Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2018 39వ వారం

వికీపీడియా నుండి

ఎ. వి. గురవారెడ్డి

గురవారెడ్డి గా పేరు పొందిన డాక్టర్ అన్నపరెడ్డి వెంకట గురవారెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు, రచయిత. ఆయన కీళ్ళవ్యాధులకు చికిత్స చేయడంలో సిద్ధహస్తుడు. హైదరాబాదులోని సన్ షైన్ ఆసుపత్రుల మేనేజింగ్ డైరెక్టరు. అంతకు మునుపు ఇంగ్లండులో పదేళ్ళు, అపోలో ఆసుపత్రిలో కొంత కాలం పనిచేశాడు. కిమ్స్ ఆసుపత్రిని స్థాపించిన వారిలో ఆయన కూడా ఒకడు. ఒక్క ఏడాదిలో 4000 శస్త్రచికిత్సలు చేసి ఆసియా రికార్డు నెలకొల్పాడు. ఆయన అనుభవాలను గురవాయణం అనే పేరుతో పుస్తకం రాశాడు. ఆయన భార్య భవాని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి భవనం వెంకట్రాం కుమార్తె. ఆమె కూడా వైద్యురాలే. కుమార్తె కావ్య లిటిల్ సోల్జర్స్ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు అయిన గుణ్ణం గంగరాజు ఈయనకు తోడల్లుడు. ఆయన గుంటూరులో పుట్టాడు. తల్లి రాజ్యలక్ష్మి. తండ్రి సత్యనారాయణ రెడ్డి బాపట్ల వ్యవసాయ కళాశాలలో ఆచార్యుడు. వారిది ఒక మధ్యతరగతి కుటుంబం. తండ్రి ఉద్యోగరీత్యా వారి కుటుంబం బాపట్లకు తరలి వెళ్ళింది. ఆయన పదోతరగతి దాకా బాపట్ల మునిసిపల్ ఉన్నత పాఠశాలలో చదివాడు. అక్కడే ఆర్ట్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తయింది. బాపట్ల లోని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అనే వైద్యుడి స్పూర్తితో ఆయన కూడా వైద్యుడు కావాలనుకున్నాడు. ఆయన పాఠశాలలో చదువుతున్నప్పటి నుంచి భాషమీద మమకారం ఉండేది. వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో బహుమతులు కూడా సాధించాడు.


(ఇంకా…)