వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2017 15వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Westernmound.jpg

కలిబంగాన్

కలిబంగాన్ రాజస్థాన్, హనుమాన్‌గఢ్ జిల్లా పిలిబంగాన్ తెహసీల్ లోని ఒక పట్నం. ఇది ఘగ్గర్ నదికి దక్షిణపు ఒడ్డున ఉంది. ఈ నదినే సరస్వతీ నదిగా కొందరు పండితులు భావిస్తారు. ఈ పట్నం బికనీర్ నుండి 205 కి.మీ. దూరంలో ఉంది. దృషద్వతి, సరస్వతి నదుల సంగమ స్థలంలోని త్రికోణాకార ప్రదేశంలో ఈ పట్నం నెలకొని ఉంది. సింధు లోయ నాగరికత యొక్క ప్రాక్చారిత్రిక లక్షణాలను ఈ స్థలంలోనే మొదటగా, లుయిగీ టెస్సిటోరి గుర్తించాడు. 2003 లో, ఇక్కడ తవ్వకాలు పూర్తైన 34 ఏళ్ళ తరువాత, భారత పురాతత్వ సర్వే సంస్థ తవ్వకాల నివేదికను ప్రచురించింది. సింధు లోయ నాగరికతలో కలిబంగాన్ ఒక పెద్ద ప్రాంతానికి రాజధానిగా ఉండేదని ఈ నివేదికలో పేర్కొన్నారు. కలిబంగాన్, ఇక్కడి హోమగుండాలకు, ప్రపంచపు మొట్టమొదటి దున్నిన పొలానికీ ప్రసిద్ధమైంది. కలిబంగాన్ ప్రాక్చరిత్రకు చెందిన స్థలమని గుర్తించినది, ఇటలీకి చెందిన ఇండాలజిస్టు లుయిగీ పియో టెస్సిటోరి (1887–1919). భారతీయ శాసనాలపై అతడు పరిశోధన చేస్తూండగా, అక్కడి శిథిలాల లక్షణాలను చూసి ఆశ్చర్యపోయాడు. అప్పటి భారత పురాతత్వ సర్వే సంస్థకు సర్ జాన్ మార్షల్‌ సాయం కోరాడు. ఆ సంస్థ అప్పటికే హరప్పాలో కొన్ని తవ్వకాలు జరిపి ఉంది. కానీ వాళ్ళకు ఈ శిథిలాల లక్షణాల గురించి అవగాహనేమీ లేదు. నిజానికి, ఈ శిథిలాలు ప్రాక్చరిత్రకు, మౌర్యులకు పూర్వ కాలానికి చెందినవనీ కనుగొన్నది టెస్సిటోరియే.

(ఇంకా…)