వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2014 11వ వారం
చక్రం మనిషి కనుగొన్న మొట్టమొదటి పరికరం. చక్రం అనేది ఒక అక్షం చుట్టూ తిరిగే గుండ్రటి పరికరం. రవాణా మరియు ఎన్నోరకాల యంత్రాలలో చక్రాలు విరివిగా వాడబడుతున్నాయి. ఇరుసు సహాయంతో చక్రం దొర్లడం వల్ల రవాణాలో ఘర్షణ లేదా రాపిడి తగ్గుతాయి. ఏదో ఒక యంత్రం లేదా మంత్రం మనల్ని చారిత్రక పూర్వం యుగంలోకి తీసుకెళ్ళిందనుకొందాం. నేటి జీవితంలో మనం అలవాటు పడ్డ ఎన్నో వస్తువులు అక్కడ లేక పోవటంతో బ్రతుకు దుర్భరంగా ఉంటుంది. తిండీ,బట్టా, ఇల్లూ ఎలా సంపాదించుకోవాలి? అన్నీ సమస్యలుగానే ఉంటాయి. కాళ్ళూ, చేతులూ, మెదడు తప్ప మన దగ్గర మరేమీ ఉండదు. వీటిని ఉపయోగించే మన అవసరాలను తీర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మొదట ఏవో మొరటు ఆయుధాల్ని తయారుచేసి, అడవుల్లో వేటాడి జంతువుల్ని చంపాలి. రవాణా సౌకర్యాలు లేవు గనక మనం నివసించే గుహకు ఆ జంతువుల్ని ఎలా తీసుకువావాలో బుర్ర గోక్కోవాలి. అడవిలో వాటిని లాక్కు రావటం అసాథ్యం కాదు గానీ, శ్రమతో కూడుకున్న పనే. చెట్టు కొమ్మల మీద లేదా పొడుగాటి కొయ్య దిమ్మ మీద జంతువుల్ని పడవేసి లాగితే బాగుంటుందని ఎవరో ఒకరు అంటారు. ఇలా చేస్తే లాగటం సులువుగా ఉంటుంది. భూమి మీద రవాణాకు సంబంధించి ఇది మొట్టమొదటి వాహనం అవుతుంది.ఇది సుమారు 15 వేల ఏళ్ళ నాటి పరిస్థితి.
(ఇంకా…)