వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2017 37వ వారం
దళిత వైతాళికుడుగా ప్రసిద్ధి చెందిన భాగ్యరెడ్డి వర్మ (మే 22, 1888 - ఫిబ్రవరి 18, 1939) సంఘ సంస్కర్త, ఆది ఆంధ్ర సభ స్థాపకుడు. 1906-1933 మధ్య హైదరాబాదు సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి, వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశాడు. జగన్మిత్రి మండలి, మన్యసంఘం, సంఘసంస్కార నాటకమండలి, అహింసా సమాజంలను స్థాపించి హైదరాబాదు ప్రాంతంలో సంఘసంస్కరణలకై కృషిచేశారు. మాదరి వెంకయ్య, రంగమాంబ దంపతులకు 1888 సంవత్సరం, మే 22వ తేదీన రెండవ సంతానంగా జన్మించిన భాగయ్య, ఆ తర్వాత కాలంలో తన పేరును భాగ్యరెడ్డిగా మార్చుకున్నాడు. 1888 నవంబరులో వారి కుటుంబ గురువు వారిని సందర్శించడానికి వచ్చి పిల్లవానికి భాగయ్యకు బదులు భాగ్యరెడ్డి అని నామకరణం చేశాడు. భాగ్యరెడ్డి తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో తల్లి ఐదుగురు సంతానాన్ని ఒక చిన్న కిరాణా కొట్టు నడుపుతూ పోషించింది. 18 ఏళ్ళ వయసులో భాగ్యరెడ్డికి లక్ష్మీదేవితో వివాహం జరిగింది. ఈయనకు ఒక శిక్షకుడు ఉండేవాడు కానీ సాంప్రదాయక విద్యాభ్యాసం లేదు. తెలుగు చదవటం, వ్రాయటం మాత్రం వచ్చేది. గోవాకు చెందిన బారిస్టరు దోసా శాంటోస్ ఈయనకు ఆశ్రయమిచ్చి, తిండి పెట్టి తన ఇంటి యొక్క మొత్తం యాజమాన్యాన్ని మరియు ఆరుగురు సేవకుల అజమాయిషీని భాగ్యరెడ్డి చేతుల్లో పెట్టాడు.
(ఇంకా…)