Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2011 11వ వారం

వికీపీడియా నుండి

సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమైన భారత దేశానికి దేశాధినేత రాష్ట్రపతి. రాష్ట్రపతి దేశ ప్రథమ పౌరుడు, సర్వ సైన్యాధ్యక్షుడు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి కార్యనిర్వాహక దేశాధినేత. శాసన విభాగమైన పార్లమెంటు ఉభయ సభల్ను రాష్ట్రపతి సమావేశపరుస్తారు, ప్రభుత్వాధినేత అయిన ప్రధానమంత్రిని నియమిస్తారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను నియమిస్తారు. అయితే, వాస్తవానికి కార్యనిర్వాహక అధికారాలన్నీ ప్రభుత్వాధినేత అయిన ప్రధానమంత్రివే. ప్రధానమంత్రి సలహా మేరకే, రాష్ట్రపతి సంతకంతో ఉత్తర్వులు జారీ అవుతాయి. రాష్ట్రపతి పదవి అలంకార ప్రాయమైనది. 1950 జనవరి 26 న భారత రాజ్యాంగం అమలు లోకి వచ్చిన తరువాత దేశాధినేతగా రాష్ట్రపతి అయ్యారు. అప్పటి వరకు గవర్నర్ జనరల్ దేశాధినేతగా ఉండేవారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, భారత దేశానికి ఇద్దరు గవర్నర్ జనరల్ గా పనిచేసారు.


భారత రాష్ట్రపతిగా ఎన్నికయేందుకు ఈ అర్హతలు ఉండాలి. (1) భారత పౌరుడై ఉండాలి. (2) వయసు 35 ఏళ్ళు లేదా ఆ పైబడి ఉండాలి. (3) లోక్‌సభ సభ్యుడయేందుకు కావలసిన అర్హతలు ఉండాలి. (4) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో గానీ, ఆ ప్రభుత్వాల నియంత్రణలోనున్న సంస్థలలో గాని సంపాదనగల స్థానం కలిగి ఉండకూడదు. - ఒక వ్యక్తి ఎన్నిమార్లైనా రాష్ట్రపతిగా ఎన్నిక కావచ్చు. రాష్ట్రపతిగా ఎన్నికవ్వబోయే వ్యక్తి, పార్లమెంటు ఉభయసభల్లోగాని, రాష్ట్ర శాసన సభల్లోగాని సభ్యుడిగా ఉండరాదు. ఒకవేళ అటువంటి సభ్యుడు రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తే వెంటనే సదరు సభల్లో సభ్యత్వం కోల్పోతారు. రాష్ట్రపతి వేతనం పార్లమెంటు నిర్ణయిస్తుంది. పదవీకాలం ముగిసే వరకు రాష్ట్రపతి వేతనంలో కోత ఉండదు.

రాష్ట్రపతిని ఎలెక్టోరల్ కాలేజి ఎన్నుకుంటుంది. (1) పార్లమెంటు రెండు సభలలోను గల ఎన్నికైన సభ్యులు (2) రాష్ట్ర శాసన సభలలోని ఎన్నికైన సభ్యులు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతిచే ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఏ కారణం చేతనైనా రాష్ట్రపతి పదవి ఖాళీ అయినపుడు, ఆరు నెలలలోగా కొత్త రాష్ట్రపతి పదవీ స్వీకారం జరగాలి.

రాష్ట్రపతి ఐదేళ్ళు పదవిలో ఉంటారు. ప్రభుత్వంలోని మూడు వ్యవస్థలకు సంబంధించి, రాష్ట్రపతికి అధికారాలు ఉంటాయి. అయితే ఈ అధికారాలన్నీ అలంకారప్రాయమైనవే. దాదాపుగా అన్ని విధులూ, ప్రధానమంత్రి సలహా మేరకే జరుగుతాయి.


ఇంకా....పూర్తివ్యాసం పాతవి