Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2011 33వ వారం

వికీపీడియా నుండి

కె.బాలచందర్ గా ప్రసిద్ధిచెందిన కైలాసం బాలచందర్ ప్రముఖ దక్షిణ భారతదేశ సినిమా దర్శకుడు, రచయిత మరియు నిర్మాత. వీరు 1930 సంవత్సరంలో తంజావూరు దగ్గర నన్నిలం గ్రామంలో జన్మించాడు. తొలుత అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయంలో పనిచేసేవాడు. అక్కడ ఉద్యోగం చేస్తూనే పలు నాటకాలు రాశాడు. ఎంజీఆర్‌ కథానాయకుడిగా నటించిన దైవతాయ్‌ చిత్రానికి సంభాషణల రచయితగా చలనచిత్ర రంగంలో ప్రస్థానం ప్రారంభించాడు. 45 ఏళ్లలో తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో 100కు పైగా చిత్రాలను రూపొందించాడు. రజనీకాంత్, కమల్ హాసన్, ప్రకాష్ రాజ్ వంటి నటుల్ని చిత్రపరిశ్రమకు పరిచయం చేశాడు.

భారత చలనచిత్ర రంగం అభివృద్ధికి ఆయన చేసిన కృషికి గాను 2010 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించింది. అవార్డు కింద స్వర్ణకమలం, రూ.10లక్షల నగదు, శాలువాతో సత్కరించారు.

తమిళనాడు, తంజావూరు జిల్లాలోని నన్నిలం గ్రామం ఆయన స్వస్థలం. వస్త్రాలపై వేసే రంగురంగుల పెయింటింగులకు ఈ గ్రామం ప్రసిద్ధి. వారిది సామాన్య మధ్యతరగతి కుటుంబం. నాన్న దండపాణి కైలాసం. అమ్మ సరస్వతి. అన్నామలై విశ్వవిద్యాలయం నుంచి బీయస్సీ పూర్తి చేశాడు. తరువాత అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో ఉద్యోగిగా ఆయన జీవితం ప్రారంభమైంది. ఉద్యోగం చేస్తూనే ఖాళీ సమయాల్లో సరదాగా నాటకాలు రాస్తుండేవాడు. అలా రాసిన ఒక నాటకం ఎం.జి. రామచంద్రన్ దృష్టిలో పడటంతో ఆయన్నుంచి ఆహ్వానం వచ్చింది. ఎంజీఆర్ నటించిన దైవతాయి అనే చిత్రానికి సంభాషణలు, స్క్రీన్‌ప్లే అందించాడు.

ఇంకా... పూర్తివ్యాసం పాతవి