వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2013 38వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హోమియోపతీ వైద్య విధానం

హోమియోపతీ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న వైద్య పద్ధతి. ముఖ్యంగా భారత దేశంలో దీనికి లభిస్తూన్న ప్రజాదరణ, తదౄపేణా ప్రభుత్వాదరణ, ప్రపంచంలో మరెక్కడా లేదనటం అతిశయోక్తి కాదు. ఈ పద్ధతి దరిదాపు రెండు వందల ఏళ్ళబట్టీ వాడుకలో ఉన్నప్పటికీ దీనికి శాస్త్రీయమైన పునాదులు లేవనే నింద ఒక చెరగని మచ్చలా ఉండిపోయింది. ఆధునిక శాస్త్రీయ దృక్పధంతో చూస్తే ఈ నిందారోపణ సబబయినదే అనిపిస్తుంది. కాని హోమియోపతీ వైద్యం వల్ల వ్యాధి నయమైన వారు ముందుకు వచ్చి ఇచ్చే సాక్ష్యం సంగతి ఏమిటని ప్రతి సవాలు చేసేవారూ ఉన్నారు.హోమియోపతీ అన్నది హోమోయిస్ (ఒకే రకమైన), పేథోస్ (బాధ, రోగ లక్షణం) అనే రెండు గ్రీకు మాటలని సంధించగా పుట్టిన మాట. కనుక కావలిస్తే దీనిని తెలుగులో సారూప్యలక్షణవైద్యం అనొచ్చు. ఉష్ణం ఉష్ణేత శీతలే అన్నట్లు, వజ్రం వజ్రేనభిద్యతే అన్నట్లు ఒక పదార్ధం ఏ బాధని కలిగిస్తుందో ఆ బాధని నివారించటానికి అదే పదార్ధాన్ని మందుగా వాడాలి అన్నది హోమియోపతీ మూల సూత్రం. ఈ వైద్యపద్ధతిని, ఈ మాటని కనిపెట్టినది సేమ్యూల్ హానిమాన్ (1755-1843) అనే జెర్మనీ దేశపు వైద్యుడు. ఈయన వైద్య కళాశాలకి వెళ్ళి లక్షణంగా అప్పటి వైద్యశాస్త్రం అధ్యయనం చేసేడు. ఆ రోజులలో వైద్యం అంటే నాటు వైద్యమే. రోగానికి కారణం మలినపు రక్తం అనే నమ్మకంతో రోగి రక్తనాళాలని కోసి రక్తం ఓడ్చేసేవారు. దేహనిర్మాణశాస్త్రం (ఎనాటమీ), రోగనిర్ణయశాస్త్రం, రసాయనశాస్త్రం అప్పటికి ఇంకా బాగా పుంజుకోలేదు. కనుక అప్పటి వైద్య విధానాలలో హానిమాన్ కి లోపాలు కనిపించటం సహజం. ఈ లోపాలని సవరించటానికి ఆయన ఒక కొత్త పద్ధతిని కనిపెట్టేడు. అదే హోమియోపతీ. హోమియోపతీ వాడుకలోకి వచ్చిన తరువాత హోమియోపతీ భక్తులు ఇప్పుడు వాడుకలో ఉన్న ఇంగ్లీషు వైద్యాన్ని "ఎల్లోపతీ" అనటం మొదలు పెట్టేరు. అంతేకాని ఇంగ్లీషు వైద్యులు ఎవ్వరూ వారి వైద్యపద్ధతిని "ఎల్లోపతీ" అని అనరు.

(ఇంకా…)