వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2015 09వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గాడ్గే బాబా

దేబూజీ ఝింగ్‌రాజీ జానోర్కర్ (ఫిబ్రవరి 23, 1876 – డిసెంబర్ 20, 1956) సంత్ గాడ్గే మహరాజ్‌గా, గాడ్గే బాబాగానూ(హిందీ: गाडगे बाबा) సుప్రఖ్యాతుడైన సాధువు, సంఘసంస్కర్త. సంచార భిక్షువు. మహారాష్ట్రవ్యాప్తంగా వున్న తన భక్తుల సహకారం తీసుకుని వారంవారీ పండుగలు నిర్వహించేవారు. గ్రామాలలో శుభ్రత, తోటివారికి సాయపడే లక్షణం, సేవ వంటివాటిని ప్రచారం చేస్తూండేవారు. భారతదేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పక్షాలూ, సేవాసంస్థలు ఆయనను స్ఫూర్తిగా స్వీకరిస్తూన్నారు. ఆయన అసలుపేరు దేవీదాస్ దేబూజీ. గాడ్గే బాబా మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన అంజన్గావ్ తాలూకాకు చెందిన షేన్గావ్ గ్రామంలోని రజక కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు జింగ్రాజీ, సక్కుబాయిలు. వారు రజక కులంలో జన్మించినా తండ్రితాతల కాలం నుంచే ఉన్న భూమిని సాగుచేసుకుంటూ జీవించేవారు. తండ్రి దేబూజీ చిన్నతనంలోనే మద్యపానానికి బానిసై మరణించడంతో దేబూజీ మేనమామ ఇంట్లో ఆశ్రయం పొందారు. మేనమామ కూడా మంచి భూవసతి కలిగినవాడు కావడంతో దేబూజీ ఆయన పశువుల్ని చూసుకుంటూ, పొలంపనులు చేస్తూ కుటుంబంలో మంచిపేరు తెచ్చుకున్నారు. చిన్నతనం నుంచీ భజనమండళ్ళలో కీర్తనలు, పాటలు పాడుతూ చుట్టుపక్కల గ్రామాలలో కూడా ప్రఖ్యాతిపొందారు. ఆయన సన్యాసాశ్రమ పూర్వపు జీవితంలో ఒక ముఖ్యమైన ఘటన జరిగింది. షావుకారు తన ఆస్తిని అన్యాయంగా ఆక్రమించుకోబోగా దానిని సహించలేక ఎదురుతిరిగారు. షావుకారు గూండాలను పంపితే దేబూజీ ఒక్కడే వారందరినీ తన్ని తరిమేశారు.

(ఇంకా…)