వాడుకరి:Shabarish Moogati/ప్రయోగం-1

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పరిచయం[మార్చు]

మూగాటి శబరీష్ ప్రముఖ కవి, రాయలసీమ కథా రచయిత. ఆకలి కేకలు, బాధలు, పేదల కష్టాలే ఆయన కవితలోని ప్రధానాంశాలు. చాలా రోజులుగా దళితులు, పేదలు, స్త్రీలపై వివిధ రకాల రచనలు చేస్తూ తన కంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. చిత్తూరు జిల్లాలోని పాకాల మండలం తలారిపల్లికి చెందిన శబరీష్ యం.దొరస్వామి, యం.సరస్వతిలకు 1993 మే 6వ తేదీన జన్మించారు. బాల్యం ఆయనకు చేదు అనుభవాల్నే మిగిల్చింది. ఆటపాటల మధ్య, ఆడుకుంటున్న పిల్లల మధ్య ఆడుతూ పాడుతూ బతికిన ఆయనకు ప్రమాదం ఎదురైంది. అంగవైకల్యం వల్ల ఆయన జీవితంలోకి చీకటి ప్రవేశించింది. అప్పుడే ఆయనకు అనేక రకాల బతుకుల గురించి, బాధల గురించి అర్థమయ్యింది. ఆ తర్వాత చిత్రకళ, వ్యాసరచన, ఆటల పోటీలలో ఆయన మిక్కిలి ప్రతిభ చూపించారు. పాఠశాల, కళాశాల జీవితంలో ఆయన అనేక కష్టాలను అనుభవించారు. పేద కుటుంబం కావడం వల్ల పని బతుకు మొదలైంది. ఏడుపు పరిచయమైంది. కన్నీళ్ల సావాసం అలవాటైంది. ఐదవ తరగతి నుంచే కవితలు రాయడం మొదలుపెట్టిన శబరీష్ ఉపాధ్యాయుల వద్ద, స్నేహితుల వద్ద ప్రశంసలు అందుకున్నారు. స్వతహాగా జర్నలిజం వైపు అడుగులు పడ్డాయి. తెలుగు భాషపై అభిరుచి ఉండేది. అందుకే ఆయన రాయలసీమ యాసలో కథలు, కవితలు రాయడం మొదలుపెట్టారు. పలు కథలు నగదు బహుమతులు కూడా అందుకున్నాయి. మూగాటి శబరీష్ వచన కవిత్వాలు ఎక్కువగా రాసేవారు. కులదహనం, గతితప్పిన జీవితాలు, నగరం నిద్రపోతున్న వేళ, చావు చెప్పిన నిజం, చిగురించని ఆశలు.. ఇలా అనేక కవితలు చాలా మంది మనసులను కదిలిస్తాయి. ఆయన కవితల్లో ఆకలి చావులు కనిపిస్తాయి. కన్నీళ్లు ప్రవహిస్తాయి. సగటు జీవికి ఆయన కవితలు ఒక పెనుగులాటగానే కాకుండా కొంత ఓదార్పుగా కూడా ఉంటాయి.

కులదహనం[మార్చు]

పెనుమంటల జ్వాలల్లో
కులదహనం
పరువు హత్యలను హతమార్చే
శాసనం
దళితుల రక్తపు మడుగుల్లో
రాజకీయుల విన్యాసం
నగరం నడిబొడ్డున పాతిపెట్టాలి
వర్గభేదాల శవం
చీకటి బతుకుల్లో ప్రవహించాలి
కాంతి రేఖల దర్శనం
తారతమ్యాల తలరాతల్లో
గూడుకట్టుకోకూడదు అంటరాని గోపురం
అంబేద్కర్ అడుగుజాడల్లో
నిలబడి కదలాలి
హక్కులకై జనచైతన్యం
కులం లేని .. కులం రాని సమాజం
నిర్మితమవ్వాలంటే కులపుత్రులముందే
జరగాలి కులదహనం
ప్రపంచానికి వినపడేలా చితిపై
ఘోషించాలి ఆ కులదహనం

చావు చెప్పిన నిజం[మార్చు]

సూర్యాస్తమయం వేళ
చీకటీ వెలుగు ప్రేమించుకుంటున్నాయి
కళ్ళ ముందు ఇప్పటి వరకూ
బతికిన బతుకు బావురుమంటోంది
చేసిన తప్పులు చుట్టూ చేరి
నవ్వుకుంటున్నాయి
మంచిపనులు మచ్చుకైనా కానరాలేదు
బొడ్డు నుంచి వేరైన క్షణం నుంచి
బిడ్డలకు భారమైన నిమిషం వరకూ
బాధలతో సతమతమైన అద్భుతాల
ు కళ్ళ నుంచి జాలువారుతున్నాయి
ఆనందాలు అల్లంత దూరంలో
కేరింతలు కొడుతున్నాయి
సంపాధించిన డబ్బు బద్దకంగా
బీరువాలో నిద్రపోతోంది
కుటుంబీకుల ఏడుపులు
వెక్కిరిస్తున్నట్టే వున్నాయి
నట్టింట్లో ఆస్తి పంపకాల
జాతర మొదలయింది
వీధిలో సమాజం సవ్వడి సందడి చేస్తోంది
ఇంతలో సమయం శ్వాసను ఆపింది
సాయంలోనే బతుకుందని
సాయంతోనే బతకగలమని
చావుచెప్పిన నిజం
శరీరం నుంచి వేరుచేసింది

అమ్మ బరువైంది[మార్చు]

నవ మాసాలు మోసిన అమ్మ బరువైంది వేలుపట్టుకుని నడిపించిన నాన్న భారమయ్యాడు పెద్దరికం ఇప్పుడు పనికిరాని వస్తువయ్యింది ఆస్తికోసం ఒకరు ..అక్కరలేదని మరొకరు కోటి ఆశలు కన్నబిడ్డల చేష్టలకు ఆత్మహత్య చేసుకున్నాయి ఆఖరి రోజులు శోకంతో ఊపిరిపీల్చుకున్నాయి కన్నప్రేమ వృద్ధాశ్రమానికి నడిపించింది వీడలేక విడిచిపోలేక గుండె తల్లడిల్లింది ఇంతబతుకు బతికి ఓల్డ్ఏజ్ హోమే కేరాఫ్ అయ్యింది కుటుంబం నుంచి వెలివేయబడ్డ బతుకులు నాలుగు గోడలమధ్య నలిగాయి కంటిపాపల కోసం రోదించాయి అందరికీ అర్ధాయుస్సే ఉండాలని ఆకాంక్షించాయి చితికిన మనసులు చితి కోసం ఇప్పుడు ఎదురుచూస్తున్నాయి

కన్నపేగు కాలిన వాసన[మార్చు]

చీకటిని తరిమికొడుతున్న ఆ ఉదయంలో పిల్లల్ని నిద్రలేపుతున్న తల్లి పక్షులు కౌగిళ్లతో పెనవేసుకోనున్న వృక్షాల మధ్య తారసపడ్డాయి

ఆరోగ్యాన్ని దోచుకోవడానికి దారిపొడవునా పొట్టరాయుళ్ల పరుగుపందేలు చెడ్డీలతో వున్న బలిసినోళ్ల పాట్లు కనిపించాయి

పొట్టకూటికి పేపరేస్తున్న బాల్యమిత్రులు బతుకుబండిని లాగుతూ కన్నబిడ్డల బాధితులు దైవాన్ని నమ్ముకుని బతుకుతున్న దౌర్భాగ్యులు ఆకలితో దీనంగా చూస్తూ కుక్కలుండే దారిలోనే కళ్ళముందు మెరిశారు

స్త్రీని అవహేళన చేస్తున్న కీచకుల నవ్వులు కార్మికురాలి శరీరాన్ని చూస్తూ కామాంధులు అమ్మాయిల చుట్టూ ఆకతాయిలు సగౌరవంగా ఆ మార్గంలోనే సంచరించారు

ఆ చెత్తకుప్ప ముందు కుప్పకూలిన జనాలు కల్లబొల్లి కబుర్లాడుతూ నేతల వాతలు కన్నీళ్లను కార్చుతూ తల్లుల శాపనార్థాలు పసిబిడ్డ కేకలు పేట్రేగుతుండగా కన్నపేగు కాలిన వాసన గుబాళించింది

మూగాటి శబరీష్ కథలు ప్రశ్నిస్తూనే గుండెను బరువెక్కేలా చేస్తాయి. బాధను దిగమింగుకునేలా చేస్తాయి. అతలాకుతలమైన జీవితాలను పరిచయం చేస్తాయి. వేరే ప్రపంచానికి తీసుకెళ్తాయి. ఆయన రాసిన మూడు మరణాలు,

మూడు మరణాలు (కథ)[మార్చు]

రెండ్రోజులుగా ఎడతెరపి లేకుండా కురస్తానే ఉంది ఈ ఎర్రి వాన. కురవాల్సిన సమయానికి కురవనేలేదు. ఇప్పుడీ ఊరంతా వల్లకాడయ్యాక సంబరం చేసుకునేదానికన్నట్లు కురస్తా ఉంది. వర్షం కురవడంతో ఎండిన ప్రతి చెట్టూ వాన తాకిడికి పులకరించి ఆనందంతో రెమ్మలు వెయ్యడానికి సిద్ధమవుతుంటే అది చూసి పక్షులు చినుకుల మధ్య కేరింతలు కొడుతున్నాయి. వర్ణవికారంగా తయారైన భూమాత మునుపటి తేజస్సును సంతరించుకుంటోంది. ఏడాది క్రితం వానలు కురవక సేద్యం సాగక ఊర్లో నాల్గు పెద్దతలకాయలు ఉరికి వేలాడాయి. ఊర్లో ప్రజలు జీవచ్ఛవాలయ్యారు. కన్నీళ్లు కార్చడం తప్పా కడుపులు మాడ్చడం తప్పా ఏమీ చేయలేకపోయారు. ఆ సమయంలోనే పట్నమెళ్లి బతకాలనే నిర్ణయానికొచ్చారు. కనీసం తమ బిడ్డల్నన్నా బతికించుకోవాలనే ఆశతో తల్లులంతా తమ పిల్లల్ని పట్నం తీస్కెల్లిపోయారు. ఊరు ఒంటరిదయ్యింది. నెర్రులు చీలిన భూమి ఊరి ప్రజల ఆశలు నెరవేరాలని కోరుకుంది. శోకాన్ని దిగమింగుతూ తిండిగడిచి బతుకుబాగుపడాలని పట్నానికి ఊరంతా వలసెల్లిపోయాక పాపమ్మ మాత్రం ఎప్పుడూడుతుందో తెలియని తన గుడిసిల్లును పట్టుకుని కదల్నంటా ఉంది. ఇప్పుడు వాన కురవంగానే తమ కులదైవం ఇరపచ్చమ్మకి మొక్కుకుంది. దండాల మీద దండాలు పెట్టింది. ఈ వానను చూస్తా ఉంటే పాపమ్మకు పెద్దపండగే వచ్చినట్లుంది. వలసెళ్లినోళ్లంతా తిరిగొస్తారనే ఆనందంతో వయసును కూడా మర్చిపోయి గెంతులేస్తా ఉంది. తన మనవరాలు జలజ జీవాల కాడికి పోయింది. రాగానే గుడికి పోయి తమ కులదైవానికి ప్రసాదం పెట్టాలని నిర్ణయించుకుంది. బలమైన చినుకులు టపటపమనే శబ్ధం చేసుకుంటా గుడిసె మీద కురస్తా ఉండాయి. ఆ సినుకుల దెబ్బకు గుడిసె సూరు చిల్లు పడి ఇంట్లోకి నీళ్లు పడ్తాండాయి. ఇక ఊర్లోని ముప్పై గుడిసిండ్లకు పాపమ్మే దిక్కు. ఆమెకు తోడుగా మనవరాలు జలజ. వారిద్దరికీ జతగా మరో రెండు జీవాలు. ఇవే ఆ ఊరిని పాలించే రాజులు. ఇక పాపమ్మ, జలజలు మరో మనిషిని చూడాలంటే నాలుగు మైళ్లకు అవతల ఉండే ఊరికెళ్లాల్సిందే. పలకరింపులకు దూరంగా ఆకలికి దగ్గరగా మగపురుగులేని ఒంటరి ఊర్లో ఆప్యాయంగా బతుకీడుస్తున్నారు పాపమ్మ, జలజలు. ఎప్పటికైనా ఊరిడిచి వెళ్లినోళ్లు తిరిగొస్తారని మర్రిచెట్టును అంటిపెట్టుకుని ఉండే గుడిసింట్లోనే కాలాన్ని తరుముతున్నారు.

గుడిసిల్లును ఆనుకుని లావైన ఊడలతో ఎత్తైన మర్రిచెట్టుంది. ఏపుగా పెరిగిన ఆ చెట్టు ఎన్నో పక్షులకు నిలయమైంది. మర్రిచెట్టు తొర్రలో ఓ గుడ్లగూబ కాస్కోనుండాది తన పెనిమిటి కోసం. వేట కోసం వెళ్లిన తన పెనిమిటి ఈ వానలో యాడ సిక్కుకొని ఉండాడో, ఎన్ని కష్టాలు పడ్తాండాడో.. ఇదే దిగుల్తో తిండి నీళ్లు కూడా పట్టించుకోకుండా ఎదురుచూస్తా కాస్కోనుండాది. ఆకాశానికి తాకేటట్లుండే ఆ మర్రిచెట్టు పైకెక్కి తన పెనిమిటి కోసం ఎన్నిసార్లు చూసొచ్చిందో లెక్కేలేదు. ఈసారైనా వస్తాండాడేమోనని చూసేదానికి బయల్దేరుతుండగా మర్రిచెట్టు కిందుండే గుడిసింట్లో పాపమ్మ అరుపులు. హోరు వానలో ధీర్ఘంగా అరస్తా ఉంది. తన ముద్దుల మనవరాలు జలజ కోసం. అరిసరిసీ గెస పుట్టేసరికి పాపమ్మ నోరు మూతపడింది. గుడ్లగూబ పెనిమిటి కోసం రెక్కలిదుల్చుకొని ఎగిరిపోయింది. ఇక ఎదురుచూడ్డం వల్ల లాభం లేదని తెలిసి సూర్యకిరణాలను సైతం కప్పేసిన వానలో పాపమ్మ జలజ కోసం లాంతరు తీస్కోని బయల్దేరింది. జలజ చాలా అల్లరి పిల్ల. పట్టిన పట్టు వదలని గడసరి పిల్ల. అందుకే పాపమ్మ జలజకు ఈ రోజు జీవాల్ని మేపే పని అప్పగించింది. సద్దేలకాడ బయల్దేరిన పిల్ల సందేలైనా రాకపోయేసరికి పాపమ్మకు కంగారెక్కువైంది. 'ఈ వానలో ఎందుకు పంపిచాన్రా దేవుడా' అని తనపైన తనే తిట్ల పురాణం కుమ్మరించుకుంది. పళ పళమని మెరిసే మెరుపులు, ఉరుములు వాటి శబ్దానికి పోటీగా 'ఓ జలజ.. ఓ జలజ..' అంటూ పాపమ్మ అరుపులు. ముళ్ల పొదలను, ఏపుగా పెరిగిన చెట్లను దాటుకుంటూ పాపమ్మ దారి బాటమ్మింటీ 'జలజ.. అమ్మా జలజ..' అంటూ వెళ్తోంది. అరిసరిసీ గెసపోస్తున్న పాపమ్మ ఉన్నట్లుండీ కళ్ల ముందున్న దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. భూమి కంపించినట్లుగా, ఆకాశం బద్దలైనట్టుగా, అడవితల్లి భగభగమండే మంటలకు కాలిపోతున్నట్లుగా అరవసాగింది. పాపమ్మ అరుపుకి జీవాల మధ్య లేడిపిల్లలా ఎగిరెగిరి గెంతుతా అంజిగాడు పారిపోయాడు. 'అయ్యో..! ఎంత ఘోరం జరిగిపోయింది. పొరపాటు చేశాను తల్లీ...! అమ్మా జలజ...నన్ను క్షమించమ్మా... అమ్మా జలజ... నా బంగారు తల్లీ.. కళ్లు తెరువమ్మా... మీ అవ్వనమ్మ.. ఒక్కసారి చూడమ్మా...!' అంటూ వివస్త్రగా ఉన్న జలజని గుండెలకు పొదువుకుని కుమిలిపోతూ ఏడుస్తోంది పాపమ్మ. ఈసారి మెరుపులు, ఉరుములు శబ్దాలకంటే పాపమ్మ అరుపులు, కేకలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. బంగారు తల్లి ఆ అల్లరి పిల్ల జలజ అంజిగాడి చేతిలో బలైపోయి జీవచ్ఛవంలా కొన ఊపిరితో కొట్టుకుంటోంది. పాపమ్మకు ఏం చేయాలో తోచడం లేదు. గుండెపగిలేట్టుగా ఉంది. ముళ్ల పొదల్లో చిక్కుకుని చిరిగి ఉన్న బట్టని తీసి జలజ మీద కప్పింది. శక్తినంతా కూడదీసుకుని తన భుజాలపై జలజను మోసుకొచ్చి గుడిసింట్లో పడుకోబెట్టింది. సొమ్మసిల్లి ఉన్న జలజ ఒక్క క్షణం కళ్లు తెరిచి అవ్వని చూసి 'దాహం..దాహం' అంటూండగా పాపమ్మ దోసిడు నీళ్లు తెచ్చి జలజ నోటికి అందించింది. 'జీవాలు మిట్టచేన్లలో ఉండాయవ్వ..' అంటూ జలజ మళ్లీ కళ్లు మూసింది. పాపమ్మకు ఏం చేయాలో పాలుపోలేదు. రక్షించేవాళ్లు లేరు. పొరుగూర్లో కూడా ఎవరూ సాయం చేసేటోళ్లు లేరు. అప్పుడప్పుడూ ఈ గుడిసింటికి వచ్చి సాయపడే అంజిగాడే ఈ యాళ ఇంత అఘాయిత్యానికి పాల్పడినాడు. నిస్సహాయంగా తయారైంది పాపమ్మ పరిస్థితి.

వాన బీభత్సం ఎక్కువయ్యింది. ఊరి చివరుండే చెరువు వరద నీటితో నిండిపోతోంది. వాన తాకిడికి చెరువునానుకుని ఉండే చెట్టు కొమ్మలు ఊగసాగాయి. ఈ ఊపుకి తమ గూళ్ల నుంచి పక్షులు బయటికొచ్చేస్తున్నాయి. కొన్ని సంవత్సరాలుగా కాపురం ఉంటున్న తమ గూళ్లను తలుచుకుంటూ ఆ పక్షులు ఏడ్వసాగాయి. ఎన్నో కష్టాలు పడి కట్టుకున్న తమ గూళ్లు ఇక ఉండబోవని తెలిసి బాధపడుతూ మనసారా వాటిని హత్తుకుంటున్నాయి. వాన తీవ్రత ఎక్కువయ్యేసరికి పక్షులు చెదిరిపోతున్న తమ గూళ్లను.. వాటిలో బతికిన తమ జీవితాలను తలుచుకుంటూ విషాదంగా ఆకాశం వైపుకి ఎగరసాగాయి. గుడ్లగూబ మాత్రం తన చెంతకు వస్తున్న తన పెనిమిటిని చూసి ఆనందించింది. పరవశంతో పెనిమిటిపై ప్రేమతో పొంగిపోయింది. పెనిమిటి గూటికాడికి రాగానే చలి జ్వరంతో వణుకుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. గూటిలోకి దూరిపోయి గడగడా వణుకుతున్నాడు. పెనిమిటి బాధను చూసి గుడ్లగూబ మనసు తరుక్కుపోయింది. వాన చినుకులకు ముద్దగా తడిసొచ్చిన తన పెనిమిటిని చూసి ఏడ్చింది. తన వెచ్చటి రెక్కలతో పెనిమిటిని రుద్దసాగింది. తన పెనిమిటిని ఎలాగైనా కాపాడాలనుకుంది. గూటినొదిలి వెళ్లకుండా గూటిలోకి వాన చినుకులు చొరబడకుండా గూటి ద్వారానికి తన రెక్కల్ని అడ్డు పెట్టింది. గుడ్లగూబ తన పెనిమిటిని బాగు చేసే క్రమంలో తను వానలో తడుస్తున్న సంగతే మర్చిపోయింది.

మర్రిచెట్టు కింద గుడిసింట్లో రోదన ఎక్కువైంది. ఈ చలిగాలి, భీకరమైన వానల మధ్య తన మనవరాలు జలజను చూస్తూ పాపమ్మ తల్లడిల్లిపోయింది. జలజను తన కౌగిట్లోకి తీస్కోని వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఇంతలో ఆకాశం నుంచి ఓ మెరుపు... ఆ మెరుపుతో పాటు ఓ ఉరుము ఒక్కసారిగా వచ్చాయి. అవి వెళ్తూ వెళ్తూ జలజ ప్రాణాలను కూడా తీసుకెళ్లిపోయాయి. ఆ విషయం తెలియని పాపమ్మ ఏడుస్తూ స్పృహ తప్పింది. వాన తగ్గుముఖం పట్టింది. ఉదయం సూర్యకిరణాల తాకిడికి పాపమ్మకు మెలకువ వచ్చింది. ప్రాణం లేని తన మనవరాలిని చూసి ఏడ్వాలనుకుంది. రోదించాలనుకుంది. కానీ శక్తి చాలక మౌనంగా కండ్ల నీళ్లు మాత్రమే కార్చింది. పాపమ్మ రోదనను విని గుండె బద్దలైందేమో అన్నట్టు ఆ ఊరి చెరువు కట్ట ఒక్క ఉదుటున తెగిపోయింది. ఆ ప్రవాహం పోతూ పోతూ ఆ ఊరి గుడిసెలను జలజ మృతదేహాన్ని, ఆ జలజను తన కౌగిట్లో పొదువుకుని ఉన్న పాపమ్మని తనతో పాటు తీసుకెళ్లిపోయింది. ప్రవాహంలో కొట్టుకుపోతున్న పాపమ్మ, జలజ దేహాల మధ్య రాత్రంతా చలిగాలికి, వానకి తట్టుకోలేక పెనిమిటిని కాపాడే ప్రయత్నంలో పీనుగైపోయిన గుడ్లగూబ కాయం జాలువారింది. అలా ఆ మూడు బతుకులు శవాలై ప్రవాహంలో కలిసిపోయాయి. వెలుతురు లేని ఆకాశంలో గాయాలై పచ్చి పుండులాగా ఉన్న మేఘాల నుంచి రక్తస్రావాలు రొమ్ము విరుచుకుని విర్రవీగుతూ కురవసాగాయి.