Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2015 38వ వారం

వికీపీడియా నుండి

కురుమూర్తి

కురుమూర్తి మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని ఒక గ్రామము. ఈ గ్రామములో, జిల్లాలోనే అతి పురాతనమైన దేవస్థానంగా పేరుగాంచిన, కురుమూర్తి వేంకటేశ్వర దేవస్థానం కలదు. మహబూబ్ నగర్ నుండి కర్నూలు వెళ్ళు రైలు మార్గములో కురుమూర్తి కలదు. ఈ దేవస్థానానికి బస్సు సౌకర్యము కూడా కలదు. తిరుమల వేంకటేశ్వర ఆలయానికి, కురుమూర్తి ఆలయానికి పోలికలున్నాయి. ఈ క్షేత్రాన్ని గురించి కపిలవాయి లింగమూర్తి, వైద్య వెంకటేశ్వర్లు పరిశీలించి విశ్లేషాత్మక వివరణలతో పరిశీలించారు. అమ్మాపూర్‌ గ్రామ సమీపంలో ఏడు కొండల మధ్య వెలసిన స్వయంబువంపై లక్ష్మి సమేతంగా వెలిసిన స్వామివారు పేదల తిరుపతిగా ఇక్కడ మొక్కులందుకుంటున్నారు. పూర్వం కురుమూర్తికి కురుమతి పేరు ఉన్నట్లు ఆలయ చరిత్ర ప్రకారం తెలుస్తున్నది. ఆత్మకూరు పట్టణానికి 13 కిలోమీటర్ల దూరంలో ఎత్తయిన ఏడు కొండలపై ఉన్న కురుమూర్తి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం క్రీ.శ. 1268 ప్రాంతములో ముక్కెర వంశ మూలపురుషుడు గోపాలరాయుడు నిర్మించాడు. 1350లో చంద్రారెడ్డి అభివృద్ధిపర్చగా, సోమభూపాలరావు కొండపైకి మెట్లు నిర్మించి ఏటా జాతర నిర్వహించే సాంప్రదాయం అమలులోకి తెచ్చాడు.1870 లో ఉద్దాల మండపం ఏర్పాటు చేశారు. కురుమూర్తి బ్రహ్మోత్సవాలలో ఉద్దాల (పాదుకల) ఊరేగింపు ప్రధాన ఘట్టం. వేడుకలు మండల పరిధిలోని వడ్డేమాన్ నుంచి ప్రారంభమౌతాయి. ఆ పాదుకలను ఈ మండపంలో ఉంచుతారు. వీపుపై పాదుకలతో కొట్టించుకుంటే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం.

(ఇంకా…)