Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2016 24వ వారం

వికీపీడియా నుండి

ఆలప్పుళా

ఆలప్పుళా మధ్య కేరళ లోని ఒక ముఖ్య పట్టణం. ఇదే పేరుతో గల జిల్లాకు జిల్లా కేంద్రం. అల్లెప్పి అని కూడా ఈ పట్టణానికి పేరు ఉంది. ఇది కేరళలో పూర్తి స్థాయిలో ప్రణాళికా బద్ధంగా రూపొందించబడిన పట్టణం. ఇక్కడి లైట్ హౌస్ కూడా ఎంతో ప్రత్యేకమయినది. 2001 జనాభా లెక్కల ప్రకారం ఇది కేరళలో ఆరవ అతిపెద్ద పట్టణం, దీని జనాభా లక్షా డెబ్బైఏడు వేల ఇరవై తొమ్మిది. ఈ పట్టణంలో అందమయిన కాలువలు, ఉప్పుటేఱు, సముద్ర తీర ప్రాంతం, బీచ్, మరియు ఉప్పునీటి సరస్సులు ఉన్నాయి. లార్డ్ కర్జన్ ఈ ప్రాంతాన్ని వెనిస్ ఆఫ్ ది ఈస్ట్ అని కొనియాడాడు. మలయాళం ఇక్కడి ముఖ్య భాష. హిందీ, ఆంగ్లం మరియు అరవం కూడా విస్తృతంగా మాట్లాడబడతాయి. ఆలెప్పీ భారతదేశంలోని పర్యాటక కేంద్రాల్లో ముఖ్యమయినది. ఇక్కడి ఉప్పుటేరులు ఒక రమణీయ అనుభూతిని కలిగిస్తాయి, ఇవే ఇక్కడి ముఖ్య ఆకర్షణ. హౌస్ బోట్ మరో ఆకర్షణ. కేరళ ఉత్తరాన కుమరకోం మరియు కొచ్చిన్ ను దక్షిణాన ఉన్న క్విలాన్ కి కలిపే కయ్య కు ఆలెప్పీ కేంద్రంగా ఉంది. ప్రతీ సంవత్సరం జరిగే నెహ్రూ ట్రాఫీ బోట్ రేస్ కు ఆలప్పుళా లోని పున్నమాడ చెరువు వేదికవుతుంది. ఈ పడవల పందెం ప్రతీ సంవత్సరం ఆగస్టు రెండో శనివారం జరుగుతుంది. డిసెంబర్ లో పది రోజులపాటూ జరిగే ములక్కల్ చిరప్ కూడా మరో ప్రత్యేక ఆకర్షణ. ఆలెప్పీలో కొబ్బరిపీచు ఉత్పాదనలు ముఖ్యమయిన పరిశ్రమ. కాయిర్ ఇండస్ట్రీ ఆక్ట్, 1955ను అనుసరించి కేంద్ర ప్రభుత్వం కాయిర్ బోర్డ్ ను ఇక్కడ స్థాపించింది. కలవూరులో మరొక కాయిర్ రీసెర్చ్ సంస్థానం ఉంది.

(ఇంకా…)