వికీపీడియా:అనువాద పరికరం - తరచూ వచ్చే సందేహాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అనువాద పరికరం గురించి వచ్చే కొన్ని సామాన్య సందేహాలకు సమాధానాలు ఈ పేజీలో దొరకవచ్చు. మీ సందేహానికి సమాధానం ఇక్కడ దొరక్కపోతే దీని చర్చ పేజీలో రాయండి. అనుభవజ్ఞులు సమాధానాలు ఇస్తారు.

ఏంటదీ.. అనువాద పరికరమా?

[మార్చు]
అనువాద పరికరమా? అట్టాంటిది ఒకటుందా?
అవును. అనువాదాలు చేసేందుకు వీలు కల్పించే పరికరం అది. దాని లింకు ఇది: https://te.wikipedia.org/wiki/Special:ContentTranslation
అనువాద పరికరంతో పని పెద్ద తల్నెప్పి వ్యవహారం లాగా ఉన్నట్టుంది, మనకెందుకులే.
అనువాద పరికరం తలనెప్పి కాదు సరిగదా, కొన్ని తల్నెప్పుల్ని తీసేస్తుంది. ఆ వివరాలు కావాలంటే ఈ పేజీ మొత్తం చూడండి.
అందులో యంత్రం అనువాదం చేస్తుంది. దాన్ని మనం సరిదిద్దాలి. ఈ తలనెప్పి ఎందుకూ.. మనమే నేరుగా చేసుకుంటే పోలా?
అదుగో అదే మరి అపోహంటే! అనువాద పరికరంలో యంత్రానువాదం చేసి తీరాల్సిందే అనే రూలేమీ లేదు. మొత్తం యత్రాలన్నిటినీ పక్కన పడేసి, మీరే నేరుగా అనువదించుకోవచ్చు.
నేనే స్వయంగా అనువదించుకునే కాడికి ఈ పరికరం ఎందుకంట!?
ఎందుకంటే..
  • ఎందుకంటే.. వికీలింకులను అదే ఇస్తుంది. ఎర్రలింకులను తయారుచెయ్యదు. మీరు నేరుగ ప్రచురిస్తే ఎర్రలింకులు బోలెడుంటాయి. వాటిని మీరు సవరించుకోవాలి.
  • ఎందుకంటే.. భాషాంతర లింకులను అదే ఇచ్చేస్తుంది. అంటే వికీడేటా లింకు కూడా దానంతటదే ఏర్పడిపోతుందన్నమాట!
  • ఎందుకంటే.. మూసలను కూడా అదే తెస్తుంది. మీరు తేనక్కర్లేదు.
  • ఎందుకంటే.. వర్గాలను కూడా అదే చేరుస్తుంది. మీరు తేనక్కర్లేదు.
  • ఎందుకంటే.. వాడిచూడండి. వాడితే మరిని తెలుస్తాయి. ఇంకా బాగా తెలుస్తాయి
నేరుగా చేసుకుంటే కొంచెం కొంచెం తీరుబాటుగా అనువదించుకోవచ్చు, ప్రచురించుకోవచ్చు. పరికరంలో అది కుదర్దు
ఎవరా మాట చెప్పింది? తప్పు, తప్పు, తప్పది. బ్రహ్మాండంగా కుదురుతుంది.
  • పేజీ మొత్తాన్ని ప్రచురిస్తారా.. సరే!
  • ఒక విభాగాన్నే ప్రచురిస్తారా..స్సరే!
  • ఒక పేరాయే ప్రచురిస్తారా.. ఓకే!
  • ఒక వాక్యమే ప్రచురిస్తారా.. వాకే!
  • ఒక్క పదాన్ని మాత్రమే ప్రచురిస్తారా.. తెలీదు. ప్రయత్నించి మీరే చెప్పండి.
అంతేకాదు, ప్రచురణలు ఎన్నిసార్లైనా చెయ్యొచ్చు. పది పదిహేనుసార్లు కొంచెం కొంచెం ప్రచురించుకుంటూ పోవచ్చు. ఎలాగైనా చెయ్యొచ్చు.

అనువాద పరికరాన్ని ఎలా వాడాలి?

[మార్చు]
  1. తెలుగు వికీపీడియాలో ప్రతి పేజీలోను పైన కుడి మూలన ఉండే వాడుకరి లింకుల్లో "అనువాదాలు" అనే లింకు ఉంటుంది. దాన్ని నొక్కండి. అప్పుడు అనువాద పరికరం డ్యాష్‌బోర్డుకు వెళ్తారు
  2. ఆ పేజీలో "కొత్త అనువాదం" అనే లింకు నొక్కండి.
  3. అప్పుడు వచ్చే పేజీలో మూలం భాషను ఎంచుకుని అనువదించలచిన పేజీ పేరును ఇవ్వండి
  4. అనువాదం ఏ భాష లోకి చెయ్యబోతున్నారో దాన్ని (తెలుగును) ఎంచుకోండి.
  5. ఇక "అనువాదం మొదలుపెట్టండి" బొత్తాన్ని నొక్కండి. అప్పుడు అనువాదం పేజీ తెరుచుకుంటుంది.
  6. అనువాదం ప్యానెల్‌లో ఎడమ సగంలో మూలం పేజీ లోని పెరాగ్రాఫులన్నిటినీ ఒకదాని కింద ఒకటి చూపిస్తుంది. కుడి సగం, అనువాదం చెయ్యడానికి సిద్ధంగా ఖాళీగా ఉంటుంది. మీరు ఏ పేరానైనా అనువాదం చెయ్యవచ్చు. ఎన్ని పేరాలనైనా అనువదించవచ్చు. అన్నీ చెయ్యాలనే నిబంధనేమీ లేదు.
  7. ఏ పేరాను అనువదించదలచారో ఆ పేరుకు ఎదురుగా కుడివైపున ఉన్న ఖాళీలో క్లిక్కు చెయ్యండి. వెంటనే యాంత్రిక అనువాదం ఆ ఖాళీలో ప్రత్యక్షమౌతుంది. ఈ అనువాదాన్ని మీరు సరిదిద్దవచ్చు.
  8. ఆ అనువాదాన్ని సరిదిద్ది సహజంగా ఉండేలా తీర్చిదిద్దండి.
  9. అయ్యాక, ఇంకో పేరాను ఎంచుకోండి. దాన్ని కూడా అలాగే సరిదిద్దండి. అలా మీరు చెయ్యదలచిన పేరాలను అనువదించండి
  10. మీరు అనువాదం చేస్తూ ఉంటే పరికరం ఎప్పటికప్పుడు దాన్ని భద్రపరుస్తూ ఉంటుంది.
  11. ఇక ప్రచురించవచ్చు అని మీరు భావించినపుడు అనువాదం పేజీలో పైన ఉన్న "ప్రచురించు" బొత్తాన్ని నొక్కండి.


ప్రాథమికం

[మార్చు]
నేను వికీపీడియాకు కొత్త, అయినా పరికరం వాడొచ్చా?
వాడొచ్చు. అనువాద పరికరం వాడాలంటే కనీస అనుభవం అంటూ పరిమితి ఏమీ లేదు. అయితే వికీ పద్ధతుల గురించి తెలుసుకునేందుకు కొన్నాళ్ళు నేరుగా దిద్దుబాట్లు చేస్తే మంచిది.
అనువాద పరికరాన్ని ఎవరైనా వాడవచ్చా?
వాడొచ్చు. కానీ లాగినై ఉన్న వాడుకరులందరికీ ఈ పరికరం అందుబాటులో ఉంటుంది. లాగినవని వాళ్ళు దీన్ని వాడలేరు
అనువాద పరికరం ఎక్కడ ఉంది? ఆ పేజీకి ఎలా వెళ్ళాలి?
తెలుగు వికీపీడియాలో ప్రతి పేజీకి పైన కుడి మూలన ఉండే వాడుకరి లింకుల్లో "అనువాదాలు" అనే లింకు ఉంటుంది. దాన్ని నొక్కితె అనువాద పరికరం పేజీకి వెళ్తారు.
నేను నేరుగా అనువాదం చెయ్యగలను, మరి నాకు ఈ పరికరంతో పనేంటి?
ఈ పరికరం మీ పనిని కొంత సులభతరం చేస్తుంది. యంత్రం ద్వారా చేసే ఈ అనువాదం కొంతవరకు బాగానే ఉంటుంది. దాన్ని సరిచేసి ప్రచురించవచ్చు. తొందరగా అయిపోతుంది. దాని వలన కింది ఉపయోగాలున్నాయి.
  • యంత్రం చాలా వేగంగా అనువదిస్తుంది. అనువాద పరికరం వాడితే, మీరు మరింత వేగంగా అనువాదాలు చెయ్యవచ్చు.
  • మూలం పేజీకి సంబంధించిన పేజీ తెలుగులో ఈసరికే ఉంటే, పరికరం అది చూపిస్తుంది.
  • మూలం లోని మూసలు అనువాదం లోకి కూడా వస్తాయి
  • మూలంలో ఉన్న వికీలింకులు అనువాదం లోకి కూడా వస్తాయి. ఒకవేళ లింకు లక్ష్యం పేజీ తెవికీలో లేకపోతే, ఆ లింకులు రావు. ఆ విధంగా ఎర్రలింకులు ఏర్పడకుండా ఉంటాయి
  • మూలంలో ఉన్న వర్గాలు తెవికీలో కూడా ఉంటే అవి ఆటోమాటిగ్గా అనువాదం లోకి వచ్చేస్తాయి.
  • మూలంలో ఉన్న పట్టికలు అనువాదం లోకి వచ్చేస్తాయి, పట్టిక లోని సమాచారం అనువాదమౌతుంది.

యంత్రం వలన ఒకే ఒక్క ఇబ్బంది ఉంది -అసహజమైన భాష. అయితే ఆ అనువాదాన్ని సవరించడం తేలిగ్గానే అయిపోతుంది. మీకు నేరుగా అనువాదం చేసే నేర్పు ఉంది కాబట్టి ఇది మరింత తేలిక.

పరికరంతో కొత్త పేజీలను సృష్టించవచ్చా?
భేషుగ్గా సృష్టించవచ్చు. అనువాదం చేసాక, దోషాలను సవరించాక ఇక ప్రచురించవచ్చు అని భావించినపుడు పరికరంలో పైనున్న "ప్రచురించు" నొక్కండి. నేరుగా కొత్త పేజీని సృష్టించేసి అందులో ప్రచురించేస్తుంది.
నేను సృష్టించదలచిన పేజీ ఈసరికే అదే పేరుతో ఉంది, నేను చూసుకోలేదు. ఇప్పుడు ప్రచురిస్తే ఏం జరుగుతుంది?
  • అలా ఈసరికే పేజీ ఉనికిలో ఉంటే, అనువాదం మొదలుపెట్టే ముందే పరికరం మీకు ఆ సంగతి చెబుతుంది.
  • చెప్పలేదు అంటే, ఆ పేజీకి భాషాంతర లింకులు లేవని అర్థం
  • అలాంటి సందర్భంలో, ప్రచురించే ముందు - "సరిగ్గా ఇదే పేరుతో వికీలో ఒక పేజీ ఉనికిలో ఉంది. దాన్ని ఓవర్‌రైటు చేస్తారా?" అని అడుగుతుంది. మీరు సరేనంటేనే ఆ పేజీపై ఓవర్‌రైటు చేస్తుంది.
  • ఒకవేళ ఖచ్చితంగా ఇదే పేరుతో కాకుండా వేరే పేరుతో పేజీ ఉంటే, పట్టించుకోదు. "ప్రచురించు" నొక్కగానే ప్రచురించేస్తుంది.
నేను అనువాదం చెయ్యదలచిన పేజీ ఈసరికే ఉంది. కానీ అందులో సమాచారం పెద్దగా లేదు. నేను అనువదించి ప్రచురించవచ్చా
ప్రచురించవచ్చు. దీనికి రెండు పద్ధతులున్నాయి.
1. అనువదించిన తరువాత "ప్రచురించు" నొక్కి నేరుగా ప్రచురించెయ్యడం. ఇలా చేసినపుడు, ఈ సరికే పేజీలో ఉన్న సమాచారం అంతా పోయి, దాని స్థానంలో మీరు అనువదించిన కొత్త సమాచారం చేరుతుంది. పేజీలో ఉన్న సమాచారాన్ని పోఉకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీకుంది.
2. రెండో పద్ధతిలో అవసరమైన సమాచారాన్ని అనువాదపరికరం నుండి కాపీ చేసుకుని పేజీలో పేస్టు చెయ్యడం. దీనిద్వారా పేజీలో ఈసరికే ఉన్న సమాచారం పోకుండా ఉంటుంది.
పై రెండు సందర్భాల్లోనూ పేజీ చరిత్ర చెక్కుచెదరకుండా అలాగే ఉంటుంది.
ఈసరికే ఉన్న పేజీని ఓవర్‌రైటు చేస్తే పేజీ సృష్టికర్తగా నా పేరు వస్తుందా?
భయపడకండి. అంత పని జరగదు. ఒరిజినల్ సృష్టికర్త పేరు అలాగే ఉంటుంది. పేజీ చరిత్రకు వచ్చే ఢోకా ఏమీ ఉండదు. కాబట్టి నిస్సంకోచంగా అనువదించండి. కానీ ఓవర్‌రైటు చేసేముందు పేజీలో ఉన్న సమాచారం పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే.
ఓవర్‌రైటు చేసేప్పుడు పాత సమాచారం పోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి?
దానికి రెండు పద్ధతులున్నాయి.
1. మీరు ప్రచురించబోయ్తే అనువాదంలో, పేజీలో ఉన్న పాత సమాచారం కూడా ఉందని నిర్థారించుకోవడం
2. పేజీలోని పాత సమాచారాన్ని కాపీ చేసుకుని, మీ అనువాదాన్ని ప్రచురించాక, మళ్ళీ ఆ పాత సమాచారాన్ని చేర్చడం.
అన్నిటికంటే ఉత్తమమైన పద్ధతి - అనువాద పరికరం నుండి ఒక్కో పేరానే కాపీ చేసుకుని పేజీలో పేస్టు చేసుకుంటూ పోవడం.
అనువాదం ఏకబిగిన చేసేసి, వెంటనే ప్రచురించాలా?
అక్కర్లేదు. తీరుబడిగా చేసుకోవచ్చు. కొంత అనువాదం చేసాక దాన్ని భద్ర పరచుకుని, మళ్ళీ కొంత కాలం తరువాత మరి కొంత చేసుకుని.. ఇలా ఎన్ని సార్లైనా, ఎన్ని రోజుల పాటైనా చేసుకోవచ్చు. ఆ తరువాత ప్రచురించుకోవచ్చు. ఒకే ఒక్క నియమం - ఒక సంవత్సరం కంటే ఎక్కువ రోజులు మీ అనువాదం పేరికరంలో ఉంటే పరికరం దాన్ని తీసేస్తుంది. అయితే, ముందు మీకు హెచ్చరికలు పంపిస్తుంది.
నేను కొంత అనువాదం చేసి ప్రచురించాను. అదే పేజీని ఇంకాస్త అనువదించి ప్రచురించవచ్చా?
అలా చెయ్యవచ్చు. ఒకే పేజీని ఎన్నిసార్లైనా ప్రచురించవచ్చు. ప్రచురించే ముందు ఆ పేజీలో ఉన్న సమాచారం మొత్తం - సంపూర్ణంగా- పోయి, మీరు ప్రచురించిన సమాచారం వస్తుందని గమనంలో ఉంచుకోవాలి.

అనువాద నాణ్యత

[మార్చు]
అనువాద పరికరం చేసే యాంత్రిక అనువాదం నాణ్యత ఎలా ఉంటుంది?
యాంత్రికానువాదం నాణ్యత ఒక మాదిరిగా ఉంటుంది. మానవికంగా కొన్ని సవరణలు చేస్తే తప్ప ప్రచురించలేని విధంగా ఉంటుంది.
అనువాద పరికరంలో మానవికంగా చెయ్యాల్సిన భాషా సవరణలు ఎలా ఉంటాయి?
అనువాద పరికరం చేసే యాంత్రిక అనువాదంలో భాష సహజంగా ఉండదు. కింది దోషాలు ఉంటూంటాయి:
  • ఇంగ్లీషులో and ఉన్నచోటల్లా "మరియు" ను, "of" ఉన్నచోటల్లా "యొక్క"ను వాడుతుంది. గతంలో కంటే ప్రస్తుతం ఇవి కొద్దిగా తగ్గాయి కానీ ఇంకా బాగా తరచుగానే ఉంటున్నాయి. వాటిని సవరించాలి.
  • ఇంగ్లీషులో ఉండే కర్మణి వాక్యాలను (పాసివ్ వాయిస్) తెలుగు లోకి కూడా అలాగే అనువదిస్తుంది. అది తెలుగు సహజం కాదు. వాటిని కూడా సవరించాలి.
  • ఇంగ్లీషులో నిర్జీవ వస్తువులకు కర్తృత్వాన్ని ఆపాదించి రాయడం ఎక్కువగా ఉంటుంది. తెలుగులో అది అంత ఎక్కువగా వాడరు. కానీ పరికరం తెలుగులోకి అలాగే అనువదిస్తుంది. ఉదాహరణకు ఇంగ్లీషులో The cyclone killed 120 people అనే వాక్యాన్ని పరికరం "తుఫాను 120 మందిని చంపింది" అని అనువదిస్తుంది. "ఆ తుఫానులో 120 మంది మరణించారు" అనేది సహజమైన అనువాదం. ఇలాంటి తప్పులను సవరించాలి.
  • కొన్నిసార్లు మూలం లోని వాక్యాలు దోషభూయిష్టంగా ఉంటాయి. వాటికి యంత్రం చేసే అనువాదం కూడా అలాగే దోషపూరితంగా ఉంటుంది. ఉదాహరణకు-
    • "This is also the ground where Sourav Ganguly and Sachin Tendulkar most successful opening pair for India in ODIs opened the innings for the first time" అనే వాక్యాన్ని పరికరం "సౌరవ్ గంగూలీ మరియు సచిన్ టెండూల్కర్ వన్డేల్లో భారత్‌కు అత్యంత విజయవంతమైన ఓపెనింగ్ జోడీ తొలిసారి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన మైదానం కూడా ఇదే" అని అనువదిస్తుంది. కానీ "వన్డేల్లో భారత్‌కు అత్యంత విజయవంతమైన ఓపెనింగ్ జోడీ అయిన సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్‌లు తొలిసారి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన మైదానం కూడా ఇదే" అనేది మెరుగ్గా ఉంటుంది.
    • ఇదే మూల వాక్యాన్ని కొంచెం మార్చి "This is also the ground where Sourav Ganguly and Sachin Tendulkar, the most successful opening pair for India in ODIs, opened the innings for the first time." అని రాస్తే ఆవాక్యానికి యంత్రం చేసే అనువాదం కూడా మెరుగ్గా ఉంటుంది, ఇలా "వన్డేల్లో భారత్‌కు అత్యంత విజయవంతమైన ఓపెనింగ్ జోడీ సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్ తొలిసారి ఇన్నింగ్స్ ప్రారంభించిన మైదానం కూడా ఇదే." అయితే దీనిలో కొద్ది సవరణలు చేస్తే మరింత మెరుగ్గా ఉంటుంది ఇలా "వన్డేల్లో భారత్‌కు అత్యంత విజయవంతమైన ఓపెనింగ్ జోడీ అయిన సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్‌లు తొలిసారి ఇన్నింగ్స్ ప్రారంభించిన మైదానం కూడా ఇదే."
  • తేదీలను అనువాద పరికరం తప్పుగా అనువదిస్తుంది. తేదీ ఆకృతి, నెలల పేర్లు లోనూ తెవికీకి అనుగుణంగా ఉండవు.
    • తెవికీలో తేదీ ఆకృతి "2023 మార్చి 14" లాగా ఉండాలి. పరికరం "14 మార్చ్ 2023" అని రాస్తుంది.
    • నెలల పేర్లు మార్చ్, జులై, ఆగస్ట్/ఆగష్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అని రాస్తుంది. తెవికీ నియమం ప్రకారం ఇవి మార్చి, జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు అని ఉండాలి.
పై రెంటినీ సవరించాలి
  • BC/BCE, AD/CE లను అనువాద పరికరం క్రీస్తు పూర్వం/క్రీ.పూ, క్రీస్తు శకం/క్రీ.శ అని అనువదిస్తుంది. అందులో దోషమేమీ లేదు. కానీ వీటిని సంవత్సరం తరువాత - అంటే 230 క్రీ.పూ, 1234 క్రీ.శ అని రాస్తుంది. తెలుగులో వాటిని క్రీ.పూ 230, క్రీ.శ 1234 అని రాయడం సంప్రదాయం.
  • కొన్ని ఇంగ్లీషు పదాలకు రెండు మూడు వేరువేరు అర్థాలుండే అవకాశముంటుంది. అప్పుడు పరికరం తనకు తోచిన అర్థాన్ని తీసుకుంటుంది. ఈ దోషాలు అన్నివేళలా జరగవు, అప్పుడప్పుడూ చేస్తుంది. వాడుకరి గమనించుకుంటూ ఉండాలి. ఉదాహరణకు
    • wear అనే మాటకు ధరించు అని అరిగిపోవు అని రెండు అర్థాలుంటై. wear and tear అనే మాటను యంత్రం ధరించడం మరియు చినిగిపోవడం అని అనువదించే అవకాశం ఉంది
    • list of centuries అనే పదబంధం క్రికెట్ పేజీల్లో వస్తే దానికి "శతకాల జాబితా" అని అర్థం. యంత్రం దాన్ని "శతాబ్దాల జాబితా" అని అనువదిస్తూంటుంది

మరియు, మానవిక అనువాదం

[మార్చు]
ప్రచురించే ముందు ఏవో అలర్టులు చూపిస్తోంది, ఏం చెయ్యాలి?
మామూలుగా ఉండే సమస్యల విషయంలో అలర్టు చూపించి, అయినా ప్రచురించెయ్యమంటారా అని అడుగుతుంది. అలాంటపుడు ప్రచురించమని చెప్పవచ్చు. కానీ కింది అలర్టుల విషయంలో, వాటిని సరిచేసేదాకా ప్రచురించదు.
1. మీ అనువాదంలో "మరియు" ఉంటే
2. మీ అనువాదంలో మానవిక అనువాద శాతం పరికరం లోని కనీస పరిమితి (ప్రస్తుతం ఈ పరిమితి 30%) కంటే తక్కువగా ఉంటే.
అనువాదంలో "మరియు" అనే మాట ఉంటే పరికరం ప్రచురించదా?
"మరియు" ఉంటే పరికరం ప్రచురించదు. అయితే ఇది పరికరంలో విధించిన నిబంధన కాదు, వికీలో విధించిన నిబధన. తెలుగు భాషకు "మరియు" అనేది స్వాభావికం కాదు కాబట్టి తెలుగు వికీపీడియాలో ఈ నిబంధన చేర్చారు. ఆ నిబంధన ఉండగా యంత్రం ప్రచురించలేదు.
తెవికీలో "మరియు" రాయకూడదా?
తెలుగు భాషకు మరియు అనేది స్వాభావికం కాదు. ప్రధానమైన వార్తాపత్రికల్లో రాయరు. ప్రామాణికమైన పుస్తకాల్లో అది రాయరు. మాట్లాడే భాషలో ఎవరూ వాడరు.కాబట్టి, తెవికీలో అది రాయకూడదని మార్గదర్శకం ఉంది.
నా అనువాదంలో "మరియు" ఉంది అంటూ ప్రచురణ ఆపేసింది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి
అనువాదంలో "మరియు" అనే పదం ఎక్కడెక్కడ ఉందో వెతికి దాన్ని తగురీతిలో మార్చండి. అప్పుడు ప్రచురిస్తుంది.
అనువాదంలో "మరియు" ఎక్కడా కనిపించలేదు. అయినా "మరియు" ఉందని అలర్టు చూపిస్తోంది. ఏం చెయ్యాలి?
ఇదొక చిత్రమైన సమస్య. అనువాద పాఠ్యంలో "మరియు" అనే మాట ఉండకపోవచ్చు. కానీ పాఠ్యంలో చేర్చిన మూలాల్లో "మరియు" ఉండి ఉండవచ్చు. ఫైండ్/రీప్లేస్ ఉపకరణం మూలాల్లో వెతకదు. అంచేత దాన్ని మనకు చూపించదు. కానీ ప్రచురించే ముందు తెవికీ మాత్రం శ్రద్ధగా పరిశీలిస్తుంది. అందుకే ఈ సమస్య వస్తుంది. మూలాల్లో కూడా చూసి మరియు ఉంటే దాన్ని తగు విధంగా సవరించండి.
భాష సహజంగా ఉండేలా అనువదించాను అయినా మానవిక అనువాదం 30% లేదని ప్రచురించడం లేదు. ఏంచెయ్యాలి?
గతంలో యంత్రం చేసే అనువాదం లోపభూయిష్టంగా ఉండడంతో ఈ పరిమితిని విధించారు. అయితే ఈమధ్య కాలంలో యాంత్రిక అనువాదం నాణ్యత మెరుగు పడడం వలన ఈ సమస్య వస్తోంది. ప్రస్తుతం ఈ మానవిక అనువాద శాతపు కనీస పరిమితిని తగ్గించే దిశగా సముదాయం ఆలోచించాలి. అప్పటివరకు ఈ సమస్యను పరిష్కరించేందుకు కింది విధానాన్ని అవలంబించవచ్చు:
అనువాదంలో ఉన్న ఒక పేరాగ్రాఫును కట్ చేసి, దానికి పైన ఉన్న పేరాగ్రాఫులో కలపండి. ఇప్పుడు ప్రచురిస్తే సరి. లేదంటే ఇదే పనిని మరొక పేరాగ్రాఫు విషయంలో చెయ్యండి.
గమనిక: ఇది కేవలం ఒక అడ్డదారి మాత్రమే. కేవలం చక్కగా మానవిక సవరణలు చేసిన తరువాతనే దీన్ని వాడమని మనవి.

మూసలు, వర్గాలు, లింకులు

[మార్చు]
మూలం లోని మూసలు కొన్ని అనువాదం లోకి రావడం లేదు
రెండు సందర్భాల్లో మూలంలో ఉన్న మూస అనువాదం లోకి రాదు. అవి:
  1. ఆ మూస తెవికీలో లేని పక్షంలో
  2. తెవికీలో ఆ మూస ఉన్నప్పటికీ.., మూలం లోని మూసకు, తెవికీలో ఉన్న మూసకూ మధ్య భాషాంతర లింకు లేకపోతే మూస ఆటోమాటిగ్గా చేరదు. అయితే మూలం లోని మూసను కాపీ చేసి అనువాదంలో పేస్టు చేసుకోవచ్చు. అయితే మూసలోని సమాచారాన్ని అనువాదం చేసుకోవాల్సి ఉంటుంది.
మూలం లోని మూస అనువాదం లోకి వచ్చింది గానీ మూస లోని డేటా అనువాదం కాలేదు
పరికరంలో ఈ సమస్య ఉంది. దీన్ని డెవలపర్లకు నివేదించాలి. నివేదించే లింకు పరికరం పేజీలో కుడివైపు అడుగున ఉంటుంది.
పరికరంలో కొన్ని సాంకేతిక సమస్యలున్నాయి. ఏం చెయ్యాలి?
వాటిని డెవలపర్లకు నివేదించాలి. నివేదించే లింకు పరికరం పేజీలో కుడివైపు అడుగున ఉంటుంది.
మూలంలో ఉన్న వికీలింకు లక్ష్యం పేజీ తెవికీలో కూడా ఉన్నప్పటికీ లింకు చూపించడం లేదు, ఎందుచేత?
ఆ లింకు లక్ష్యం పేజీకి, మూలం లోని అదే పేజీకీ భాషాంతర లింకు ఉండాలి. లేకపోతే పరికరం ఆ లింకును ఇవ్వలేదు. ఇదే విషయం మూసలకు, వర్గాలకూ కూడా వర్తిస్తుంది.
మూలం అనువాదం కాకుండా యథాతథంగా వస్తోంది. అలా ఎందుకు జరుగుతోంది?
అనువాదం చేసేందుకు పేరాగ్రాఫుపై నొక్కినపుడు ఒక్కోసారి మూలం అనువాదం కాకుండా ఉన్నదున్నట్లుగా వచ్చి చేరుతుంది. దానికి కారణం కిందివాటిలో ఏదైనా కావచ్చు:
  • తాత్కాలికంగా యంత్రం పనిచెయ్యకపోవడం
  • ఆ సమయంలో మీ ఇంటర్నెట్ కనెక్షను పనిచెయ్యకపోవడం
  • కొన్ని మూసలను, div ట్యాగులలో ఉన్న పాఠ్యాన్నీ అనువదించే సామర్థ్యం యంత్రానికి లేకపోవడం
  • మరేదైనా సాంకేతిక సమస్య తలెత్తడం
అలా అనువాదం కాకుండా యథాతథంగా చూపిస్తే ఏం చెయ్యాలి?
అనువాదం చెయ్యకుండా మూలాన్ని ఉన్నదున్నట్లుగా తెచ్చినపుడు దాన్ని అనువాదం చేసేందుకు కింది పద్ధతులను అవలంబించవచ్చు
  1. కుడివైపున ఉన్న ప్యానెల్లోంచి మరొక అనువాద యంత్రాన్ని ఎంచుకోవడం
  2. మూల పాఠ్యాన్ని కాపీ చేసి translate.google.com కు వెళ్ళి అక్కడ యాంత్రిక అనువాదం చేసి దాన్ని తెచ్చి ఇక్కడ పేస్టు చెయ్యడం. ఇప్పుడు కూడా మానవిక సవరణలు చెయ్యాల్సిన అవసరం ఉంటుంది
  3. నేరుగా మానవికంగా ఆ పేరాను అనువదించడం

మూలాలు

[మార్చు]
అనువాదం చేసినపుడు మూల వ్యాసంలో ఉన్న మూలాలు కూడా వస్తాయా?
వస్తాయి.
అనువాదంలో మరిన్ని మూలాలను చేర్చాలని అనుకుంటున్నాను, చేర్చవచ్చా?
కొత్త మూలాలను చేర్చవచ్చు. మూలాన్ని చేర్చవలసిన చోట కర్సరు ఉంచి పనిముట్ల ప్యానల్ లోని ఉల్లేఖించండి ను నొక్కి కొత్త మూలాన్ని చేర్చవచ్చు. మూలవ్యాసం నుండి వచ్చిన మూలాలను సవరించవచ్చు కూడా.
ఇంగ్లీషు పేజీలో బోలెడు మూలాలుండగా, తెలుగు పేజీలో మాత్రం మూలాల జాబితా చాలా చిన్నదిగా ఉందేమిటి?
పేజీలో కొంతమేరకే అనువాదం చేసి ఉంటే, ఆ చేసిన భాగంలో ఉన్న మూలాలు మాత్రమే అనువాదం లోకి వస్తాయి. అనువదించని భాగం లోని మూలాలు తెలుగు పేజీ లోకి రావు. అంచేత మూలాల సంఖ్య తక్కువగా ఉంటుంది.
పేజీని ప్రచురించాక చూస్తే ఫలానా మూలాన్ని నిర్వచించలేదు అనే దోషాన్ని చూపించింది. ఏం చెయ్యాలి?
అనువాదం చేసేటపుడు కొన్ని పేరాలను అనువదించకుండా వదిలేసి, వాటి కింది పేరాలను అనువదించినపుడు "ఫలానా మూలాన్ని నిర్వచించలేదు" అనే లోపాన్ని చూపిస్తుంది. వ్యాసంలో ఒకే మూలాన్ని పలుచోట్ల వాడినపుడు, మూలాన్ని ఒక్కచోటనే నిర్వచించి, మిగతా చోట్ల ఆ మూలం పేరును ఇవ్వాలి, మళ్ళీమళ్ళీ నిర్వచించకూడదు. అలా నిర్వచిస్తే వికీపీడియా సాఫ్టువేరు, లోపాన్ని చూపిస్తుంది. ఉదాహరణకు <ref "myref1">{{citeweb.....}}</ref> అనే మూలాన్ని అదే వ్యాసంలో పలు ఇతర చోట్ల వాడాల్సి వస్తే ఆయా స్థానాల్లో మళ్ళీ మూలాన్నంతటినీ రాయకుండా <ref "myref1" /> అనే సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగు వాడాలి. ఒకే మూలాన్ని మళ్ళీ మళ్ళీ నిర్వచిస్తే లోపం చూపిస్తుంది. అలాగే అసలు మొదటి నిర్వచన మూలం లేకుండానే <ref "myref1" /> అనే సెల్ఫ్ క్లోజింగ్ రెఫ్ ట్యాగులు వాడితే, అలా వాడిన చోట్లంతటా "myref1" అనే మూలాన్ని ఎక్కడా నిర్వచించలేదు అనే లోపాన్ని చూపిస్తుంది. ఇప్పుడు ప్రచురించిన ఈ అనువాదంలో ఈ రెండవ లోపమే జరిగింది. అనువదించకుండా వదిలేసిన పేరాల్లో మూలం నిర్వచించి ఉంది. దాన్ని వదిలేసారు కాబట్టి నిర్వచనం తెలుగులోకి రాలేదు. అనువదించిన వాటిలో సెల్ఫ్ క్లోజింగు ట్యాగు వాడారు. తెలుగు పేజీలో నిర్వచించిన భాగం లేదు గానీ దాని పునఃప్రయోగాలు మాత్రం ఉన్నాయి. అందుచేతనే ఈ లోపాన్ని చూపిస్తోంది. దీనికి నివారణ మార్గం - మూలం లోని పేజీకి వెళ్ళి అక్కడి నుండి నిర్వచనం ఉన్న మూలాన్ని కాపీ చేసుకుని, ఇక్కడి పేజీలో లోపం చూపిన చోట పేస్టు చెయ్యడమే.

ఇవి కూడా చూడండి

[మార్చు]