వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2014 16వ వారం
ఐస్ క్రీం అనగా పాలు, ఐసు (మంచు), చక్కెర మొదలైన పదార్థాలతో తయారు చేసిన ఒక నోరూరించే తినుబండారం. ఐస్ క్రీం ప్రపంచ వ్యాప్తంగా చాలామందికి ఇష్టమైన ఆహారం. ముఖ్యంగా వేసవి కాలంలో ఐస్ క్రీం సెంటర్ల వైపు మొగ్గుచూపడం సాధారణంగా జరుగుతుంటుంది. తీవ్రమైన ఎండల ప్రభావం వల్ల కలిగిన అలసటనుండి విముక్తి పొందడానికి జనం ఆశ్రయించే ఈ ఐస్ క్రీములు నేడు సర్వకాల సర్వావస్థలయందు మానవుడి ఆహార అంతర్భాగాలలో ఒకటి కావడం విచిత్రమైన పరిణామం. ఇతర వంటలలాగా, ఇతర తినుబండారాలాగా ఐస్ క్రీం ఒకరి చేత తయారుచేయబడింది కాదు. దీని సృష్టికర్త ప్రత్యేకమైన వంటగాడేమీ కాదు. ఇది తనకు తానుగా ఏర్పడింది. ప్రాచీన కాలంలో రాజులు, జమీందారులు, ధనికులు, ఇతర సంపన్న వర్గాలవారు సాధారణంగా వైన్ లాంటి మత్తు పానీయాలు సేవించేవారు. వైన్ గానీ, సారా గానీ చల్లబడినప్పుడు, ఇతర నాజూకు పదార్ధాలను ఐస్‌తో చల్లబరచినప్పుడు పరిణామాత్మకంగా ఇది ఏర్పడింది. క్రీ.శ. 62లో రోమన్ చక్రవర్తి నీరో తన వైను గదిని చల్లబరుచుకోవడానికి ఐసు కోసం తన సేవకులను అపినైన్ పర్వతాలకు పంపించాడు. ఐసు కోసం సుదూర ప్రాంతాలకు వ్యయ ప్రయాలకు ఓర్చడం ఆ కాలంలో ఉండేది. ఐసుకు ఆ కాలంలోనే అంత ప్రాధాన్యత ఉండేది.13వ శతాబ్దంలో దూర ప్రాచ్య దిశ నుండి మర్కోపోలో వచ్చినప్పుడు అనేక అమూల్య వస్తువులతోపాటు ఆనాడు ఆసియాలో బహుళ ప్రచారంలో ఉన్న మిల్క్ ఐస్ చేసే విధానాన్ని కూడా తీసుకువచ్చాడు. ఈ రుచికర పదార్ధం ఇటలీలో శీఘ్ర ప్రచారం పొందింది.
(ఇంకా…)