Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2017 18వ వారం

వికీపీడియా నుండి

ఆత్రేయ

ఆచార్య ఆత్రేయ గా సినీరంగ ప్రవేశం చేసిన కిళాంబి వెంకట నరసింహాచార్యులు (మే 7, 1921 - సెప్టెంబర్ 13, 1989) తెలుగులో సుప్రసిద్ధ నాటక, సినిమా పాటల, మాటల రచయిత, నిర్మాత మరియు దర్శకులు. దాదాపు 400 సినిమాలకు మాటలు, పాటలు రాసిన గొప్పకవి. అత్రేయకి ప్రముఖ నటుడు కొంగర జగ్గయ్య ఆప్తమిత్రుడు.ఆత్రేయ వ్రాసిన పాటలు,నాటకాలు,నాటికలు,కథలు మొదలగు రచనలన్నీ ఏడు సంపుటాలలో సమగ్రంగా ప్రచురించి జగ్గయ్య తన మిత్రుడికి గొప్ప నివాళి అర్పించాడు అని చెప్పవచ్చు. ఆచార్య ఆత్రేయ తెలుగు సినిమా గేయరచయితగా, సంభాషణకర్తగా పేరుపొందినా నిజానికి ఆయన మాతృరంగం నాటకాలే. నాటక రచయితగా ఆయన స్థానం సుస్థిరం. మనసుకవిగా సినిమా వారు పిలుచుకునే ఆత్రేయ నాటకాల్లో చక్కని ప్రయోగాలు చేసి నాటక రంగాన్ని మలుపుతిప్పారు. 1921 మే 7 న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సూళ్ళూరుపేట మండలంలో గల మంగళంపాడు గ్రామంలో జన్మించాడు. తండ్రి కృష్ణమాచార్యులు. తల్లి సీతమ్మ. చిన్నప్పటినుండి నాటకంలోని పద్యాలను రాగయుక్తంగా చదివేవారు. సమాజంలో మధ్య తరగతి కుటుంబ సమస్యలను తీసుకుని మనోహరమైన నాటకాలుగా మలిచారు. ఆత్రేయ తాత్విక ధోరణితో రాసిన సంభాషణలు జీవిత తత్వాన్ని గుట్టువిప్పుతాయి. జీవితాన్ని కాచి వడబోసిన నగ్నసత్యాలు. ప్రతి వ్యక్తి జీవితానికి మార్గ దర్శకాలు. "వెలుగు నీడలు" చిత్రంలో ఇటువంటి ఓ అద్భుత సంభాషణ తనదైన శైలిలో రాసి ఓ సన్నివేశానికి ఆత్రేయ జీవం పోసారు.

(ఇంకా…)