వాడుకరి:VIJAY PRAKASH KONDETI/చార్టెర్డ్ అక్కౌంటెన్సీ చదవడం సులభమేనా ?
ఉపోద్ఘాతం
[మార్చు]ఏ ఉద్యోగానికైనా ఎంతో పోటీ ఉన్న ఈ రోజుల్లో చార్టెర్డ్ అక్కౌంటెన్సీ యువతకు ఒక గొప్ప వరంగా పరిణమించింది.ఎన్నో రకాల ఉద్యోగావకాశాలకు వేదికగా మారింది.ఈ కోర్సును పూర్తిచేసిన వారికి ప్రపంచమంతటా కూడా ఎనలేని గుర్తింపు లభిస్తుంది. ఏ విద్యార్థియైనా పదోతరగతి పూర్తిచేసిన తరువాత తన యొక్క భవిషత్తును ఏ రంగంలో స్థిరపరచుకోవాలి అనే ఆలోచనలో పడతాడు. ఈ చార్టెర్డ్ అక్కౌంటెన్సీ రంగాన్ని ఎంచుకొన్న విద్యార్థులు నూటికి నూరు శాతం ఉజ్జ్వల భవిష్యత్తును పొందగలరనుటలో ఏ సందేహమూ లేదు. కాని చాలామంది విద్యార్థులు చార్టెర్డ్ అకౌంటెన్సీ కోర్సుని పూర్తిచేయడం చాలా కష్టమైన పని,ఆ కోర్సు బాగా చదివే విద్యార్థులు మాత్రమే పూర్తిచేయగలరు అనే అపోహలో పడి చక్కని భవిష్యత్తు ఉన్న ఈ రంగాన్ని కాదనుకుంటున్నారు.ఇది శోచనీయాంశం.వాస్తవానికి మనిషికి సాధ్యపడని విద్య అంటూ ఏదీలేదు.ఎడతెగని పట్టుదల, ఆత్మవిశ్వాసం మరియు సహనం ఇటువంటి కోర్సులకు అతి ప్రాముఖ్యం.
వివరణ
[మార్చు]ఎంతో విలువైన ఈ కోర్సును నిర్వహిస్తున్న సంస్థ " ఇన్సిస్ట్యూబ్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెన్సీ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ) ".ఈ కోర్సును ఎంచుకొన్న విద్యార్థి మూడు దశలుగా ఈ కోర్సును పూర్తిచేయగలడు.చార్టెర్డ్ అక్కౌంటెన్సీ చదవదలిచిన విద్యార్థులు ఇంటర్మీడియట్ నందు ఎంఈసీ గ్రూపును తీసుకొంటే మంచిది.మొదటిదశలో విద్యార్థి, ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు పూర్తిచేసిన తరువాత కామన్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (సిపిటి) వ్రాసేందుకు అర్హత కలిగియుంటాడు.రెండవ దశలో, సిపిటి పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థి ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్స్ కోర్స్ (ఐపిసిసి) కొరకు నమోదుచేసుకోవాలి. మూడవదశలో, ఐపిసిసిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఫైనల్ కోర్సు పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలి.ఈ పరీక్షలో ఉతీర్ణత సాధిస్తే విద్యార్థి తన చార్టెర్డ్ అకౌంటెన్సీ కోర్సును పూర్తిచేసినవాడవుతాడు. ప్రాముఖ్యమైన ఈ మూడు మైలురాళ్ళను సులభంగా ఏ విధముగా దాటగలమో ఒక్కొక్క దాని గురించి సవివరముగా తెలుసుకొందాం.
కామన్ ప్రొఫిషియన్సీ టెస్ట్( సిపిటి)
[మార్చు] మొత్తం చార్టెర్డ్ అకౌంటెన్సీ కోర్సుకు ఈ సిపిటి పరీక్ష తొలిమెట్టు వంటిది.ఈ పరీక్ష మొత్తం నాలుగు గంటలపాటు నిర్వహింపబడుతుంది.మరలా ఈ నాలుగు గంటలూ రెండేసి గంటలచొప్పున రెండు భాగాలుగా విభజింపబడి 200 మార్కులకు జరుగుతుంది.అన్నీ ఐచ్ఛికసమాధానములకు సంబంధించిన ఒక మార్కు ప్రశ్నలే.తప్పైన ప్రతీ సమాధానమునకు 0.25 మార్కులు తీసివేయబడతాయి(Negative marking).ఈ పరీక్షలో కనీసం 50 శాతం మార్కులు సాధిస్తేనే ఐపిసిసికి అర్హులుగా ఎంచబడతారు.
మొదటి భాగము:
- 1.ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ (60 మార్కులు)
- 2.మర్సంటైల్ లా (40 మార్కులు)
రెండవభాగము:
- 1.జనరల్ ఎకనమిక్స్(50 మార్కులు)
- 2.క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్(50 మార్కులు)
ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్స్ కోర్స్ (ఐపిసిసి)
[మార్చు]ఈ ఐపిసిసి కోర్సు అత్యంత ప్రాముఖ్యమైనది.ఈ కోర్సును పూర్తిచేసే విధానంలో భాగంగా కొన్ని కీలకమైన విషయాలపై విద్యార్థి దృష్టిపెట్టాల్సియుంటుంది.ఎక్కువ కాలపరిమితి ఉండే ఈ దశలో ప్రతీ అంశం కూడా విద్యార్థియొక్క నైపుణ్యాలను పెంపొందించేదే.ఐపిసిసి పరీక్షకు నమోదుచేసుకున్న తరువాత ఈ పరీక్షకు హాజరుకావటానికి ముందు తొమ్మిదినెలల పాటు జరిగే స్టడీ కోర్సును , 100 గంటల కాలపరిమితి ఉండే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సును,36 గంటలపాటు జరిగే ఓరియెంటేషనల్ కోర్సును పూర్తిచేయాలి .ఈ పరీక్ష రెండుగ్రూపులుగా విభజింపబడింది.మొదటిగ్రూపులో నాలుగు పేపర్లు,రెండవగ్రూపులో మూడుపేపర్లు ఉంటాయి.ప్రతీ పేపరుకు ఒక గంట గరిష్టకాలపరిమితి ఇవ్వబడింది.
మొదటి గ్రూపు :
పేపర్ -1:- అక్కౌంటింగ్
పేపర్ -2:- లా,ఎథిక్స్,కమ్యూనికేషన్
- పార్ట్ -1, లా
- పార్ట్ -2, బిజినెస్ ఎథిక్స్
- పార్ట్ -3 ,బిజినెస్ కమ్యూనికేషన్
పేపర్ -3 :-కాస్ట్ అక్కౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్
పేపర్ -4 :- ట్యాక్సేషన్
- పార్ట్ -1, ఇన్కమ్ ట్యాక్స్
- పార్ట్ -2, సర్వీస్ ట్యాక్స్,వ్యాట్
రెండవ గ్రూప్ :
పేపర్- 5:- అడ్వాన్సెడ్ అకౌంటింగ్
పేపర్- 6:- ఆడిటింగ్ అష్యూరెన్స్
పేపర్- 7:- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్
- పార్ట్ -1, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
- పార్ట్ -2 ,స్ట్రాటజిక్ మేనేజ్మెంట్
ఆర్టికల్ షిప్ ట్రైనింగ్
[మార్చు]ఉద్యోగరంగంలో రోజురోజుకీ ఎంతో పోటీపెరిగిపోతున్న ఈ కాలంలో తనకంటూ ఒక ప్రత్యేకస్థానాన్ని పదిలం చేసుకోవాలంటే విద్యార్థికి కేవలం పుస్తకజ్ఞానం మాత్రమే సరిపోదు.దానితో పాటు పుస్తకాలలో చదివినవాటిని ఆయా రంగాలలో నిత్యజీవితములో సరైనవిధముగా ఉపయోగించగలిగే అవగాహన తప్పనిసరి.అందుకే చదువుతున్న పాఠ్యాంశాలను అనుభవపూర్వకంగా (ప్రాక్టికల్ నాలెడ్జ్) నేర్చుకొనేందుకు, ఐసిఎఐ ఆర్టికల్ షిప్ ట్రైనింగ్ ను ప్రవేశపెట్టింది.ఐపిసిసి పూర్తిచేసినవిద్యార్థులు ఆర్టికల్ షిప్ కొరకు నమోదుచేసుకోవాలి.ఈ ఆర్టికల్ షిప్ ట్రైనింగ్ మూడు సంవత్సరాలు ఉంటుంది.ఈ మూడుసంవత్సరాలు ఐసిఎఐ గుర్తింపువున్న చార్టెర్డ్ అకౌంటెంట్ దగ్గర ఆర్టికల్ షిప్ చేయాల్సి ఉంటుంది.
సిఎ ఫైనల్ కోర్సు
[మార్చు] ఆర్టికల్ షిప్ పూర్తిచేసిన తరువాత లేక చివరి ఆరు నెలల కాలంలో ఈ ఫైనల్ కోర్సు పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలి. సిఎ ఫైనల్ కోర్సు చదువుతూ ,ఆర్టికల్ షిప్ చివరి 12 నెలల సమయంలో ,15 రోజులపాటు జనరల్ మేనేజ్మెంట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కోర్సును పూర్తిచేయాల్సియుంటుంది.
గ్రూప్ -1 :
పేపర్ -1: ఫైనాన్షియల్ రిపోర్టింగ్
పేపర్ -2: స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్
పేపర్ -3: అడ్వాన్సెడ్ ఆడిటింగ్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్
పేపర్ -4: కార్పొరేట్ అండ్ అల్లయిడ్ లాస్
- పార్ట్ -1,కంపెనీ లాస్
- పార్ట్ -2,అల్లయిడ్ లాస్
గ్రూప్ -2 :
పేపర్ -5: అడ్వాన్సెడ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్
పేపర్ -6: ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కంట్రోల్ అండ్ ఆడిట్
పేపర్ -7: డైరెక్ట్ ట్యాక్స్ లాస్
పేపర్ -8:ఇన్డైరెక్ట్ ట్యాక్స్ లాస్
- పార్ట్ -1, సెంట్రల్ ఎక్సైజ్
- పార్ట్ -2, సర్వీస్ ట్యాక్స్ అండ్ వ్యాట్
- పార్ట్ -3, కస్టమ్స్
విజయసోపానములు
[మార్చు]ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఈ చార్టెర్డ్ అక్కౌంటెన్సీ కోర్సును సులభముగా,నిరాటంకముగా పూర్తిచేయడం ఎలాగో చూద్దాం.ఉద్యోగావకాశాలు కోకొల్లలుగా ఉన్న ఈ రంగంలో స్థిరపడడం గొప్ప అవకాశం.ఇటువంటి అవకాశాన్ని చేజార్చుకుంటే తరువాత బాధపడినా ఏ ప్రయోజనమూ ఉండదు.ఈ కోర్సును దిగ్విజయంగా పూర్తిచేసేందుకు కావాల్సిన పరికరాలు, ఈ క్రింద ఇవ్వడిన ఆంగ్లవాక్యంలో పొందుపరచబడ్డాయి.ఈ వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ పరికరాలను గుర్తించగలము.
- "India will be Successful in becoming a Developed Country if it has Efficient Academics,Researches and Earnest Politicians ".
ఈ వాక్యభావం " భారతదేశం అభివృద్ధిచెందిన దేశంగా మారాలంటే నాణ్యతగలిగిన విద్య,పరిశోధనలు మరియు చిత్తశుద్ధిగల రాజకీయనాయకులు ఉండాలి".
పైన ఇవ్వబడిన ఆంగ్లవాక్యంలోని పెద్ద అక్షరాలు ఒక్కొక్కటి విజయసాధనకు అవసరమయ్యే ఒక్కొక్క లక్షణాన్ని సూచిస్తున్నాయి.అవి ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం.
మొదటిగా, పదం India. పెద్ద అక్షరం I సూచించేది Interest,అనగా ఆసక్తి.ఏ పనిమీద అయినా ఆసక్తి లేకపోతే ఆ పనిని నిర్విరామంగా కొనసాగించలేము.చార్టెర్డ్ అక్కౌంటెన్సీ కోర్సులో విద్యార్థికి సిలబస్ అధికముగా ఉంటుంది కాబట్టి ఆసక్తి తప్పనిసరి.వాస్తవానికి ఏ సబ్జెక్టుకూడా కష్టమూకాదు సులువూకాదు,మనయొక్క ఆసక్తిపై ప్రతీదీ ఆధారపడియుంటుంది.కాబట్టి ఆసక్తి కలిగి ఈ కోర్సులో ముందుకు సాగిపోవాలి.ఒకవేళ ఏ సబ్జెక్ట్ మీదైనా అంతగా ఆసక్తిలేకపోతే అటువంటి సబ్జెక్టులను, ఎక్కువగా ఆసక్తి ఉన్న సబ్జెక్టుల మధ్య చదవడం మంచిది.వీలైనంత వరకు అన్ని సబ్జెక్టులపై ఆసక్తిని,ఇష్టాన్ని పెంచుకోవడం మంచిపద్ధతి .ఆసక్తి ఉంటే అసాధ్యమనేదే లేదు.
రెండవదిగా,పదం Successful. పెద్ద అక్షరం S నాలుగువిషయాలను సూచిస్తుంది,అవి self-confidence,scenario,stoicism,skill అనగా ఆత్మవిశ్వాసం,కార్యాచరణ ప్రణాళిక,స్థితప్రజ్ఞత,నైపుణ్యము.ఈ నాలుగు విషయాలు ప్రతీ విద్యార్థికి అత్యవసరమైనవి.
కొందరు భయంతో మంచి భవిష్యత్తు ఉందని తెలిసినా కొన్ని రంగాలలో ప్రవేశించడానికి వెనుకడుగువేస్తారు.అవి కేవలం అపరిమితజ్ఞానం ఉన్నవారికి మాత్రమే అన్నట్టు ఆలోచిస్తారు.
- "జ్ఞానం అందరికీ సమానమే"
- "జ్ఞానం అందరికీ సమానమే"
ఇటువంటివారు పై వాక్యాన్ని మర్చిపోతారు. తమనుతామే కృంగదీసుకొంటారు.ఈ న్యూనతాభావాన్ని విడిచిపెట్టి ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందడుగు వేయాలి.కష్టపడగలమనే ధైర్యంతో చదవాలి.
విద్యార్థికి కార్యాచరణ ప్రణాళిక ఆవశ్యకమైనది.అందుబాటులో ఉన్న సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ఈ కార్యాచరణ ప్రణాళిక తోడ్పడుతుంది.ఎందుకంటే " సృష్టిలో సమయాన్ని తప్ప దేనినైనా వెనుకకు తీసుకురాగలము " అని ఎందరో మహానుభావులు ఉద్ఘాటించారు.
ఈ ప్రణాళికను రూపొందించుకోవటం మాత్రమేకాక ఆ ప్రణాళికను క్రమంగా ఆచరణలో పెట్టాలి.
సిఎ కోర్సులో పరీక్షలకు సిద్ధపడడానికి సమయం ఉంటుంది కనుక ప్రతీరోజుకీ ప్రణాళికను సిద్ధపరచుకొని ,క్రమం తప్పకుండా ఆ ప్రకారం చదవాలి.దానికి స్థితప్రజ్ఞత అవసరం.
- " ముందుగా నిన్ను నీవు జయించు అప్పుడే నీవు విశ్వాన్ని జయించగలవు" అని స్వామి వివేకానంద పలికారు.
కాబట్టి మనసును అదుపులో ఉంచుకోవాలి.ఇదే ఎందరో విజేతల విజయరహాస్యమని చెప్పవచ్చు.స్థితప్రజ్ఞునిగా మనసును కట్టడిచేస్తూ విజయం వైపు పరుగుపెట్టాలి.
ప్రతీ వ్యక్తి తాను చేసేపనిలో నైపుణ్యాన్ని సంపాదించాలి.ఇది విద్యార్థికి అతిప్రాముఖ్యం.సంభాషణ నైపుణ్యం,తార్కిక నైపుణ్యం విద్యార్థికి అవసరం. అందుకే ఈ కోర్సులో వాటికి ఎంతో గుర్తింపు ఇవ్వబడింది.చురుకుగా అర్థంచేసుకొనే,ఆలోచించే నైపుణ్యాలు కూడా విద్యార్థి అలవరచుకోవాలి.చదువుతున్న సబ్జెక్టును తార్కికంగా ఆలోచించే నైపుణ్యం కలిగియుండాలి. తాను పాఠ్యాంశాలలో చదివిన వాటిని దైనందిన జీవితంలో ఉపయోగించే నైపుణ్యాన్ని ఆర్టికల్ షిప్ ట్రైనింగ్ వ్యవధిలో క్షుణ్ణంగా నేర్చుకోవాలి.
మూడవదిగా,పదం Developed. పెద్ద అక్షరం D రెండువిషయాలను సూచిస్తుంది,అవి Determination,Discipline అనగా పట్టుదల,క్రమశిక్షణ.
పట్టుదల అనేది కార్యసాధకులలో అగుపించే ఆచరణీయగుణం. ఏదైనా పనిని ప్రారంభిస్తే ఆ పనిని ముగించేవరకు పట్టువిడువకూడదు.ఆ పనిలో సఫలీకృతం అవ్వాలి. పట్టుదలతో ఎక్కువగా సాధన చేయాలి.ఉదాహరణకు అంధ విద్యార్థి జగ్గా రాజశేఖర్ రెడ్డి ఈ మధ్యనే సిఎలో మంచి ఉత్తీర్ణతాశాతంతో విజయంసాధించాడు.అతని అంగవైకల్యం అతనిని జయభేరిని ఏమాత్రం కూడా ఆపలేకపోయింది.భావితరాలకు ఆదర్శంగా నిలిచాడు.దానికి అతడు నమ్మిన సిద్ధాంతం ఒక్కటే " పట్టుదలకు మించిన ఆయుధం వేరొకటి లేదు ."
- "క్రమశిక్షణలేని విద్యార్థి వాసనలేని పువ్వు వంటివాడు "
- "క్రమశిక్షణలేని విద్యార్థి వాసనలేని పువ్వు వంటివాడు "
క్రమశిక్షణ లేకుండా ప్రవర్తిస్తున్న విద్యార్థి వాసనలేని పువ్వుతో సమానం.సాధారణంగా పువ్వులు పరిమళాలను వెదజల్లుతూ, ఆహ్లాదంగా, ఆకర్షణీయంగా ఉంటాయి .కాని వాసనలేని పువ్వు దీనికి విరుద్ధం.అలాగే క్రమశిక్షణలేని విద్యార్థి కూడా నిరుపయోగంగా మారతాడు.క్రమశిక్షణ ఉన్నవాడే విద్యను సంపాదించగలడు.
నాల్గవదిగా,పదం Country. పెద్ద అక్షరం C సూచించేది Concentration,అనగా ఏకాగ్రత.విద్యార్థికి ఏకాగ్రత లేకపోతే చదువుతున్నది ఏమీ సరిగా అర్థంకాదు,అంతేగాకుండా సమయం వ్యర్థమౌతుంది.కొన్ని గంటలపాటు ఏకాగ్రతతో చదివేవాడిగా ఉండాలి.మనం చదువుతున్నప్పుడు మన చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదంగా ఉండాలి.అప్పుడు మరింత ఏకాగ్రతతో చదవడానికి వీలుపడుతుంది.దీనినే కార్టెక్స్ ఎఫెక్ట్ అంటారు.ఈ విషయాన్ని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు గమనించాలి.
అయిదవదిగా,పదం Efficient.పెద్ద అక్షరం E సూచించేది Efficiency,అనగా అందుబాటులో ఉన్న వనరులను సరియైనవిధముగా ఉపయోగించుకొనుట.మనం చేసే ప్రతీ పనిలో మనకంటూ ప్రత్యేకతను సంతరించుకోవాలంటే ఆ పని నాణ్యతతో కూడినదిగా ఉండాలి.అందుబాటులో ఉన్న పుస్తకాలను,విద్యావంతులను,అధ్యాపకులను మరియు మనకున్న సమయాన్ని సరియైన విధంగా వినియోగించడంలో ఈ నాణ్యత బయటపడుతుంది.
ఆరవదిగా,పదం Academics.పెద్ద అక్షరం A సూచించేది Abnegate,అనగా పరిత్యజించటం.కొన్ని కావాలనుకుంటే కొన్ని వదులుకోవాలి ,ఇది జగమెరిగిన సత్యం. ఎంతో విలువైన ఈ రంగంలో ప్రావీణ్యత సాధించాలంటే కొన్నింటిని పరిత్యజించాలి.దూరదర్శిని దగ్గర గంటలపాటు గడపడం,అంతర్జాలంలో సమయాన్ని వ్యర్థంగా వెచ్చించడం మొదలగునవి.ఇంకా చెప్పాలంటే అనవసరంగా కాలయాపన చేయడం, సోమరిగా ఉండి చేయాల్సినపనులను వాయిదావేయటం మొదలైన వాటిని విడిచిపెట్టి ముందుకు కొనసాగాలి.అనవసరమైన విషయాలు పట్టించుకోకూడదు.
ఏడవదిగా,పదం Researches.పెద్ద అక్షరం R సూచించేది Ruminate,అనగా నెమరువేయు.పాఠ్యాంశాలను చదివిన తరువాత వాటిని నెమరువేయటం చాలా లాభకరమైనది.ఆ విధంగా చేస్తే చదివినవి ఎప్పటీకీ కూడా మరచిపోకుండా జ్ఞాపకముంచుకొనే అవకాశం మెండుగా ఉంటుంది.చదివిన ప్రతీసారి కొంతసేపు ఆగి రివిజన్ చేయాలి.కష్టమైన సబ్జెక్ట్స్ రెండుమూడు సార్లు రివిజన్ చేయాలి.తద్వారా పరీక్షలలో మన ప్రదర్శన మెరుగుగా ఉంటుంది.
ఎనిమిదవగా,పదం Earnest,అనగా చిత్తశుద్ధి.
శ్రద్ధకలిగిన వ్యక్తికి జ్ఞానం తప్పక లభ్యమౌతుంది.అందుకే విద్యార్థికి చిత్తశుద్ధి ప్రాముఖ్యమైనది. నిజాయితీ ,నమ్మకత్వం మరియు చిత్తశుద్ధి మనంచేసే ప్రతీ పనిలో కనబడాలి.
తొమ్మిదవగా,పదం Politicians,పెద్ద అక్షరం P మూడువిషయాలను సూచిస్తుంది,అవి Persevere,Punctuality,Patience అనగా శ్రమించి సాధించు,నిర్ణీతకాలమందైన వేళను పాటించుట,సహనం.
- "కృషితో నాస్తి దుర్భిక్షం "
- "కృషితో నాస్తి దుర్భిక్షం "
శ్రమించి సాధించడం విజేతల లక్షణం. కష్టపడే గుణం ప్రతీ విద్యార్థి కూడా అలవరచుకోవాలి.తమిళనాడుకు చెందిన ప్రేమా విజయకుమార్ అనే యువతి ఎన్నో ఇబ్బందులను అధిగమించి సిఎ టాపర్ గా నిలిచింది.ఆమె తండ్రి ఆటో నడిపే ఒక సాధారణవ్యక్తి. ఈ యువతి తన తండ్రి కష్టాన్ని,ప్రేమను దృష్టిలో పెట్టుకొని కష్టపడి చదివి(Hard work) అత్యున్నత శిఖరాలను అధిరోహించింది.
సమయపాలన అనేది విలువైనది.కాబట్టి ప్రతీ విషయంలో సమయాన్ని తప్పకుండా పాటించాలి.
గొప్ప గొప్ప ఆశయాలు కలిగియున్న ప్రతీ వ్యక్తికీ కూడా సహనం అవసరం.ఒక్కొక్క మారు మన అంచనాలు తారుమారు అవుతాయి.వైఫల్యాలను చవిచూస్తాం.నిరాశ ఎదురవుతుంది.అటువంటి సమయాలలో మనం కృంగిపోకుండా విజయావకాశాలవైపు నడిపించేది సహనం.చాలా విస్తృతంగా ఉన్న సిలబస్ ను పూర్తిచేయాలంటే సహనం కాస్త ఎక్కువగానే ఉండాలి.
చార్టెర్డ్ అక్కౌంటెన్సీ పరీక్షలను ఎదుర్కోవటం ఎలా?
[మార్చు]ముఖ్యంగా చార్టెర్డ్ అక్కౌంటెన్సీకి సంబంధించిన పరీక్షలు వ్రాసే సమయంలో మన యొక్క వైఖరి ,మన ఫలితాలపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది అనడంలో ఏ సందేహం లేదు.కాబట్టి పరీక్షలకు ముందు ,పరీక్షలు జరిగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
పరీక్షలకు ముందుపాటించవలిసిన జాగ్రత్తలు
[మార్చు]1.ఆహారపానీయాల విషయంలో జాగ్రత్త పాటించాలి.
2.నిద్రను నిర్లక్ష్యం చేయకూడదు.సమయానికి నిద్రపోవాలి.
"Early to bed and early to rise makes a man healthy,wealthy and wise" అని బెంజమిన్ ఫ్రాంక్లిన్ అన్నాడు.
3.తెల్లవారుజామున 4 గంటల సమయాన్ని బ్రహ్మ సమయం అంటారు. ఆ సమయంలో స్నానం చేసి చదివితే బాగా గుర్తుంటాయి.
4.ఒక సబ్జెక్టు నుంచి మరో దానిలోకి ప్రవేశించే ముందు, గంట తర్వాత కనీసం 5 నిమిషాలు విశ్రాంతి ఇవ్వాలి. దానినే మైండ్ హాలిడే అంటారు. ఆ సమయంలో టీవీ చూడటం, కబుర్లు చెప్పుకోవడం చేయరాదు. కళ్లు మీద తడి వస్త్రం వేసుకుని తల వెనక్కి వాల్చి చదివింది గుర్తుచేసుకోవాలి.
5.పరీక్షల ముందు ఇచ్చే సెలవుల్లో మధ్యాహ్నం 2 గంటలపాటు నిద్రపోండి. మళ్లీ లేచి స్నానం చేసి చదవండి. అప్పుడు ఉదయం మాదిరిగా క్రియాశీలకంగా, ప్రశాంతంగా ఉంటారు. దీన్నే ఒకరోజు- రెండు ఉదయాలు టెక్నిక్ అంటారు.
6.ప్రతిరోజూ ఒకే సమయానికి చదువు ప్రారంభించి ఒకే సమయానికి నిద్రపోయే విద్యార్థి సగం విజయం సాధించినట్లే. అదేవిధంగా ఏ సబ్జెక్టు ఎంత సేపు చదవాలో ముందే నిర్ణయించుకోవాలి.
7.సందేహాలను వెంటనే నివృత్తి చేసుకోవాలి.
8.ప్రతీ సబ్జెక్టును అర్థంచేసుకొని కాన్సెప్ట్ ఆధారంగా చదవాలి.
9.ప్రాక్టీస్ టెస్టులు ఎక్కువగా వ్రాయాలి.
పరీక్షలు జరిగేటప్పుడు పాటించవలిసిన జాగ్రత్తలు
[మార్చు]1.పరీక్ష జరిగే స్థలానికి కనీసం 30 నిమిషాలముందు చేరుకోవాలి.
2.పరీక్ష ముందు రెండుమూడు నిమిషాలు కళ్ళు మూసుకొని గుండెల నిండా ఊపిరి పీల్చుకొని నెమ్మదిగా వదలాలి.దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది.
3.పరీక్షహాల్లోకి వెళ్లే ముందు కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకోవటం మంచిది . అప్పుడు మనస్సు నిర్మలంగా మారుతుంది.
4.అడిగిన మేరకు మీ యొక్క వ్యక్తిగత వివరాలు స్పష్టంగా తెలియజేయండి.
5.పరీక్ష పేపరును పూర్తిగా ఒకసారి చదవండి.
6.ముందుగా మీకు తెలిసిన ప్రశ్నలకు సమాధానమివ్వండి.
7.పరీక్షలో సమాధానాలు గుర్తించేటప్పుడు పొరపాట్లు చేయకూడదు.
8.నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి తెలియనివి వదిలేయటం మంచిది.
9.పరీక్షవ్రాసేటప్పుడు సమయాన్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి.
ముగింపు
[మార్చు]ఒకచో నేలను బవ్వళించు, నొకచోనొప్పారు బూసెజ్జపై,
నొకచో శాకము లారగించు, నొకచోనుత్కృష్టశాల్యోదనం,
బొకచో బొంత ధరించు,నొక్కొకతరిన్ యోగ్యాంబరశ్రేణి,లె
క్కకు రానీయడు కార్యసాధకుడు దుఖంబున్ సుఖంబున్ మదిన్
పై పద్యంలో భర్తృహరి కార్యసాధకుని లక్షణాలు తెలియజేస్తున్నాడు.తాను సాధించాలనుకున్న దానిని సాధించడానికి ఎన్ని ఇబ్బందులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాడు.తప్పకుండా అసాధ్యమనుకున్న దానిని సుసాధ్యం చేసి తన ఖ్యాతిని వెల్లడిపరుస్తాడు.అలాగే మహత్తరమైన ఈ చార్టెర్డ్ అక్కౌంటెన్సీ రంగాన్ని ఎన్నుకున్న ప్రతీ విద్యార్థి, తనలో దాగియున్న కార్యసాధక గుణాలను వెలికితీస్తే తప్పక విజయం సాధించగలడని తెలియజేస్తున్నాను.
ఇవి కూడా చూడండి
[మార్చు]My Details:
Name:Vijay Prakash Kondeti
Eduacational Information:
- Id.No.N100141,
- B.tech 2nd Year,
- Civil Dept.,
- AP IIIT Nuzvid,Krishna Dist.