వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2017 01వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సుబ్రహ్మణ్య భారతి

చిన్నస్వామి సుబ్రహ్మణ్య భారతి (11 డిసెంబర్ 1882 – 11 సెప్టెంబర్ 1921) తమిళ రచయిత, కవి, పత్రికా సంపాదకుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త. ఆధునిక తమిళ కవిత్వానికి మార్గదర్శిగానూ, "మహాకవి భారతి"గానూ సుప్రసిద్ధుడు, తమిళ సాహిత్య ప్రముఖుల్లో అత్యున్నత వ్యక్తిగా పేరొందారు. ఆయన అసంఖ్యాక రచనలు భారత స్వాతంత్ర ఉద్యమ కాలంలో దేశభక్తి, జాతీయత వంటి భావాలను వెలుగొందేలా చేశాయి. అప్పటి తిరునల్వేలి జిల్లా(ప్రస్తుతం తూత్తుకుడిలో ఉంది)లోని ఎట్టాయపురంలో 1882లో జన్మించారు. ఆయన తొలుత తిరునల్వేలిలోనూ, తర్వాత వారణాసిలోనూ విద్యాభ్యాసం చేసి, పాత్రికేయ రంగంలో స్వదేశమిత్రన్, ఇండియా వంటి పలు పత్రికలకు పనిచేశారు. ఆనాటి భారత జాతీయ కాంగ్రెస్ లో క్రియాశీల సభ్యునిగా జాతీయోద్యమంలో పాలుపంచుకున్నారు. 1908లో భారతి విప్లవాత్మక కార్యకలాపాలకు వ్యతిరేకంగా బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం అరెస్టు వారెంటు జారీచేసింది, ఈ స్థితిగతులు ఆయన పాండిచ్చేరికి వలసపోయి జీవించాల్సిన పరిస్థితిని ఏర్పరిచాయి. ఆయన అక్కడే 1918 వరకూ జీవించారు. భారతి రచనలు మతం, రాజకీయం, సాంఘిక అంశాలకు సంబంధించిన అనేక విస్తృతమైన అంశాలను వస్తువులుగా కలిగివున్నాయి. భారతి రచించిన పాటలను తమిళ సినిమాల్లోనూ, సంగీత కచేరీల్లోనూ విస్తారంగా ఉపయోగిస్తుంటారు. ఆయన రచనల్లో హిందూ దేవతలైన శక్తి, కాళి, వినాయకుడు, సుబ్రహ్మణ్యుడు, శివుడు, కృష్ణుడు వంటివారినే కాక ఇతర మతదేవతలైన అల్లా, ఏసు వంటివారిని కూడా ప్రస్తుతించారు.

(ఇంకా…)