వామన చరిత్రము
వామన చరిత్రము వ్యాసమహర్షి రచించిన భాగవతంలోని ఘట్టం. దశావతారాలలో ఒకడైన వామనుడి చరిత్రము ఇది. వామనుడు అదితి కి పుత్రునిగా జన్మించి, బలి చక్రవర్తి దగ్గరనుండి మూడు అడుగుల నేల అడిగి త్రివిక్రముడై మొత్తం జగత్తునంతా రెండు అడుగులతో, మిగిలిన ఒక అడుగుతో బలి చక్రవర్తిని పాతాళానికి పంపించి అక్కడ రాజుని చేసి తానే స్వయంగా వరాహ రూపంలో ఆ రాజ్యానికి కాపలాగా మారతాడు. వ్యాస భాగవతంలోని ఘట్టం మూలమైనా తెలుగు వారిలో పోతన శ్రీమదాంధ్ర భాగవతంలోని వామన చరిత్రమే సుప్రసిద్ధం. తెలుగువారి పఠన సంప్రదాయాలలో వామనచరిత్రము ప్రాచుర్యాన్ని తెలిపేలా వ్రాతప్రతులు, తాళపత్రగ్రంథాల్లోనే కాక ముద్రణ ప్రతుల్లో కూడా పోతన భాగవతంలో పూర్తిగా కాక విడిగా ఈ ఘట్టం ప్రాచుర్యంలో ఉంది.
రచన నేపథ్యం
[మార్చు]వామన చరిత్రము తెలుగులో పోతనామాత్యుడు రచించిన ఆంధ్ర భాగవతం అష్టమ స్కంధంలోనిది. సంస్కృతంలోని వ్యాసుని భాగవతాన్ని ఆధారం చేసుకుని రచించినందున ఈ ఘట్టానికి మూలం వ్యాసభాగవతంలో ఎనిమిదవస్కంధంలోనే ఉంది. ఆంధ్రీకరణలో స్వతంత్రత స్వీకరించడంతో పోతన భాగవతంలోని ఈ ఘట్టంలో మూలంలో లేని అనేక వర్ణనలు, ఊహలు కనిపిస్తాయి.
కథ
[మార్చు]బలి చక్రవర్తి విజృంభణ
[మార్చు]దేవాసుర యుద్ధంలో ఇంద్రునితో ఓడి పోయిన బలి, రాక్షస గురువైన శుక్రాచార్యుల దయ వలన బ్రతికి, గురూపదేశంతో విశ్వజిత్‌యాగం చేసి బంగారు రథము, మహాశక్తివంతమైన ధనుస్సు, అక్షయతూణీరములు, కవచము, శంఖములు పొందాడు. బలగర్వితుడై ఇంద్రుని మదమణిచేందుకు, రాక్షసులనందరినీ ఒకచోటచేర్చి, యుద్ధమునకు సంసిద్ధం చేసి అమరావతిపై దండెత్తాడు. ఆ దుర్భర దానవ శంఖా విర్భూత ధ్వనులు నిండి, విభుదేంద్ర వధూగర్భములు పగిలి, లోపలి శిశువులు ఆవురని ఆక్రోశిస్తూండగా, దేవతలు బృహస్పతి మాట విని అమరావతి వీడి పారిపోయారు.
వామన జననం
[మార్చు]దేవతల దుస్థితిని చూసి, సురమాత అదితి, తన భర్తయైన కశ్యపబ్రహ్మను వేడుకున్నది. అంతట కశ్యపుడు అదితికి పయోభక్షణ వ్రతాన్ని ఉపదేశించాడు. ఆమె ఫాల్గుణ మాసం, శుక్లపక్ష పాడ్యమి నుంచి 12 రోజులు హరిసమర్పణంగా వ్రతం చేసి భర్తను చేరగా, భగవదంశతో, శ్రావణ ద్వాదశి నాడు శ్రోణ అభిజిత్ సంజ్ఞాత లగ్నంలో, రవి మధ్యాహ్నమున చరించునప్పుడు, గ్రహ తారా చంద్ర భద్రస్థితిలో వామనుడు జన్మించాడు.
ప్రచురణలు
[మార్చు]వామన చరిత్రమును టీకా తాత్పర్య సహితంగా భాగవతుల నృసింహశర్మ గారు 1943 లో వేగుచుక్క గ్రంథమాల ద్వారా ప్రచురించారు.[1]