Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2011 17వ వారం

వికీపీడియా నుండి

ఏకలవ్యుడు మహాభారతంలో గురుభక్తిని చాటే ఒక గొప్ప ఔన్నత్యం ఉన్న పాత్ర. నిషాధ తెగకు చెందినవాడు. తక్కువ కులానికి చెందిన వాడైనా ద్రోణాచార్యుని గురుకులంలో విలువిద్యను అభ్యసించాలని కోరికను కలిగి ఉండేవాడు. కానీ ద్రోణుడు అందుకు అంగీకరించలేదు.

ద్రోణుని తిరస్కారంతో ఏకలవ్యుడు ఏమాత్రం చెదిరిపోక తిరిగి అరణ్యానికి వెళ్ళి మట్టితో ద్రోణాచార్యుని ప్రతిమను సృష్టించుకున్నాడు. ఆ ప్రతిమనే తన గురువుగా భావించి తానే స్వంతంగా విద్య నేర్చుకోవడం ప్రారంభించాడు. ఈ విధంగా అకుంఠిత దీక్షతో శ్రద్ధా భక్తులతో విద్యనభ్యసించిన ఏకలవ్యుడు అపారమైన ప్రతిభను కూడగట్టుకొని ద్రోణుని ప్రియ శిష్యుడైన అర్జునుని కూడా మించిపోయాడు. ఇలా ఉండగా ఒక నాడు ఏకలవ్యుడు ధనురాభ్యాసం కావించుచుండగా ఎక్కడి నుంచో వచ్చిన ఒక శునకం పదే పదే మొరగనారంభించింది. అప్పుడు ఏకలవ్యుడు మొరుగుతున్న కుక్క నోరు మూయకుండా వెనువెంటనే ఏడు బాణాలు సంధించాడు. దానికి గాయం కూడా ఏమీ తగలలేదు. ఆ దారి వైపుగా వస్తున్న పాండవ రాకుమారులకు ఈ అద్భుత దృశ్యం కంటపడింది. ఇంతటి ప్రతిభా పాటవాలు కలిగిన వారు ఈ అరణ్యంలో ఎవరా? అని వారు ఆశ్చర్యపోయారు. వారు ఆ అరణ్యంలో వెతుకగా నల్లని వస్త్రధారణతో, దుమ్ముపట్టిన శరీరంతో, జడలు కట్టిన వెంట్రుకలతో ఉన్న ఏకలవ్యుడు కనిపించాడు. ద్రోణుని శిష్యునిగా తనను తాను పరిచయం చేసుకున్నాడు.

ఏకలవ్యుడు విలువిద్యలో తనను ఎక్కడ మించిపోతాడేమోనని మదనపడ సాగాడు. తన గురువైన ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి తనను అందరి కన్నా మేటి విలుకానిని చేస్తానని ఇచ్చిన మాటను గుర్తు చేశాడు. అప్పుడు ద్రోణుడు అర్జునునికి అభయమిచ్చి రాజకుమారులతో కలిసి ఏకలవ్యుడిని కలవడానికి వెళ్ళాడు. ఏకలవ్యుడు ఎప్పటి లాగే విలువిద్య దీక్షగా సాధన చేస్తున్నాడు. గురువును చూడగానే అత్యంత భక్తి ప్రపత్తులతో గురువాజ్ఞ కోసం ఎదురుచూస్తూ ఆయన ముందు మోకరిల్లాడు.

ద్రోణుడు ఏకలవ్యుని గురుదక్షిణ ఇమ్మని అడిగాడు.ఏకలవ్యుడు అందుకు సంతోషంగా గురువు ఏదడిగినా సరే ఇస్తానన్నాడు. అప్పుడు ద్రోణుడు ఏమాత్రం కనికరం లేకుండా ఏకలవ్యుని కుడి చేతి బ్రొటనవేలుని ఇమ్మని అడిగాడు. ఆ వేలు పోయిన తరువాత ఏకలవ్యుడు విలువిద్య అభ్యసించలేడన్నది ద్రోణుడి అభిప్రాయం. కానీ ఏకలవ్యుడు మాత్రం బెదరక, సందేహించక వెను వెంటనే తన కుడి చేతి బ్రొటన వేలుని ఖండించి గురుదక్షిణ గా సమర్పించాడు. మరోవైపు అర్జునుడు కూడా తెగిన వేలుతో ఏకలవ్యుడు మునుపటి ప్రదర్శన చేయలేడని సంతోషించాడు.

తరువాత ఏకలవ్యుడు జరాసంధునికి చాలా విశ్వాసపాత్రుడిగా వ్యవహరించాడు. రుక్మిణీ స్వయంవరం సమయంలో జరాసంధుని కోరిక మేరకు, శిశుపాలుడికి మరియు రుక్మిణీ దేవి తండ్రియైన భీష్మకునికి మధ్యవర్తిగా వ్యవహరించాడు. భీష్మకుడు రుక్మిణి శిశుపాలుడిని పెళ్ళి చేసుకోవాలని కోరాడు. కానీ రుక్మిణీ శ్రీకృష్ణుని పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయింది. తరువాత ఒకసారి జరాసంధుని సైన్యంతో యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు పైకి ఏకలవ్యుడు ఒక రాయి విసరడంతో శ్రీకృష్ణుడే అతన్ని చంపివేశాడు.

ఇంకా... పూర్తివ్యాసం పాతవి