వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2016 41వ వారం
మాడపాటి హనుమంతరావు ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు రచయిత. హనుమంతరావు 20వ శతాబ్ది తొలిదశకంలో హైదరాబాద్ రాజ్యంలోని తెలుగు ప్రాంతాల్లో(నేటి తెలంగాణ) ఆంధ్రోద్యమం వ్యాప్తిచేసేందుకు కృషిచేశారు. ఆయన చేసిన కృషికి గాను ఆంధ్ర పితామహుడు అన్న పేరును పొందారు. న్యాయవాద వృత్తిని చేపట్టిన మాడపాటి విజయవంతమైన లాయరుగా పేరుపొందారు. తీరిక సమయాలన్నిటా ఆంధ్రోద్యమానికి, తెలంగాణాలో గ్రంథాలయాల అభివృద్ధికి కేటాయించేవారు. ఆంధ్రజనసంఘం, ఆంధ్రమహాసభ వంటి ప్రజాసంఘాల స్థాపనలోనూ, వాటి నిర్వహణలోనూ కీలకపాత్ర వహించారు.తర్వాతి తరం ప్రజానాయకులు వీరిని మితవాదిగా గుర్తించారు. ఆయన ప్రజాహితరంగంలో, సాంస్కృతిక చైతన్యం కలిగించడంలో ఎంతో కృషిచేసినా చాలా కాలం వరకూ క్రియాశీలకమైన రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదు. 1952లో శాసనసభకు పోటీచేసి ఓడిపోయారు. హైదరాబాద్ నగరానికి తొలి మేయరు పదివిని అధిష్టించారు. మాడపాటివారు మంచి కవి, రచయిత. మాడపాటి మొత్తం పదమూడు కథలు రాశారు. వీటిలో హృదయశల్యం, రాణీసారందా, ముసలిదాని ఉసురు, నేనే, అగ్ని గుండం, నాడు నీ పంతం, నేడు నా పంతం, ఆత్మార్పణం, తప్పు , ఎవరికి, విధి ప్రేరణం అనే కథలు 'మల్లికాగుచ్చం' పేరుతో 1911 లో పుస్తక రూపం దాల్చాయి. మాడపాటికి రచయితగా శాశ్వత కీర్తిని అందించిన గ్రంథం 'తెలంగాణా ఆంధ్రోద్యమం'.
(ఇంకా…)