వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2009 39వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రతీపాలపురం, ప్రితుడనగరం, పిటిండ్రలు మొదలగు పేర్లు కల భట్టిప్రోలు ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో విశిష్టమైన స్థానాన్ని కలిగిఉంది. సముద్రతీరానికి సమీపములో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉన్న భట్టిప్రోలు ప్రపంచ బౌద్ధారామాలలో ప్రముఖమైన క్రీ.పూ. 4-3 శతాబ్దాల నాటి స్తూపం కలిగి ఉంది. గౌతమ బుద్ధుడు, మహావీరుడు లాంటి మహనీయులు ఇక్కడ దర్శించారని చరిత్రకారులు భావిస్తున్నారు. క్రీ.శ. 130 ప్రాంతంలో టాలమీ వర్ణించిన జౌళి పరిశ్రమకు, వాణిజ్యానికి కేంద్రస్థానమైన పిటిండ్ర నగరం భట్టిప్రోలేననే అభిప్రాయం చరిత్రకారులలో బలంగా ఉంది. క్రీ.శ. 8వ శతాబ్దానికి చెందిన జైన కవి నయనసేనాని వ్రాసిన ధర్మామృత' కావ్యములోని క్రీ.పూ. 5వ శతాబ్దికి చెందిన కథలో ప్రతీపాలపుర ప్రసక్తి ఉంది. శాసనముల ఆధారముగా భట్టిప్రోలు ప్రాంతాన్ని కుబేరకుడు అనే రాజు పాలించాడు.

కాలగర్భంలో కలిసిపోయిన భట్టిప్రోలు బౌద్ధ స్తూప ప్రాశస్త్యం క్రీ. శ. 1870 నుండి వెలుగులోనికి రాసాగింది. బాస్వెల్ (1870), వాల్టర్ ఎలియట్ (1871), నారిస్ (1872, రాబర్ట్ సెవెల్ (1882), అలెగ్జాండర్ రే (1892), బుహ్లర్ (1894), రాయప్రోలు సుబ్రహ్మణ్యం (1969) మొదలగువారి కృషివల్ల అమూల్యమైన చారిత్రక నిక్షేపాలు బయల్పడ్డాయి. లంజ దిబ్బ, విక్రమార్కకోట దిబ్బ అని పిలువబడే మట్టిదిబ్బలు తవ్వగా స్తూపము, కోట గోడలు కనపడ్డాయి. 1700 చదరపు గజాలు స్తూప ఆవరణ, 148 అడుగుల మేధి వ్యాసం, 32 అడుగుల అండం వ్యాసం, 40 అడుగుల ఎత్తు, 8 అడుగుల విశాలమైన ప్రదక్షిణాపథం, 45 X 30 X 8 సె.మీ పరిమాణముగల ఇటుకలతో కట్టబడిన స్తూపం బయల్పడింది. భట్టిప్రోలు స్తూపము ధాతుగర్భము. అనగా బుద్ధుని ధాతువులపై నిర్మించబడినది. స్తూపం మధ్య అమూలాగ్రంగా రంధ్రం ఉన్నది. రంధ్రము చుట్టూ ఇటుకలను పద్మాకారములో అమర్చారు. రంధ్రంలో స్తూపాగ్రాన ఉండే ఛత్రపుకాడను అమర్చారు. రంధ్రముగుండా మూడు బండరాతి పేటికలు (శిలా మంజూషికలు) లభించాయి.

భట్టిప్రోలు స్తూపం నిర్మాణం విశిష్టమైనది. ఇందు ఆయక స్థంభములు ప్రధానమైన ప్రత్యేకతలు. చక్రాకార స్తూపనిర్మాణము భట్టిప్రోలులో ప్రారంభమై అమరావతి, నాగార్జున కొండ స్తూపములలో పరిణితి చెందింది. చక్రాకార వైశిష్ట్యం ఏమిటంటే, స్తూపానికి పటుత్వం, పవిత్ర ధర్మచక్ర ప్రతిష్ఠ. అనగా నిర్మాణ సౌష్ఠవం మరియు ధర్మభావ వ్యక్తీకరణల మేళవింపు. చక్రాకార స్తూపంలోని ఆకుల సంఖ్య ధర్మభావాలకు ప్రతీకలు.

ఇంకా....పూర్తివ్యాసం: పాతవి