వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2014 33వ వారం
భారత ఉపఖండం లో స్వాతంత్ర్య సముపార్జనకై జరిగిన అనేక ఉద్యమాలనన్నిటినీ కలిపి "భారత స్వాతంత్ర్యోద్యమము" గా పరిగణిస్తారు. అనేక సాయుధ పోరాటాలు, అహింసాయుత పద్ధతిలో జరిగిన ఉద్యమాలు భారత స్వాతంత్ర్యోద్యమములో భాగాలు. భారత ఉపఖండంలోని బ్రిటిష్ మరియు ఇతర వలసపాలకుల పాలనను అంతమొందంచటానికి వివిధ సిద్దాంతాలను అనుసరించే అనేక రాజకీయపక్షాలు ఉద్యమించాయి. 16వ శతాబ్దములో బుడతగీచు (పోర్చుగీసు) వారి ఆక్రమణలకు వ్యతిరేకంగా అబ్బక్కరాణి చేసిన పోరాటాలను, 17వ శతాబ్దం మధ్యలో బెంగాల్ లో ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటాలను వలస పాలనపై వ్యతిరేకతకు మొదటి అడుగులుగా చెప్పవచ్చు. మొదటి సంఘటిత సాయుధ పోరాటం బెంగాల్ లో ప్రారంభమై తరువాత రాజకీయ పోరాటంగా పరిణామం చెంది భారత జాతీయ కాంగ్రెస్ గా ఆవిర్భవించింది. 20వ శతాబ్దం మెదట్లో ఈ పద్దతులలో మౌలికమైన (రాడికల్) మార్పులు వచ్చాయి. కాంగ్రెసులో అతివాదులైన లాలా లజపతిరాయ్, బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్ర పాల్, (లాల్ బాల్ పాల్) విదేశీవస్తు బహిష్కరణ, సమ్మె, స్వావలంబన మొదలైన పద్ధతులను అవలంబిస్తే, అరబిందో వంటివారు తీవ్రవాద మార్గాలను అవలంబిచారు. మెదటి దశకాలలో సాయుధ విప్లవ పోరాటాలు ప్రారంభమయ్యాయి. మొదటి ప్రపంచయుద్ధ సమయంలో జర్మనీ, అమెరికాల లోని భారత స్వాతంత్రయోధులు ప్రారంభించిన గదర్ పార్టీ సహకారంతో జరిగిన సంఘటిత భారతసిపాయిల తిరుగుబాటు జాతీయోద్యమంలో వచ్చిన మౌలిక మార్పుగా చెప్పవచ్చు.
(ఇంకా…)