Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2009 09వ వారం

వికీపీడియా నుండి
గంగానది మరియు దాని ఉపనదుల మ్యాపు
గంగానది మరియు దాని ఉపనదుల మ్యాపు

గంగా నది భారతదేశం, మరియు బంగ్లాదేశ్ లలో ప్రధానమైన నదుల్లో ఒకటి. భారతదేశం ఆర్ధిక వ్యవస్థ, చరిత్ర, సంస్కృతి గంగానదితో అవినాభావంగా ముడిపడి ఉన్నాయి. హిందూమతంలో గంగానదికి ఉన్న ప్రాముఖ్యత అత్యున్నతమైనది. "గంగమ్మ తల్లి" అనీ, "పావన గంగ" అనీ, "గంగా భవాని" అనీ ఈ నదిని హిందువులు స్మరిస్తారు. "నీరు" అన్న పదానికి సంస్కృతంలో "గంగ" అన్న పదాన్ని వాడుతారు.

గంగా నది మొత్తం పొడవు షుమారు 2,510 కి.మీ.(1,557 మైళ్ళు). గంగ, దాని ఉపనదియైన యమున కలిసి విశాలమైన మైదానప్రాంతంలో ప్రవహిస్తున్నాయి. సారవంతమైన ఈ "గంగా-యమునా మైదానం" ఉత్తర భారతదేశం, బంగ్లాదేశ్‌లలో విస్తరించి ఉన్నది. ఉత్తరాంచల్ రాష్ట్రం పరిధిలోని హిమాలయ పర్వతాలలో గంగోత్రి అనే హిమానీనదం (Glacier)లో భాగీరధి నది ఉద్భవిస్తున్నది. ప్రవాహ మార్గంలో దేవ ప్రయాగ వద్ద అలకనందనది దీనితో కలుస్తుంది.అక్కడినుండి దీనిని "గంగ" అంటారు. కొంత దూరం హిమాలయాలలో ప్రహించిన ఈ నది హరిద్వారం వద్ద మైదాన ప్రాంతంలో ప్రవేశిస్తున్నది.

హిందూ మతం ఆచారాల ప్రకారం గంగానది పవిత్రమైనది. పావనం చేసేది. ఒక్కమారు గంగానదిలో స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలనుండి విముక్తి లభిస్తుందని, చనిపోయే ముందు గంగా జలం మింగితే స్వర్గప్రాప్తి నిశ్చయమనీ నమ్మకం. చనిపోయిన తమ కుటుంబీకుల అస్తికలను గంగానదిలో నిమజ్జనం చేయడానికి దూరదూరాలనుండి వారాణసికి, గయకు, ప్రయాగకు, ఇతర గంగానదీ తీర్ధాలకు వస్తారు. గంగా నది జలాన్ని ఒక చిన్న పాత్రలో ఇంటిలో ఉంచుకోవడం శుభప్రదమని భావిస్తారు.

మొత్తం ప్రపంచ జనాభాలో 8.5 % ప్రజలకు (ప్రతి 12 మందికీ ఒకరికి) ఈ మైదానం నివాసస్థానం. ఈ కారణంగా ఈ ప్రాంతంలో తీవ్రమైన ఆర్ధిక, పర్యావరణ, సాంఘిక సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. జనసాంద్రత అధికంగా ఉన్న ప్రదేశాలు గంగానదికి ఇరువైపులా ఉన్నందున, చుట్టుప్రక్కల కాలుష్యాన్ని విడుదలచేసే అనేక పరిశ్రమలు ఉండడం వలన, గంగానదీ జలాలు తీవ్రమైన కాలుష్యానికి గురవుతున్నాయి. కాన్పూరు వంటి నగరాలలోని రసాయనిక పరిశ్రమలు, తోలు పరిశ్రమలు, ఇందుకు ఒక ముఖ్య కారణం. అందుకు తోడు ప్రజల గృహాలనుండి వెలువడే మురుగునీరు రోజూ 100 కోట్ల లీటర్లు గంగలో కలుస్తున్నాయని అంచనా. ఈ పరిస్థితిని నివారించడానికి అడపా దడపా కొన్ని చర్యలు తీసుకొన్నారు గాని ఫలితాలు చాలా కొద్ది స్థాయిలో ఉన్నాయి. .....పూర్తివ్యాసం: పాతవి