Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2014 27వ వారం

వికీపీడియా నుండి

పెదవేగి

పెదవేగి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము, అదే పేరున్న గ్రామము.ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో గల పెద్ద మండలాల్లో ఒకటి. పెదవేగి గ్రామము పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రము అయిన ఏలూరుకు 12 కి.మీ. దూరములో ఉన్నది. జిల్లా కేంద్రం ఏలూరు నుండి గోపన్నపాలెం మీదుగా పెదవేగి చేరుకోవచ్చును. ఇది మెరక ప్రాంతం. (కాలువల వంటి సదుపాయాలు లేవు). ప్రధానమైన వూరుతో బాటు గార్ల మడుగు, దిబ్బగూడెం లక్ష్మీపురం, దిబ్బగూడెం సెంటర్ వంటి శివారు గ్రామాలు జనావాస కేంద్రాలు. చాలా ఇండ్లు వూరిలో కేంద్రీకృతం కాకుండా తోటలలో విస్తరించి ఉంటాయి.మండల వ్యవస్థ రావడానికి ముందు పెదపాడు బ్లాక్ (పంచాయితీ సమితి)లో ఒక వూరిగా, ఏలూరు తాలూకాలో పెదవేగి ఉండేది. తరువాత ఇది పెదవేగి మండల కేంద్రమైంది. పెదవేగి ప్రాంతంలో నేల అధికంగా ఎర్రచెక్కు నేల. పైన ఒకటి అడుగు వరకు ఇసుక ఉండి దాని క్రింద ఎర్రమట్టి, రాతినేల (గ్రావెల్) ఉంటాయి. ఇక్కడ ప్రధానముగా మెరక పంటలు - కొబ్బరి, నిమ్మ, బత్తాయి,కూరగాయలు, పామాయిల్, పుగాకు వంటి వ్యవసాయము ఎక్కువగా జరుగుతున్నది. ఒక పెద్ద చెరువు, మరి రెండు చిన్న చెరువులు (మిరపకుంట, ఏనుగు గుండం) ఉన్నాయిగాని, భూగర్భజలాలే ప్రధాన నీటివనరు. 1970 వరకు ఎక్కువగా బీళ్ళు, చిట్టడవులుగా ఉన్న ఈ ప్రాంతంలో కరెంటు సదుపాయము వల్ల వ్యవసాయం చాలా వేగముగా అభివృద్ధి చెందింది. అడవులతో పోటీపడే దట్టమైన తోటలు చుట్టుప్రక్కల కనువిందు చేస్తాయి.


(ఇంకా…)