వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2017 31వ వారం
డాక్టర్ ఆశావాది ప్రకాశరావు సాహితీ ప్రపంచంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా, బహుగ్రంథరచయితగా, అవధానిగా, కవిగా పేరు గడించాడు. తారణ నామ సంవత్సరం, శ్రావణమాసం, త్రయోదశి, బుధవారం 1944వ సంవత్సరం ఆగష్టు 2 వ తేదీ ఆశావాది ప్రకాశరావు కుళ్ళాయమ్మ, పక్కీరప్ప దంపతులకు కొరివిపల్లి గ్రామంలో మాతామహుల ఇంటిలో జన్మించాడు. ఇతని అసలు పేరు ఆసాది ప్రకాశం. ఇతని గురువు నండూరి రామకృష్ణమాచార్య ఇతని పేరును ఆశావాది ప్రకాశరావుగా మార్చాడు. దళిత కుటుంబంలో జన్మించిన ఇతని బాల్యం బెళుగుప్ప, శీరిపి గ్రామాలలో గడిచింది. ఆ గ్రామాలలోని సోషియల్ వెల్ఫేర్ స్కూళ్లలో ప్రాథమిక విద్యను అభ్యసించాడు. అవధాన విద్యలో డాక్టర్.సి.వి.సుబ్బన్న శతావధానిని గురువుగా స్వీకరించి అతని ఆశీస్సులతో ఆశుకవిత అలవరచుకున్నాడు. 1963లో తన 19వయేట మొదటి అవధానం చేశాడు. అప్పటి నుండి ఆంధ్రసాహితీ చరిత్రలో దళితులలో ఏకైక అవధానిగా ముద్రవేసికొని అసాధారణ ధారణాశక్తితో, అనిర్వచనీయమైన మహేంద్రజాలశక్తితో శ్రోతలను మంత్రముగ్ధులను చేశాడు. ఇతడు ఆంధ్రదేశంలోనే కాకుండా ఆంధ్రేతర ప్రాంతాలైన తరుత్తణి, అరక్కోణం, పళ్ళిపట్టు, హోసూరు,బెంగళూరు, బళ్లారి, తుంగభద్రడ్యామ్, దోణిమలై, ఢిల్లీ మొదలైన పలుప్రాంతాలలో 171 అష్టావధానాలు, ఒక ద్విగుణిత అష్టావధానం చేశాడు. ఇతని అవధానాలు దూరదర్శన్, ఆకాశవాణిలలో కూడా ప్రసారం అయ్యాయి. కొన్ని ఆశుకవితా ప్రదర్శనలు కూడా ఇచ్చాడు.
(ఇంకా…)