వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2017 29వ వారం
బోయి భీమన్న సామాజిక చైతన్యాన్ని ఆశించి రచనలు చేసి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవి, రచయిత. మారుమూల పల్లెలో దళిత పాలేరు ఇంట పుట్టి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, పద్మ భూషణ్ తో పాటు లెక్కకు మిక్కిలిగా గౌరవ, సన్మానాలందుకున్న కవి, బోయి భీమన్న. పేదరికంతో పాటు, అంటరానితనం వంటి దురాచారాలు కూడా చిన్నప్పటినుండి భీమన్నకు అనుభవమే. సహజంగానే ఆయన వీటిని నిరసించాడు. అంబేద్కర్ వ్రాసిన కులనిర్మూలన పుస్తకాన్ని తెలుగులోకి తర్జుమా చేశాడు. భీమన్న 1911 సెప్టెంబరు 19 న తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు గ్రామంలో ఓ హరిజన కుటుంబంలో పుట్టాడు. నాగమ్మ మరియు పుల్లయ్య ఇతని తల్లిదండ్రులు. వీరికి పంచపాండవుల వలె ఐదుగురు మగపిల్లలు మరియు ఒక ఆడపిల్ల జన్మించారు. పుల్లయ్య తన మగపిల్లలకు వరుసగా ధర్మరాజు, భీమన్న, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అనే పేర్లు పెట్టాడు. భీమన్న 1935లో బి.ఎ. పరీక్షలో ఉత్తీర్ణుడై 1937లో బి.ఇడి. పూర్తి చేశాడు. గుడిసెలు కాలిపోతున్నాయ్ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు వరించింది. 2001లో భార త ప్రభుత్వం భీమన్నను పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది. 2005 డిసెంబరు 16న హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు.
(ఇంకా…)