వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2013 32వ వారం
సుభాష్ చంద్రబోస్
సుభాష్ చంద్రబోస్ (బెంగాలీ:সুভাষ চন্দ্র বসু) (జననం: జనవరి 23, 1897). (మరణం: ఆగష్టు 18, 1945న చనిపోయినట్లుగా భావిస్తున్నారు) నేతాజీ గా ప్రసిద్ధి గాంచిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తుంటే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన మహనీయుడు. ఇతని మరణం పై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
బోసు రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఎన్నికైనా గాంధీ తో సిద్ధాంత పరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశాడు. గాంధీ యొక్క అహింసావాదం మాత్రమే స్వాతంత్ర్య సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని బోసు భావన. ఈ అభిప్రాయాలతోనే ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. దాదాపు 11 సార్లు ఆంగ్లేయులచే కారాగారంలో నిర్బంధించ బడ్డాడు. 1939 లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆంగ్లేయులను దెబ్బ తీయటానికి దీన్ని ఒక సువర్ణవకాశంగా బోసు భావించాడు. యుద్ధం ప్రారంభం కాగానే అతను ఆంగ్లేయుల పై పొరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ మరియు జపాను దేశాలలో పర్యటించాడు. జపాను సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు మరియు ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యం ను ఏర్పాటు చేశాడు. జపాను ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్ధిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వం ను సింగపూర్ లో ఏర్పరచాడు.
(ఇంకా…)