Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2014 24వ వారం

వికీపీడియా నుండి

ఇడ్లీ

ఇడ్లీ దక్షిణ భారత దేశంలో విరివిగా వాడే అల్పాహార వంటకం. ఇడ్లీలు గుండ్రంగా రెండు లేదా మూడు అంగుళాల వ్యాసం కలిగి ఉంటాయి. మినప పప్పు మరియు బియ్యపు పిండి కలిపి పులియబెట్టిన పిండిని గుంత అచ్చులు ఉన్న పళ్లాలపైపోసి ఆవిరితో ఉడికించి తయారుచేస్తారు. మినప్పప్పు లోని ప్రోటీన్లు, బియ్యంలోని పిండి పదార్థాలు కలిసి శరీరానికి కావలసిన శక్తిని ఇస్తాయి. పిండి పులియడం వల్ల శరీరం సులభంగా జీర్ణించుకోగల చిన్న పదార్ధాలుగా విచ్ఛిన్నం చెందుతుంది. అందుకే దీన్ని పసి పిల్లలకూ, అనారోగ్యంతో బాధ పడేవారికీ తరచుగా తినిపిస్తూ ఉంటారు. సాధారణంగా ఉదయం పూట అల్పాహారంగా తినే ఇడ్లీలను, వాటితో పాటు నంజుకుని తినటానికి చట్నీ లేదా సాంబారు లేదా కారంపొడిగానీ, పచ్చడితో గానీ వడ్డిస్తారు. ఎండు మసాలాలను కలిపి దంచి తయారుచేసిన ముళగాయి పొడి వంటి పొడులు ఇడ్లీలను ప్రయాణాలలో వెళుతూ వెళుతూ తినటానికి అనువుగా ఉంటాయి. అంతే కాకుండా, ఇడ్లీలు ప్రపంచంలోని పది అత్యంత ఆరోగ్యవంతమైన వంటకాలలో ఒకటిగా పరిగణించబడుతున్నది. దోశకు మరియు వడకు తమిళ దేశాన రెండు వేల సంవత్సరాల ఘనమైన చరిత్ర కలదు కానీ, ఇడ్లీ మాత్రము విదేశీ దిగుమతి. సాహిత్యములో తొలిసారి ఇడ్లీ వంటి వంటకము యొక్క ప్రస్తావన (ఇడ్డలిగే) 920 లో శివకోట్యాచార్య యొక్క “వడ్డారాధనే” అనే కన్నడ రచనలో ఉన్నది. ఆ తరువాత 1130 లో కళ్యాణీ చాళుక్య చక్రవర్తి మూడవ సోమేశ్వరుడు రచించిన సంస్కృత విజ్ఞాన సర్వస్వము మానసోల్లాస లో ఇడ్లీ తయారు చేసే విధానము ఇవ్వబడినది. అయితే ఈ రచనలలో ఆధునిక ఇడ్లీ తయారీకి ప్రధాన భాగలైన మినపప్పు తో పాటు బియ్యపుపిండి కలపడము, పిండిని పులియబెట్టడము, పిండి పొంగడానికి ఆవిరిపట్టడము మొదలైన విషయాల గురించిన ప్రస్తావన లేదు.


(ఇంకా…)