వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2017 38వ వారం
ఏనుగుల వీరాస్వామయ్య (1780 - 1836) తెలుగు రచయిత, యాత్రికుడు. ఇతడు కాశీయాత్ర చరిత్ర విశేషాలు పుస్తకరూపంగా వెలువరించిన వ్యక్తిగా సుప్రసిద్ధుడు. కాశీయాత్ర చరిత్ర మొదటిసారి అచ్చు అయినపుడు కోమలేశ్వరం శ్రీనివాసపిళ్ళై వ్రాసిన ముందుమాట వలన, తన రచనలో సందర్భానుసారంగా వీరాస్వామయ్య పేర్కొన్న విషయాల వలన, దిగవల్లి వేంకటశివరావు, ముక్తేవి లక్ష్మణరావు సంపాదకత్వంలో వెలువడిన కాశీయాత్ర చరిత్ర గ్రంథాలలోని పీఠికల ద్వారా వీరాస్వామయ్య జీవిత విశేషాలు తెలుస్తున్నాయి. ఏనుగుల వీరాస్వామయ్య తెలుగు నియోగి బ్రాహ్మణ కుటుంబంలో శ్రీవత్స గోత్రంలో 1780 ప్రాంతంలో జన్మించాడు. తండ్రి పేరు సామయమంత్రి. 9వ యేటనే వీరాస్వామయ్య తండ్రి గతించాడు. వారి కుటుంబం కొన్ని తరాలుగా మద్రాసులో ఉండేది. 12 యేళ్ళకే వీరాస్వామయ్య ఆంగ్లం ధారాళంగా చదవడం నేర్చుకొన్నాడు. ఆ వయసులోనే "బోర్డ్ ఆఫ్ ట్రేడ్"లో "వాలంటీరు"గా ఉద్యోగంలో కుదిరాడు. అప్పటిలో ఇంగ్లీషు నేర్చుకొన్నవారు అధికంగా వాలంటీరు గానే చేరి, తమ శక్త్యానుసారం పై ఉద్యోగాలకు ఎదిగేవారు. అతి చిన్న వయసులోనే అతని ప్రతిభ చూసి పై అధికారులు అతనిని తమ వద్ద పనిచేయించు కోవాలని పోటీ పడేవారట. తెలుగు, తమిళ, ఇంగ్లీషు భాషలలో కూడా అతను మంచి ప్రతిభ సాధించి ఉండవచ్చును.
(ఇంకా…)