Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2018 23వ వారం

వికీపీడియా నుండి

రావి నారాయణరెడ్డి

రావి నారాయణరెడ్డి, జూన్ 5, 1908 - సెప్టెంబర్ 7, 1991) కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ పోరాటంలో ముఖ్యుడు. ఆయన సంఘ సంస్కర్త, ఉదార ప్రజాస్వామ్యవాది. ఆంధ్రమహాసభ ప్రారంభించిన సాంస్కృతికోద్యమాన్ని క్రమానుగుణంగా వామపక్ష సాయుధ పోరాటంగా పరివర్తన చేసిన గొప్ప నాయకుడు. తెలంగాణ సాయుధ పోరాటానికి ఆద్యునిగా కూడా ఆయనను పేర్కొనవచ్చు. రావి నారాయణరెడ్డి తొలిదశలో ఆంధ్రమహాసభ, ఆంధ్రజనసంఘం ఏర్పరిచిన సాంస్కృతిక చైతన్యం వల్ల ప్రభావితమైనారు. నిజాం పరిపాలనలో తెలంగాణాలో రాజకీయ చైతన్యం లేని స్థితిలోనే ఆయన పోరాటాన్ని ప్రారంభించారు. రెడ్డి హాస్టల్ విద్యార్థిగా ఉండగానే అప్పటి నిజాం కళాశాల విద్యార్థి అయిన బద్దం యెల్లారెడ్డితో కలసి 1930 సంవత్సరంలో దేశవ్యాప్తంగా జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో కాకినాడ వెళ్లి మరీ పాల్గొన్నారు. 1931లో హరిజన సేవాసంఘాన్ని నెలకొల్పి దాని ప్రధాన కార్య దర్శి హోదాలో హైదరాబాద్ రాష్ట్రవ్యాప్తంగా 100 పాఠశాలలు ప్రారంభించారు. రెండు వసతి గృహాలను నిర్వహించారు. 1930లో బ్రిటీష్ ప్రభుత్వం మహాత్మా గాంధీని అరెస్టు చేయగా, దానికి నిరసనగా హైదరాబాద్‌లోని హస్మద్ గంజ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. బ్రిటీష్ ప్రభుత్వం చేపట్టిన ప్రజావ్యతిరేక చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ మాట్లాడారు. నిజామాంధ్ర మహాసభలోని భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, ఆర్యసమాజ్, హిందూ మహాసభలతో కలిసి పనిచేసిన కమ్యూనిస్టుగా ఆయన ఆచరణ విశిష్టమైనది.


(ఇంకా…)