వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2018 28వ వారం
హీరాలాల్ మోరియా (జూలై 13, 1924 - అక్టోబరు 13, 2006) పత్రికా రచయిత, నవలా రచయిత, సమరయోధుడు. మోరియా పూర్వికులెప్పుడో ఉత్తరాది నుండి వచ్చి ఖమ్మంలో స్థిరపడినారు. మోరియా తండ్రిగారు కలప వర్తకులైనా సాహిత్యాభిరుచి కలిగినవారు. ఖమ్మంలో పుట్టి పెరిగిన హీరాలాల్ మోరియా ఏడవతరగతి వరకు ఖమ్మం ఉన్నత పాఠశాలలో చదివారు. వందేమాతరం ఉద్యమం సందర్భంగా ఉన్నత పాఠశాల నుంచి ‘రెస్టికేట్ చేయగా హైద్రాబాదులోని కేశవ మోమోరియల్ ఉన్నత పాఠశాలలో చేరి మెట్రిక్ పూర్తిచేశారు. చదువుకునే రోజులనుండే సాహిత్యం పట్ల అభిరుచి కల్గిన మోరియా గార్కి దాశరథి, కవి రాజమూర్తి లాంటి వాళ్ళ స్నేహం కూడా వారి అభిలాషను పెంచగలిగింది. మాతృభాష మరాఠి అయినప్పటికీ తెలంగాణలో అప్పుడు ఉర్దూ ప్రధాన భాషగా ఉండడం వలన ఉర్దూలో ఎనలేని పాండిత్యం సంపాదించారు. స్వయంకృషిలో ఆంగ్లబాషలో కూడా మంచి పట్టును సాధించారు. నిజాం ప్రభుత్వ వ్యతిరేక పోరాటం రోజుల్లో ముఖ్యంగా రజాకార్ల దురంతాలను శక్తివంతంగా ప్రతిఘటించిన స్టేట్ కాంగ్రెస్ ఉద్యమం ఆరంభదినాల్లోనే అనగా మోరియా ఇరవై సంవత్సరాల వయసులోనే స్టేట్ కాంగ్రెస్ ఆదేశం ప్రకారం ఖమ్మం జిల్లాలో మొదటి సారిగా సత్యాగ్రహం చేసి జైలు పాలయ్యారు. మోరియా చక్కటి ఉపన్యాసకుడు. ఆనాటి హైదరాబాద్ సంస్థాన విమోచనోద్యమంలో మోరియా ఉపన్యాసం ఎక్కడ వున్నా ప్రజలు తండోపతండాలుగా, ప్రభుత్వ నిషేధాజ్ఞలను సైతం లెక్కచేయకుండా గుమిగూడుతుండేవారు. తన ఉపన్యాసాలలో నైజాం నవాబు నిరంకుశ పరిపాలనను గురించి, ఆయనకు తొత్తులైన జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌లు, జమిందార్ల గురించి- వారి దోపిడి విధానాలను వివరిస్తూ ప్రపంచంలో వస్తున్న మార్పుల గురించి, ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి అరటిపండు వొలిచినట్టు వివరించేవారు.
(ఇంకా…)