వాయిస్తాను.నా అరుణారుణ హృదయశకలాల తోరణాలతో అవనినిఆనందభరితంగా కళ కళలాడిస్తాను." అన్నాడు. అదే ఆయన కవితా సిద్ధాంతం. ప్రజలకు సాహిత్యం ఇంకా దగ్గరగా వెళ్ళాలన్నదే ఆయన లక్ష్యం. ఇంకా తానంతో వ్రాయవలసి ఉన్నదని ఎప్పుడూ చెపుతుండేవారు.తెలంగాణా అస్తిత్వాన్ని నిరంతరం కాపాడిన దాశరథి 1987 నవంబరు 5 వతేదీన పరమపదించారు.

........................................................మల్లెకేడి రామోజీ

తెలుగు పండితులు ...............