Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2009 12వ వారం

వికీపీడియా నుండి

గోను, 2007 జూన్‌లో సంభవించిన ఒక తుఫాన్. ఇది ఒక "సూపర్ సైక్లోనిక్ స్టార్మ్". అరేబియా సముద్రంలో నమోదైన తుఫాన్‌లన్నింటికంటే ఇది అత్యంత ఉధృతమైనదిగా గుర్తించారు. ఉత్తరాన హిందూమహా సముద్రంలో సంభవించిన అతిపెద్ద తుఫాన్‌కు ఇది ఇంచుమించు సమానంగా ఉంది. జూన్ 1న అరేబియా సముద్రం తూర్పు ప్రాంతంలో చిన్న అల్పపీడన ద్రోణిగా ఇది ప్రారంభమైంది. ఉపరితల ఉష్ణోగ్రతలు, గాలి దిశ అనుకూలంగా ఉండడంతో ఇది జూన్ 3 నాటికి ఉధృతంగా, 240 km/h (150 mph) గాలి వేగంతో బలపడింది. జూన్ 5వ తారీఖున ఇది ఒమన్ తూర్పు తీరాన్ని (రాస్ అల్ హద్ వద్ద) తాకింది. అరేబియన్ పెనిన్సులాలో ఇంత పెద్ద తుఫాన్ ఇంతకు ముందు నమోదు కాలేదు. ఈ ప్రాంతంలో అల్ప పీడనాలు బలహీనంగా ఉంటాయి. అవికూడా త్వరగా చెదరిపోతాయి. సంకీర్ణ తుఫాన్ హెచ్చరిక కేంద్రం (JTWC) దీనిని 02 శ్రేణి తుఫాన్‌గా వర్గీకరించి హెచ్చరికలు జారీ చేసింది. JTWC వారు మూడు సంవత్సరాలకు సరిపడా తుఫాన్ పేర్ల జాబితానొకదానిని తయారుగా ఉంచుతారు. క్రమంలో ఒక్కో తుఫాన్‌కు ఒక్కోపేరు పెడతారు. ఒకసారి వాడిన పేరును మరోసారి వాడరు.


జూన్ 6న ఇది ఉత్తర వాయువ్యదిశగా ప్రయాణించింది. అప్పుడు సముద్రంలోని అలల బలం దీనికి వ్యతిరేక దిశలో ఉండడంవలన తుఫాన్ తీవ్రత బాగా మందగించింది. వాతావరణ శాఖ దీనిని సామాన్యమైన "ఉష్ణమండల తుఫాన్" గా వర్గీకరించింది. తీవ్రమైన గాలులు, అధిక వర్షపాతం కలిగే అవకాశం ఉన్నందున విపరీతమైన నష్టం వాటిల్లే అవకాశం ఉన్నదని ఒమన్ జాతీయ రక్షణా వ్వవస్థ గుర్తించింది. అందువలన వీలయినంత వరకు నష్టాన్ని నివారించడానికి, అనంతర సహాయ చర్యలు చేపట్టడానికీ పెద్దయెత్తున సన్నాహాలు చేశారు. పోలీసు, మిలిటరీ, పారామిలిటరీ, వైద్య, మునిసిపాలిటీ, విద్యుత్, నీటి సరఫరా విభాగాలు తమ ప్రణాళికలను సిద్ధం చేసుకొన్నారు.

ఒమన్ తీరప్రాంతాన్ని తాకడానికి 7 గంటలు ముందునుండీ తుఫాను ప్రభావం ఒమన్ తీరప్రాంతంపై కనిపించింది. ఈదురుగాలులు, అధిక వర్షపాతం సంభవించాయి. కొన్ని ప్రాంతాలలో 610 మి.మీ.వరకు వర్షపాతం నమోదయ్యింది. తీరాన రహదారులన్నీ జలమయమైపోయాయి. స్తంభాలు కూలి పోవడం వలన టెలిఫోను, విద్యుత్ సదుపాయాలు కొన్ని చోట్ల తీవ్రంగా స్తంభించాయి. కాని దేశంలో అత్యధిక ప్రాంతంలో ఈ సౌకర్యాలు కొనసాగాయి. జూన్ 5న మొట్టమొదట తుఫాను ప్రభావం మసీరా దీవిమీదా, షర్కియా ప్రాంతంలోనూ అధికంగా ఉంది. ఇక్కడి ముఖ్యపట్టణమైన సూర్, చుట్టుప్రక్కల రాస్ అల్ హద్ వంటి గ్రామాలు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యాయి. కొంత సమయం వీటికి మస్కట్ నగరంతో దాదాపు పూర్తిగా సంబంధం లేకుండా జరిగింది. ....పూర్తివ్యాసం: పాతవి