వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2013 34వ వారం
"టెలివిజన్"(దూరదర్శన్) అనునది సుదూర ప్రాంతాలకు ఒక మాధ్యమం ద్వారా చలన చిత్రాలను, ధ్వనిని ఒకేసారి గ్రహించగలిగే సాధనం. దీనిద్వారా దృశ్య మరియు ధ్వని సమాచారాన్ని ఒకేసారి గ్రహించవచ్చు. ఇది నలుపు-తెలుపు మరియు రంగుల్లో చిత్రాలను చూపించేసాధనం. టెలివిజన్ అనే పదమునకు మూలం లాటిన్ మరియు గ్రీకు పదాలు. "దూర దృష్టి" అనే అర్థం వచ్చే గ్రీకు పదం tele (గ్రీకు:τῆλε) అనగా దూరం, మరియు లాటిన్ పదం visio అనగా దృష్టి అనిఅర్థము.
టెలివిజన్ నిర్మాణంలోనే సాంకేతిక సమస్యల్ని చాలా వరకు పరిష్కరించినవాడు స్కాట్లండ్ కి చెందిన ఓ క్రైస్తవ మతాధికారి కొడుకు జాన్ లోగీ బెయిర్డ్. అనారోగ్యం కారణంగా ఇంజనీరింగ్ విద్యని పూర్తిచేయలేక యితడు వ్యాపార రంగంలో ప్రవేశించాడు. విసుగు చెందని విక్రమార్కుడిలా అకుంఠిత దీక్షతో ఓ ధ్యేయం కోసం అహర్నిసలూ శ్రమించిన ఉదాహరణలు సాంకేతిక శాస్త్ర చరిత్రలోనే చాలా అరుదు. ఈ శతాబ్దానికే తలమానికమైన ఆవిష్కరణని సాధించడంలో బెయిర్డ్ ఎదుర్కొన్న అవాంతరాలు అన్ని ఇన్నీ కావు. టెలివిజన్ పూర్వాపరాలను గురించిన పరిజ్ఞానం శూన్యం. మేడమీదున్న ఓ మురికి గది ఓ ప్రయోగశాల. ఎలక్ట్రికల్ వ్యాపారస్తుడి దగ్గర మూలపడ్డ ఓ పాత ఎలక్ట్రిక్ మోటారు ని కొన్నాడు. చిన్న అట్టముక్క నుంచి నివ్‍కో ఫలకాన్ని తయారు చేశాడు. సైకిల్ షాప్ లో కొన్ని కటకాలను కొన్నాడు.మిలిటరీ స్టోర్ లో మూల పడేసిన పాత వైర్‍లెస్ టెలిగ్రాఫ్ పరికరాన్ని సంపాదించాడు. టార్చ్ బ్యాటరీలు, సూదులు, కొయ్యముక్కలు, కాస్త లక్క, దారాలు, జిగురు, గదిలో ఎక్కడ చూసినా పడిఉండే తీగలు - ఇవీ అతని ప్రయోగశాలలోని పరికరాలు! రెండేళ్ళ నిరంతర కృషి ఫలితంగా కొన్ని ఆకారాల్ని సుమారు మూడు మీటర్ల దూరందాకా ప్రసారం చేయడంలో బెయిర్డ్ కృతకృత్యులయ్యాడు.తరువాతి పరిశోధనల ఫలితంగా 1925 అక్టోబర్ 2 వ తేదీన ఓ కంపెనీ లో పనిచేసే అబ్బాయి ముఖాన్ని ప్రసారంచేశాడం, ఈ చిత్రాన్ని పక్క గదిలోని రిసీవర్లో చూడటం జరిగింది. కొన్ని నెలల తర్వాత, అతడు తన పరికరాన్ని వైజ్ఞానిక సంఘ సభ్యులకూ, పత్రికా విలేఖరులకూ ప్రదర్శించాడు. (ఇంకా…)