Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2015 30వ వారం

వికీపీడియా నుండి

రాగతి పండరి

రాగతి పండరి ( జూలై 22 1965 - 19 ఫిబ్రవరి 2015) తెలుగు వ్యంగ్య చిత్రకారులు/కార్టూనిస్టులలో (వాగ్దేవి, కె.సి లలిత అడపాదడపా వ్యంగ్య చిత్రాలను ప్రచురించినప్పటికీ), రాశిలోనూ, వాసిలోనూ సమానమైన కీర్తి ప్రతిష్టలను ఆర్జించుకున్న ఏకైక మహిళా కార్టూనిస్ట్. అదొక్కటే ప్రత్యేకత కాదు, అనతి కాలంలోనే తెలుగు వ్యంగ్య చిత్ర కళా రంగంలో చాలా మంచి పేరు తెచ్చుకుని, ఆ రంగంలో అగ్రగణ్యులైన బాపు, జయదేవ్, బాబు ల సరసన నిలబడగలిగిన స్థాయి చేరుకున్నది. ఈ మంచి పేరుకు వెనుక అకుంఠిత దీక్ష, వ్యంగ్య చిత్ర కళ మీద ఎనలేని ప్రేమ, నిరంతర పరిశ్రమ ఉన్నాయి. దురదృష్టవశాత్తూ, ఈమెకు చిన్నతంలో వచ్చిన పోలియో మూలంగా శారీరకంగా చలాకీగా తిరగలేక పోయినా, అంతకు మించిన మానసిక చలాకీతనంతో, చకచకా కార్టూన్లు గీసి అందరి మన్ననలు అందుకున్నది. ఆమె మాటలలోనె చెప్పాలంటే, "జీవితంలో వేదనని కాసేపు పక్కకు నెట్టి, నిండుగా నవ్వగలిగే శక్తినిచ్చే కార్టూన్లు, మనిషికి గ్లూకోజు డోసులాంటివి". ఏవిధమైన తటపటాయింపు లేకుండా, తాను కార్టూన్లు గీయాలన్న కోరిక మరియు స్పూర్తి, ప్రముఖ కార్టూనిస్ట్ జయదేవ్ కలగ చేశారని చెపుతుంది. అలాగే, జయదేవ్ కూడ రాగతి పండరి తన నిజమైన శిష్యురాలని చెప్పుకుంటారు. రాగతి పండరి 1965 సంవత్సరం జూలై 22 న విశాఖపట్టణంలో జన్మించింది. ఈమె తండ్రి రాగతి గోవిందరావు. తల్లి రాగతి శాంతకుమారి. ఈమె చదువు ఇంటివద్దనే కొనసాగింది.

(ఇంకా…)